Telugu Astrology: దిగ్బల యోగం.. ఆ రాశుల వారి జీవితంలో అన్ని శుభాలే.. !

Digbala Yoga: గురు, సూర్యుడు, కుజుడు, శుక్రుడు, చంద్రుడు, బుధ గ్రహస్థానాల ఆధారంగా వృషభం, మిథునం సహా మరికొన్ని రాశులకు దిగ్బల యోగం ఏర్పడింది. ఈ యోగం వల్ల వారికి ఆర్థికంగా, ఉద్యోగపరంగా, కుటుంబపరంగా శుభ ఫలితాలను పొందుతారు. అలాగే ఈ యోగం వల్ల వారి జీవితంలో పురోగతి, సంపద, ఆరోగ్యం, సంతోషం లభిస్తాయి.

Telugu Astrology: దిగ్బల యోగం.. ఆ రాశుల వారి జీవితంలో అన్ని శుభాలే.. !
Digbala Yoga

Edited By: Janardhan Veluru

Updated on: Apr 07, 2025 | 6:32 PM

కొన్ని గ్రహాల వల్ల కొన్ని రాశులకు దిగ్బల యోగాలు కలుగుతాయి. దిగ్బల యోగం పట్టినప్పుడు ఆ రాశివారు ఏదో ఒక విధంగా యోగాలను అనుభవిస్తారు. శుభ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. జీవితం నల్లేరుమీద బండిలా సాగిపోతుంది. అనుకున్నవాటిని సాధించుకుంటారు. శనికి సప్తమంలో, రవి, కుజులకు దశమంలో, శుక్ర, చంద్రులకు చతుర్థంలో, బుధు, గురువులకు సొంత రాశిలో దిగ్బల యోగం పడుతుంది. ప్రస్తుతం దిగ్బల యోగాన్ని అనుభవిస్తున్న రాశులు వృషభం, మిథునం, తుల, ధనుస్సు, మీనం.

  1. వృషభం: ఈ రాశిలో గురు సంచారం వల్ల ఈ రాశివారికి దిగ్బల రాజయోగం కలిగింది. ఇది మే 25 వరకూ కొనసాగుతుంది. డబ్బు, సంపద విషయంలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించే ఈ రాశిలో ధన కారకుడైన గురువు సంచారం వల్ల ఈ రాశివారు సంపదను బాగా కూడగట్టుకునే అవకాశం ఉంది. సాధారణంగా ఈ రాశివారు ఇతరులకు డబ్బు ఇవ్వడం గానీ, తీసుకోవడం గానీ పెట్టుకోరు. వీరు పట్టుదలగా కొనసాగించే ఆదాయ ప్రయత్నాల వల్ల తప్పకుండా వీరి బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది.
  2. మిథునం: ఈ రాశివారికి దశమ స్థానంలో ఈ నెల 14 వరకూ సంచారం చేస్తున్న రవి వల్ల దిగ్బల యోగం కలిగింది. సహజసిద్ధమైన తెలివితేటలకు, వ్యూహాలకు, సమయస్ఫూర్తికి, ప్రణాళికలకు ఈ రాశి పెట్టింది పేరు. రాశ్యధిపతి బుధుడు దశమంలో రవితో కలిసి ఉన్నందువల్ల ఈ రాశివారు ఒక వ్యూహం ప్రకారం పదోన్నతులు పొందే అవకాశం ఉంటుంది. తమ పనితీరుతో, తమ సమర్థతతో అధికారులను మెప్పిస్తారు. నిరుద్యోగులు పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూల్లో ఘన విజయాలు సాధిస్తారు.
  3. తుల: ఈ రాశికి దశమ స్థానంలో కుజ సంచారం వల్ల ఈ రాశివారికి జూన్ 6 వరకు దిగ్బల యోగం కలిగింది. అన్ని విషయాల్లోనూ ఎంతో లౌక్యంగా, సమయస్ఫూర్తితో వ్యవహరించే ఈ రాశివారు తమ పనితీరుతో అధికారులను బాగా ఆకట్టుకుంటారు. ఉద్యోగంలో అధికార యోగం కలిగే అవకాశం ఉంది. ఉద్యోగంలోనే కాక, వృత్తి, వ్యాపారాల్లో కూడా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించే ఈ రాశి వారు తమ లక్ష్యాలను నెరవేర్చుకుంటారు. షేర్లు, స్పెక్యులేషన్లలో లాభాలు బాగా పెరుగుతాయి.
  4. ధనుస్సు: ఈ రాశికి చతుర్థ స్థానంలో శుక్రుడు సంచారం చేయడం వల్ల దిగ్బల యోగం ఏర్పడింది. లక్ష్యాలను చేరుకోవడంలో, ఉన్నత స్థానాలకు ఎదగడంలో వీరు చతురులు కనుక మే 31 లోగా ఉద్యోగంలో తప్పకుండా అందలాలు ఎక్కడం జరుగుతుంది. అనేక విధాలుగా బ్యాంక్ బ్యాలెన్స్ పెంచు కుంటారు. సొంత ఇంటితో పాటు స్థలాలు, పొలాలు సమకూర్చుకోవడం కూడా జరుగుతుంది. ఆస్తి వివాదాలు రాజీమార్గంలో పరిష్కారమవుతాయి. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది.
  5. మీనం: ఈ రాశిలో బుధుడి సంచారం వల్ల ఈ రాశివారికి దిగ్బల యోగం ఏర్పడింది. తెలివితేటలు, సమయస్ఫూర్తికి మారుపేరైన బుధుడు తమ బుద్ధి బలంతో పురోగతి చెందుతారు. ప్రతి పనినీ ఒక వ్యూహం ప్రకారం తెలివితేటలతో సాధించుకుంటారు. ఆదాయ ప్రయత్నాల్లో ఇతరుల కంటే బాగా ముందుంటారు. ఆదాయం ఆశించినంతగా వృద్ధి చెందుతుంది. ఆదాయాన్ని పెట్టుబడులు పెట్ట డం, మదుపు చేయడం జరుగుతుంది. ఆస్తి సమస్యలను, వివాదాలను తెలివిగా పరిష్కరించుకుంటారు.