
జీవితం అనుకూలంగా సాగిపోవాలన్నా, అదృష్టాలు పట్టాలన్నా కర్కాటక రాశివారు జూన్ వరకు ఆగక తప్పదు. అష్టమ స్థానంలో రాహువు సంచారం వల్ల ఆర్థిక పరిస్థితులు ఆశించినంత అనుకూలంగా ఉండకపోవచ్చు. అర్థం కాని అనారోగ్యాలు ఇబ్బంది పెడతాయి. జూన్ తర్వాత మాత్రం జీవితం వైభవంగా, శోభాయమానంగా సాగిపోతుంది. జీవితం అనేక విషయాల్లో తప్పకుండా కొత్త పుంతలు తొక్కుతుంది. ఆదాయం పెరగడం ప్రారంభం అవుతుంది. జూన్ నుంచి గురువు కర్కాటక రాశిలో ఉచ్ఛపడుతున్నందువల్ల వీరి జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభం అవుతుంది.
సంవత్సరంలో ప్రథమార్థం కొద్దిగా ఇబ్బందులు పెడుతుంది. గురువు వ్యయ స్థానంలో ఉండడం వల్ల ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక వ్యవహారాల్లో, ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఉచిత సహాయాలు, దానధర్మాలతో బాగా నష్టపోవడం జరుగుతుంది. చేతిలో డబ్బు నిలవని పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగంలో ప్రాభవం తగ్గుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు, యాక్టివిటీ బాగా తగ్గుతాయి. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి ఆశించిన స్థాయిలో లాభాలను ఇవ్వకపోవచ్చు. ద్వితీయార్థంలో మాత్రం వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి. లాభాలకు, రాబడికి లోటుండకపోవచ్చు. ఈ రాశిలో సంచారం చేయబోతున్న గురువు వల్ల వృత్తి, ఉద్యోగాలలో జీత భత్యాలు పెరగడం, స్థిరత్వం ఏర్పడడం, తగిన గుర్తింపు లభించడం వంటివి జరిగే అవకాశం ఉంది. భాగ్య స్థానంలో సంచరిస్తున్న శని వల్ల విదేశాల నుంచి శుభవార్తలు వింటారు. విదేశీ ఉద్యోగాలకు అవకాశం ఉంది. విదేశాల్లో స్థిరపడడం కూడా జరుగుతుంది.
సంవత్సరం ప్రథమార్థంలో కుటుంబ జీవితం చాలావరకు సుఖ సంతోషాలతో సాగిపోతుంది. దాంపత్య జీవితంలో ఎటువంటి సమస్యలున్నా తొలగిపోయి, సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. ప్రేమ వ్యవహారాలు అంత సానుకూలంగా సాగకపోవచ్చు. పెళ్లి ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. ద్వితీయార్థంలో అనుకూలతలు పెరుగుతాయి. ప్రేమ పెళ్లిళ్లకు అవకాశం ఉంది. ప్రథమార్థంలో మధ్య మధ్య స్వల్ప అనారోగ్యాలకు, కొద్దిపాటి ఒత్తిడికి అవకాశం ఉన్నప్పటికీ మొత్తం మీద ప్రశాంతంగా గడిచిపోతుంది. ఏ మంచి విషయానికైనా ద్వితీయార్థం వరకు నిరీక్షించడం మంచిది. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. విద్యార్థులు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. పెళ్లి సంబంధం కుదురుతుంది. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి ఉపశమనం కలుగుతుంది.
జూన్ నుంచి ఈ రాశివారికి జీవితం నల్లేరు మీద బండిలా సాగిపోతుంది. అనేక విధాలుగా అదృష్టం కలిసి వస్తుంది. సంతాన ప్రాప్తికి సంబంధించి శుభవార్త వింటారు. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి. ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు.
ఈ రాశివారికి కొత్త సంవత్సరంలో ఫిబ్రవరి, జూలై, అక్టోబర్, నవంబర్ నెలలు బాగా అనుకూలంగా ఉన్నాయి. ఆశించిన శుభవార్తలు వింటారు. అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. ఆదాయ ప్రయత్నాలు బాగా లాభిస్తాయి. శుభకార్యాలు జరుగుతాయి. శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. విదేశీయానానికి, తీర్థయాత్రలు, విహార యాత్రాలకు అవకాశాలు కలిసి వస్తాయి.