Kuja Gochar 2024
ఈ నెల 16న(శనివారం) కుజుడు కుంభరాశిలో ప్రవేశించాడు. ఇంతవరకూ మకర రాశిలో, తన ఉచ్ఛ స్థానంలో సంచారం చేస్తున్న కుజ గ్రహం ఇక ఏప్రిల్ 23 వరకూ తన శత్రు క్షేత్రమైన కుంభంలో సంచారం చేయడం జరుగుతుంది. ఈ రాశిలో సంచారం చేయడమే కాకుండా, తన ప్రబల శత్రువైన శనీశ్వరుడితో కలిసి ఉండాల్సి వస్తుంది. అయితే, బలానికి, శక్తికి, దూకుడుకు, అధికారానికి కారకుడైన కుజుడు శత్రు క్షేత్రంలో ఉన్నప్పటికీ కొన్ని రాశుల వారికి యోగాన్నివ్వడం జరుగుతుంది. అధికారాన్నివ్వడం, ఆదాయాన్ని పెంచడం, భూ సంబంధమైన ఆస్తిని అందివ్వడం వంటివి జరుగుతాయి. ఏయే రాశుల వారికి ఈ కుజుడు శుభ యోగాలనివ్వబోతున్నదీ ఇక్కడ పరిశీలిద్దాం.
- మేషం: ఈ రాశికి అధిపతి అయిన కుజుడు దశమ స్థానం నుంచి లాభ స్థానంలో అడుగు పెట్టడం ఈ రాశివారికి అనేక ఆర్థిక ప్రయోజనాలు కలిగిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు, అధికారం, ప్రమోషన్లు, ఆస్తి వివాదాలకు సంబంధించి వీరి మనసులోని కోరికలు నెరవేరే అవకాశం ఉంది. ఉద్యోగంలో తప్పకుండా ప్రమోషన్ ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. ఆదాయ వనరులు సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు బాగా లాభపడతారు.
- వృషభం: దశమ స్థానంలోకి రాబోతున్న కుజుడి వల్ల కెరీర్ పరంగా ఈ రాశివారికి యోగదాయకంగా ఉండబోతోంది. ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. మీ సత్తా ఏమిటో అధికారులకు నిరూపించే ప్రయత్నం చేస్తారు. శత్రువుల మీద విజయాలు సాధిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో ఘన విజయాలు సాధిస్తారు. పనిభారం, ఒత్తిడి నుంచి చాలావరకు బయటపడతారు. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. తప్పకుండా భూ లాభం కలుగుతుంది.
- సింహం: ఈ రాశికి సప్తమ స్థానంలో కుజుడి సంచారం వల్ల ఈ రాశివారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో విపరీ తంగా యాక్టివిటీ పెరుగుతుంది. తద్వారా ఊహించని స్థాయిలో, అంచనాలకు మించి ఆర్థిక లాభాలు కలుగుతాయి. అధికారుల కోవలో లేకపోయినా అధికారం చెలాయించడం జరుగు తుంది. తప్పకుండా ఉద్యోగంలో పదోన్నతి ఉంటుంది. ఆర్థికంగా బాగా లాభపడతారు. ఆస్తి పాస్తులు కలిసి వస్తాయి. ఆస్తి విలువ అనూహ్యంగా పెరుగుతుంది. ఆటంకాలను అధిగమిస్తారు.
- కన్య: ఈ రాశికి ఆరవ స్థానంలో కుజుడి సంచారం వల్ల బ్రహ్మాండమైన రాజయోగం పడుతుంది. వాద ప్రతివాదాల్లో పైచేయిగా ఉంటారు. డాక్టర్లు, లాయర్లు బాగా లాభం పొందుతారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగాలు లభిస్తాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు ఉంటాయి. రావలసిన డబ్బు చేతికి అందు తుంది. బాకీలు, బకాయిలు వసూలవుతాయి. ఆర్థిక ప్రయత్నాలన్నీ కలిసి వస్తాయి. ఆదాయ వనరులు పెరుగుతాయి. మంచి స్నేహాలు ఏర్పడతాయి. శత్రువులు బాగా లొంగి ఉంటారు.
- వృశ్చికం: ఈ రాశికి అధిపతి అయిన కుజుడు నాలుగవ స్థానంలో సంచారం ప్రారంభించడం వల్ల ఈ రాశి వారికి తప్పకుండా ఉద్యోగపరంగానే కాకుండా సామాజికంగా కూడా హోదా పెరిగే అవకాశం ఉంటుంది. గృహ, వాహన సౌకర్యాల విషయంలో ఈ రాశివారి ప్రయత్నాలు విజయవంతం అవు తాయి. భూ సంబంధమైన లావాదేవీలు అంచనాలకు మించిన లాభాలనిస్తాయి. ఆస్తి విలువ పెరు గుతుంది. అనేక మార్గాలలో ఆదాయం పెరుగుతుంది. వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి.
- ధనుస్సు: ఈ రాశివారికి కుజుడు మూడవ రాశిలో సంచారం ప్రారంభిస్తాడు. ఫలితంగా నిరుద్యోగులకే కాక, ఉద్యోగులకు కూడా మంచి ఆఫర్లు అంది వస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రతిభా పాటవాలు మరింతగా మెరుగుపడతాయి. ప్రయాణాల వల్ల ఆశించిన ఆర్థిక లాభం ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలకు, ఒప్పందాలకు సమయం బాగా అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడుల నుంచి అంచనాలకు మించిన రాబడి ఉంటుంది. అధికార యోగం పడుతుంది. ఇతరులకు ఇతోధికంగా సహాయపడతారు.
ముఖ్యమైన పరిహారాలు
ఇక్కడ ప్రస్తావించిన రాశులు కాకుండా మిగిలిన రాశుల వారికి ఈ కుజ సంచారం వల్ల దుష్ఫలితాలు అనుభవానికి వచ్చే అవకాశం ఉంది. కుజుడు దుస్థానాల్లో సంచారం చేయడం వల్ల వాహన ప్రమాదాలు జరగడానికి, జారిపడడానికి, విద్యుత్ షాక్ తగలడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆర్థికంగా మోసపోయే సూచనలు కూడా ఉంటాయి. అందువల్ల కుజుడికి పరిహారంగా ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసా పఠించడం మంచిది. పగడం పొదిగిన ఉంగరం ధరించడం వల్ల కూడా దుష్ఫలితాలు తగ్గే అవకాశం ఉంటుంది. ఏమాత్రం వీలున్నా ఆలయాల్లో ప్రసాద వితరణ లేక చిన్నపాటి అన్నదానం చేయడం వల్ల కుజుడి అనుగ్రహానికి పాత్రులు కావడం జరుగుతుంది.