
Marriage Predictions 2026
ప్రేమలకు, పెళ్లిళ్లకు, శృంగారానికి, దాంపత్య జీవితానికి, సుఖ సంతోషాలకు కారకుడైన శుక్రుడు 2026లో మే వరకు మిత్ర, ఉచ్ఛ క్షేత్రాల్లో సంచారం చేయడం, శుభ కార్యాలకు, అదృష్టాలకు కార కుడైన గురువు జూన్ నుంచి ఏడాది పాటు కర్కాటక రాశిలో ఉచ్ఛస్థితిలో ఉండడం వంటి కారణాల వల్ల కొన్ని రాశుల వారికి వివాహాది శుభ ఘడియలకు అవకాశం ఎక్కువగా ఉంది. ఈ రాశుల వారు ప్రేమల్లోనూ, పెళ్లి ప్రయత్నాల్లోనూ తప్పకుండా విజయాలు సాధిస్తారు. వృషభం, మిథునం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకర రాశుల వారికి ఇందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
- వృషభం: రాశ్యధిపతి శుక్రుడు మార్చి వరకు మిత్ర క్షేత్రాలు, ఉచ్ఛ క్షేత్రంలో సంచారం చేయడం, మే నుంచి మరింత అనుకూల స్థానాల్లో సంచారం చేయడం వల్ల ఈ రాశివారికి తప్పకుండా జూలై లోపు వివాహ సంబంధం కుదిరే అవకాశం ఉంది. సంపన్న కుటుంబానికి చెందిన సహోద్యోగితో ప్రేమలో పడడం గానీ, పెళ్లి కావడం గానీ తప్పకుండా జరుగుతుంది. కొద్ది ప్రయత్నంతో అనేక పెళ్లి సంబంధాలు మీ ముందుకు వచ్చే అవకాశం ఉంది. ప్రేమ జీవితం బాగా హ్యాపీగా సాగిపోతుంది.
- మిథునం: ఈ రాశికి అత్యంత శుభుడైన శుక్రుడు జనవరి 12 నుంచి నాలుగు నెలల పాటు బాగా అనుకూల స్థానాల్లో సంచారం చేయడం, జూన్ నుంచి గురువు కుటుంబ స్థానంలో ఉచ్ఛపట్టడం వల్ల ఈ రాశి వారికి ఈ ఏడాది ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. బంధు వర్గంలో కొద్ది ప్రయత్నంతో సంబంధం కుదురుతుంది. ఉద్యోగంలో సహోద్యోగితో ప్రేమలో పడే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు మే, జూలై నెలల మధ్య పెళ్లికి దారితీయడం జరుగుతుంది.
- కర్కాటకం: ఈ రాశివారికి ఈ ఏడాది జూలై తర్వాత సంప్రదాయబద్ధమైన వివాహం జరిగే అవకాశం ఉంది. శుక్రుడు జనవరి 14 నుంచి ఈ రాశికి సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల పెళ్లి ప్రయత్నాలకు ఈ సమయం బాగా అనుకూలంగా ఉంది. గురువు జూన్ నెలలో కర్కాటక రాశిలో ఉచ్ఛపడుతున్నందువల్ల జూలైలో గానీ, అక్టోబర్ లోపు గానీ వీరికి వివాహం అయ్యే అవకాశం ఉంది. ఈ రాశివారు బంధువర్గానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం తప్పకుండా జరుగుతుంది.
- కన్య: ఈ రాశికి అత్యంత శుభుడైన శుక్రుడు అనుకూల స్థానాల్లో సంచారం చేస్తున్నందువల్ల జనవరి 14 తర్వాత ఈ రాశివారు పెళ్లి ప్రయత్నాలు చేపట్టడం మంచిది. మార్చి తర్వాత గానీ, జూలై తర్వాత గానీ పెళ్లి జరిగే అవకాశం ఉంది. సాధారణంగా విదేశాల్లో స్థిరపడిన వ్యక్తితో పెళ్లయ్యే అవకాశం ఉంది. ఈ రాశికి చెందినవారు అనుకోకుండా పరిచయస్థులతో ప్రేమలో పడడం జరుగుతుంది. అక్టోబర్, నవంబర్ నెలల్లో వీరి ప్రేమ వ్యవహారాలు పెళ్లికి దారితీసే అవకాశం ఉంది.
- వృశ్చికం: ఈ రాశికి సప్తమాధిపతి అయిన శుక్రుడు మిత్ర, ఉచ్ఛ క్షేత్రాల్లో సంచారం చేస్తున్న ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఈ రాశివారు పెళ్లి ప్రయత్నాలు సాగించడం మంచిది. వీరికి జూన్ తర్వాత తప్ప కుండా పెళ్లయ్యే అవకాశం ఉంది. ఏడాది ముగిసే లోగా సంతాన ప్రాప్తికి సంబంధించి శుభ వార్త వినడం జరుగుతుంది. సాధారణంగా దూర ప్రాంత బంధువులతో పెళ్లి కుదిరే అవకాశం ఉంది. ప్రేమ ప్రయత్నాల్లో వీరు విజయం సాధిస్తారు. వీరి ప్రేమ జీవితం పెళ్లికి దారితీయడం జరుగుతుంది.
- మకరం: ఈ రాశికి అత్యంత శుభుడైన శుక్రుడు జనవరిలో ఇదే రాశిలోనూ, ఆ తర్వాత కూడా మిత్ర, ఉచ్ఛ క్షేత్రాల్లోనూ సంచారం చేస్తున్నందువల్ల కొద్ది ప్రయత్నంతో వీరికి మే లోపు పెళ్లి కుదరడం, పెళ్లి కావడం కూడా జరుగుతుంది. జూన్ మొదటి వారంలో గురువు సప్తమ స్థానంలో ఉచ్ఛపడుతున్నందు వల్ల అది కూడా పెళ్లి కావడానికి అనుకూలంగా ఉంది. విదేశాల్లో స్థిరపడిన వ్యక్తితో వివాహం జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. వీరి ప్రేమ జీవితం కూడా పెళ్లికి దారితీస్తుంది.