Lucky Zodiac Signs: గురు దృష్టితో అదృష్ట యోగాలు.. ఆ రాశుల వారి దశ తిరగడం పక్కా..!
Jupiter Transit 2025: గురు గ్రహం మిథున రాశిలో ప్రవేశించడం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం కలిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో పురోగతి, ఆర్థిక ప్రయోజనాలు, కుటుంబ సమస్యల పరిష్కారం, సంతాన యోగం వంటి అనేక శుభ ఫలితాలు వారిని వెంటాడనున్నాయి. గురు దృష్టి వల్ల జీవితంలో కొత్త మార్పులు, అభివృద్ధి కనిపిస్తుంది.

Lucky Zodiac Signs
అత్యంత శుభుడైన దేవ గురువు ఒక రాశిలో ఉండడం వల్లే కాక, వీక్షించినా కొన్ని రాశులకు అనేక విధాలుగా అదృష్టాలు పడతాయని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. మే 25న వృషభం రాశి నుంచి మిథున రాశిలోకి మారుతున్న గురువు ఆ రాశి నుంచి పంచమ దృష్టితో తులా రాశిని, సప్తమ దృష్టితో ధనుస్సును, నవమ దృష్టితో కుంభ రాశిని వీక్షిస్తున్నందువల్ల ఈ రాశులకు తప్పకుండా దశ తిరుగుతుందని చెప్పవచ్చు. గురువు మిథున రాశిలో ఉన్నందువల్ల ఆ రాశిని, మీన రాశికి అధిపతి అయినందువల్ల మీన రాశిని కూడా కటాక్షించడం జరుగుతుంది. మొత్తం మీద అయిదు రాశులకు గురువు వల్ల జీవితం కొత్త పుంతలు తొక్కే అవకాశం ఉంది.
- మిథునం: ఈ రాశిలో సంచారం ప్రారంభించిన గురువు వల్ల ఆర్థిక, వ్యక్తిగత, కుటుంబ సంబంధమైన కష్ట నష్టాల నుంచి పూర్తి స్థాయిలో రక్షణ లభిస్తుంది. ఎటువంటి పరిస్థితుల్లోనూ క్లిష్ట సమస్యలు దరిచేరే అవకాశం ఉండదు. ఆశించిన పెళ్లి సంబంధం కుదురుతుంది. ధన ధాన్యాలకు లోటుండదు. రాజపూజ్యాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగంలోనూ, సామాజికంగానూ హోదా, స్థితిగతులు పెరిగే అవకాశం ఉంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. సంతాన యోగం కలగడానికి అవకాశం ఉంది.
- తుల: ఈ రాశిని మే 25 నుంచి గురువు పంచమ దృష్టితో వీక్షించడం వల్ల ఈ రాశివారికి కీలకమైన అదృష్టాలు అనుభవానికి వస్తాయి. ఉద్యోగంలో తప్పకుండా శీఘ్ర పురోగతి ఉంటుంది. వృత్తి, వ్యాపా రాలు బిజీగా సాగిపోతాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు లభిస్తాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు తరచూ వెళ్లడం జరుగుతుంది. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. కుటుంబంలో శుభ కార్యాలు జరుగుతాయి. సంతాన ప్రాప్తి సూచనలున్నాయి.
- ధనుస్సు: రాశ్యదిపతి గురువు సప్తమ స్థానం నుంచి ఈ రాశిని వీక్షించడం వల్ల జీవనశైలి పూర్తిగా మారి పోయే అవకాశం ఉంది. అనేక విధాలుగా ధన వృద్ధి యోగాలు కలుగుతాయి. ఆస్తిపాస్తుల విలువ బాగా పెరుగుతుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమై, విలువైన ఆస్తి లభిస్తుంది. సొంత ఇల్లు తప్పకుండా అమరుతుంది. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదరడం, ప్రేమలో పడడం జరుగుతుంది. నిరుద్యోగులకు విదేశాల్లో మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది.
- కుంభం: ఈ రాశిని మిథున రాశి నుంచి గురువు నవమ దృష్టితో వీక్షిస్తున్నందువల్ల ఏడాదిపాటు ఈ రాశి వారికి ఆదాయం పెరగడం తప్ప తగ్గడం ఉండదు. పిల్లల్లో ఒకరు చదువుల్లో గానీ, ఉద్యోగాల్లో గానీ ఉచ్ఛస్థితికి చేరుకుంటారు. సంతాన ప్రాప్తికి బాగా అవకాశం ఉంది. ప్రతిభా పాటవాలు బాగా వెలుగులోకి వస్తాయి. ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి బాట పడతాయి. ఉన్నత స్థాయి వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రేమల్లో విజయాలు సాధిస్తారు.
- మీనం: ఈ రాశికి అధిపతి అయిన గురువు చతుర్థ స్థానంలో ప్రవేశిస్తున్నందువల్ల కుటుంబ సమస్యలు పరిష్కారం కావడం, సుఖ సంతోషాలు వృద్ధి చెందడం, ఇంట్లో శుభ కార్యాలు జరగడం వంటివి చోటు చేసుకుంటాయి. ఆస్తిపాస్తులు వృద్ధి చెందుతాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. సొంత ఇంటి కల నెరవేరుతుంది. ఉద్యోగంలోనే కాక సామాజికంగా కూడా హోదా పెరుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. దాంపత్యంలో అన్యోన్యత వృద్ధి చెందుతుంది.