
భారతీయ సంప్రదాయంలో శకున శాస్త్రానికి ప్రత్యేక స్థానం ఉంది. జంతువుల అరుపులు, పక్షుల కదలికలతో పాటు మనుషుల శారీరక చర్యలైన తుమ్ములు, కళ్లు అదరడం వంటి వాటిని కూడా శకునాలుగా భావిస్తారు. సాధారణంగా తుమ్ము అనేది ఒక సహజమైన శారీరక ప్రక్రియ అయినప్పటికీ, శాస్త్రాల ప్రకారం దీని వెనుక కొన్ని మంచి, చెడు సంకేతాలు దాగి ఉన్నాయని నమ్ముతారు.
ఒక తుమ్ము – రెండు తుమ్ములు
ఒకటి తుమ్మితే: ఏదైనా శుభకార్యానికి సిద్ధమవుతున్నప్పుడు లేదా ప్రయాణానికి ఇల్లు దాటుతున్నప్పుడు ఒకే ఒక్క తుమ్ము వస్తే దానిని విఘ్న శకునంగా భావిస్తారు. అంటే మీరు వెళ్లే పనిలో ఆటంకాలు ఎదురవుతాయని నమ్ముతారు. అందుకే కాసేపు ఆగి, నీళ్లు తాగి వెళ్లడం అలవాటుగా మారింది.
రెండు తుమ్ములు: ఒకవేళ వరుసగా రెండు లేదా అంతకంటే ఎక్కువ తుమ్ములు వస్తే అది శుభ శకునంగా మారుతుంది. తలపెట్టిన కార్యం దిగ్విజయంగా పూర్తవుతుందని శకున శాస్త్రం చెబుతోంది.
దిక్కులను బట్టి తుమ్ము ఫలితాలు:
శాస్త్రం ప్రకారం మనం ఏ దిక్కున ఉన్నప్పుడు తుమ్ము వచ్చిందనే దాన్ని బట్టి కూడా ఫలితాలు మారుతుంటాయి:
తూర్పు దిక్కు: తూర్పు వైపు ముఖం ఉన్నప్పుడు తుమ్ము వస్తే అది శుభప్రదంగా భావిస్తారు. అనుకున్న పనులు అనుకూలిస్తాయి.
పడమర దిక్కు: పడమర వైపు తిరిగి ఉన్నప్పుడు తుమ్మితే ధనలాభం లేదా సుఖ సంతోషాలు కలుగుతాయని నమ్ముతారు.
ఉత్తర దిక్కు: ఉత్తర దిక్కున తుమ్ము వస్తే అది అంత మంచిది కాదని, ఏదైనా వివాదం లేదా సమస్య వచ్చే అవకాశం ఉందని చెబుతారు.
దక్షిణ దిక్కు: దక్షిణ దిక్కున తుమ్ము రావడం వల్ల శారీరక ఇబ్బందులు లేదా ఆందోళనలు పెరిగే సూచనలు ఉంటాయి.
కొన్ని మినహాయింపులు:
తుమ్ములన్నింటినీ శకునాలుగా చూడకూడదని కూడా శాస్త్రం చెబుతోంది. చిన్న పిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు (జలుబు, అలర్జీ ఉన్నవారు) తుమ్మినప్పుడు దాన్ని శకునంగా పరిగణించకూడదు. అలాగే భోజనం చేసేటప్పుడు లేదా పడుకునే ముందు వచ్చే తుమ్ములకు ఎలాంటి దోషం ఉండదని నమ్ముతారు.
గమనిక :
ఇది కేవలం సమాచారం మాత్రమే. పైన పేర్కొన్న వివరాలు శకున శాస్త్రం, జానపద నమ్మకాలు మరియు సాంప్రదాయ విశ్వాసాల ఆధారంగా అందించబడ్డాయి. దీనికి సంస్థ ఎలాంటి బాధ్యత వహించదు.