Birth Star Astrology in Telugu
జ్యోతిషశాస్త్రం కొన్ని నక్షత్రాలను గండమూల నక్షత్రాలుగా పేర్కొంది. ఈ నక్షత్రాలకు సంబంధించిన వారు సాధారణంగా ఏదో ఒక మానసిక సమస్యతో బాధపడుతుంటారని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. అవి కేతు గ్రహానికి సంబంధించిన అశ్విని, మఖ, మూల, బుధ గ్రహానికి సంబంధించిన ఆశ్లేష, జ్యేష్ట, రేవతి నక్షత్రాలు. ఇతర నక్షత్రాల వారితో సమానంగా ఈ నక్షత్రాల వారికి కూడా యాంబిషన్, పురోగతి, ఆరోగ్యం, ఆశలు వగైరాలన్నీ ఉంటాయి కానీ, ఏదో ఒక సమస్య దీర్ఘకాల కంగా బాధించే, ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అయితే, ఈ నక్షత్రాలకు గురు దృష్టి లేదా కలయిక దివ్యమైన ఔషధంగా పనిచేస్తూ ఉంటుంది. ఈ నక్షత్రాలు ఏ విధంగా ఇబ్బంది పెడతాయన్నది ఇక్కడ పరిశీలిద్దాం.
- అశ్విని: ఈ నక్షత్రానికి అధిపతి కేతు గ్రహం. దీనిని పాప గ్రహం కింద పరిగణించడం జరిగింది. ఈ అశ్విని నక్షత్రంలో జన్మించినవారికి జీవితం విచిత్రమైన మలుపులు తిరుగుతుంటుంది. వీరు కర్మఫలం అనుభవించడానికే పుట్టారని భావించవచ్చు. సాధారణంగా వీరు ప్రణాళిక వేసుకున్నట్టుగా ఏదీ జరగదు. వీరు ఊహించని విధంగానే ప్రతిదీ జరుగుతుంటుంది. ఏదైనా ఒక సమస్య పట్టుకుంటే అది అసాధారణంగా ఎక్కువ కాలం కొనసాగుతుంది. దీర్ఘకాలిక అనారోగ్యాలకు ఎక్కువ అవకాశం ఉంటుంది.
- ఆశ్లేష: ఈ నక్షత్రానికి బుధుడు అధిపతి. ఎటువంటి సమస్యనైనా అధిగమించగల ప్రజ్ఞాపాటవాలు, సమయస్ఫూర్తి వీరి సొంతం. అయితే, ఎక్కువగా పిల్లల కారణంగా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. సంతానం కలగడం ఆలస్యం అయికొంత కాలం, సంతానం కలిగిన తర్వాత వారి వల్ల సమస్యలు ఎదురై మరి కొంత కాలం ఇబ్బంది పడడం జరుగుతుంది. అంతేకాకుండా వీరు ఎక్కు వగా విచారగ్రస్తులయి ఉంటారు. ఎక్కువగా ఊహించుకోవడం, ఆలోచించడం వల్ల ఇబ్బంది పడుతుంటారు.
- మఖ: ఈ నక్షత్రానికి కేతువు అధిపతి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వీరి సహజ లక్షణంగా ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకుని ఆ తర్వాత విచారిస్తుంటారు. ఇతరులతో పోల్చి చూసుకుంటుంటారు. ఇతరుల కంటే తాము తక్కువ వారమన్న ఆత్మన్యూనతా భావం వీరిని వెంటాడుతూ ఉంటుంది. వీరిలో తెలివితేటలు అమోఘం. వృత్తి, ఉద్యోగాల్లో మంచి పేరు తెచ్చు కుంటారు. సమాజంలో హుందాగా జీవిస్తారు. అయినా ఇతరులతో పోల్చుకుని బాధ పడుతుంటారు.
- జ్యేష్ట: ఈ నక్షత్రానికి బుధుడు అధిపతి. వీరి ప్రజ్ఞా పాటవాలకు, శక్తిసామర్థ్యాలకు తిరుగుండదు. ఇతరుల కోసం ఎన్నో ప్లాన్లు వేసి, విజయాలు సాధించేలా చేయగలరు కానీ, సొంత విషయాల్లో మాత్రం విఫలం అవుతుంటారు. ఈ విషయాన్నీ ఇతరులతో పంచుకోకపోవడం వీరిలోని ప్రధాన లోపం. వీరిలో గోప్యత పాలు ఎక్కువగా ఉంటుంది. తమకు లేని సౌకర్యం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అనవసర ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. సమస్యలను భూతద్దంలో చూస్తారు.
- మూల: ఈ నక్షత్రానికి కేతువు అధిపతి. ఈ నక్షత్రం వారికి తనకు నచ్చినవారు, తాము ఇష్టపడినవారు తమకే చెందాలన్న పట్టుదల ఎక్కువగా ఉంటుంది. లేనిపోని అనుమానాలు పెంచుకోవడంలో వీరికి వీరే సాటి. నిజానికి పరిశోధనలు, అధ్యయనాలు, ఆవిష్కారాల్లో వీరు ముందుంటారు. దేనినైనా వివరంగా, లోతుగా పరిశీలించేతత్వం వీరిలో ఎక్కువగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన కూడా ఉంటుంది. అయినప్పటికీ, తమవారు తమను నమ్మడం లేదన్న భయం ఎక్కువగా ఉంటుంది.
- రేవతి: ఈ నక్షత్రానికి బుధుడు అధిపతి. ప్రణాళికలు, వ్యూహాలను రచించడంలో వీరిని మించిన వారుండరు. సూక్ష్మ బుద్ధికి వీరు మారు రూపం. వీరుంటే వృత్తి, ఉద్యోగాల్లో ఎంతగానో అభివృద్ధి చెందుతాయి. అయితే, వీరు సున్నిత మనస్కులు కావడం వీరి ప్రధాన సమస్య. విమర్శలను ఏమాత్రం తట్టుకోలేరు. ప్రతి దానికీ అతిగా బాధపడుతుంటారు. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోరు. లోలోపల మధనపడుతుంటారు. సాధారణంగా బంధుమిత్రులు వీరిని ఉపయోగించుకుని వదిలేస్తుంటారు.
Note: ఇక్కడ అందించిన సమాచారం వారివారి నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది. దీన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని అందించాము.
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.