Zodiac Signs
Astrology in Telugu: ఈ నెల 25 నుంచి వచ్చేనెల 7వ తేదీ వరకు కొన్ని ముఖ్యమైన గ్రహాలు వ్యక్తుల శృంగార జీవితాన్ని బాగా ప్రకోపింపచేసే సూచనలు కనిపిస్తున్నాయి. మేష రాశిలో గురు చండాల యోగం ఏర్పడటం, మిధున (జంట) రాశిలో ఆ రాశి అధిపతి అయిన బుధుడు ప్రవేశించడం, సున్నితమైన కర్కాటక రాశిలో కామ గ్రహాలైన కుజ, శుక్రులు కలసి ఉండటం, క్రమశిక్షణకు మారుపేరైన శనీశ్వరుడు వక్రగతి పట్టడం ఇందుకు ప్రధాన కారణాలు అని చెప్పవచ్చు. ఈ విధమైన గ్రహ సంచారం వల్ల సంప్రదాయాలు, విలువలకు స్వస్తి చెప్పడం, దృష్టంతా లైంగిక సంబంధాల మీద కేంద్రీకృతం కావటం, కేవలం కామ వాంఛతోనే ప్రేమ వ్యవహారాలు కొనసాగించడం వంటివి జరిగే అవకాశం ఉంది. ఇదంతా చాలా వరకు వ్యక్తిగత జాతక చక్రాల మీద కూడా ఆధారపడి ఉంటుంది. వివిధ రాశుల వారికి ఈ విచిత్రమైన గ్రహస్థితి ఏ విధంగా పనిచేస్తుందో పరిశీలిద్దాం.
- మేషం: అగ్ని తత్వ రాశి అయినటువంటి మేషరాశిలో గురు రాహువుల కలయిక వల్ల గురుచండాల యోగం ఏర్పడటం, సుఖస్థానమైన కర్కాటక రాశిలో శుక్ర, కుజ గ్రహాలు కలిసి ఉండటం, విక్రమ స్థానమైన మిధున రాశిలో బుధ గ్రహం సంచ రిస్తూ ఉండటం వల్ల ఈ రాశి వారు అతిగా శృంగార కార్యకలాపాలలో పాల్గొనే అవకాశం ఉంటుంది. అక్రమ సంబంధాలకు, వివాహేతర సంబంధాలకు ఎంతగానో అవకాశం ఉంది. ఒక్కొక్కసారి విచక్షణ కోల్పోవటం కూడా జరుగుతుంటుంది. ఆలోచనలన్నీ లైంగిక జీవితం మీదే కేంద్రీకృతం అయి ఉంటాయి.
- వృషభం: ఈ రాశి వారికి శయన స్థానంలో గురు చండాల యోగం ఏర్పడటం, కుటుంబ స్థానంలో బుధ గ్రహ సంచారం, తృతీయ స్థానంలో కుజ, శుక్ర సంచారం వగైరాల వల్ల ఒక వారం పది రోజుల పాటు లైంగిక జీవితానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది. మిధున రాశిలో బుధ సంచారం వల్ల ఎక్కువగా శృంగార కార్యకలా పాలతో పాల్గొనడం జరుగుతుంది. కొత్త కొత్త ఆలోచనలతో, కొత్త కొత్త వ్యక్తులతో లైంగిక జీవితాన్ని గడిపే సూచనలు ఉన్నాయి. సాధారణంగా కోరికలను అదుపు చేయడం కూడా కష్టం అవుతుంది.
- మిథునం: ఈ రాశిలో బుధుడు సంచరిస్తూ ఉండటం, కుటుంబ స్థానంలో కుజ, శుక్ర గ్రహాలు కలిసి ఉండటం, లాభ స్థానంలో గురు చండాల యోగం ఏర్పడటం వల్ల ఈ రాశి వారితో ఏరి కోరి కొందరు స్నేహం చేయడం, ప్రేమకలాపాలు సాగించడం, లైంగిక సంబంధాలు పెట్టుకోవడం జరుగుతుంది. విచక్షణారహితమైన లైంగిక కార్య కలాపాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. బంధు వర్గంలో కొందరితో లైంగిక బంధం ఏర్పడే సూచనలు ఉన్నాయి. మన్మధుడు లేదా రతీ దేవి ఆవహించి నట్టుగా ఈ రాశి వారు లైంగిక వ్యవహారాల్లో విజృంభించే సూచనలు కనిపిస్తున్నాయి.
- కర్కాటకం: ఈ రాశిలో కుజ, శుక్ర గ్రహాల కలయిక జరగటం, వ్యయ స్థానంలో అంటే శయన స్థానంలో బుధుడు ప్రవేశించడం వల్ల ఈ రాశి వారు శృంగార జీవితంలో కొత్త పుంతలు తొక్కడానికి, కొత్త ప్రయోగాలు చేయడానికి, కొత్త వారితో సంబంధాలు పెట్టుకోవడానికి చాలావరకు అవకాశం కనిపిస్తోంది. పైగా అష్టమ స్థానంలో శనీశ్వరుడు వక్రగతి చెందడం వల్ల రహస్య కార్యకలాపాలకు ఎక్కువగా అవకాశం ఉంది. దశమ స్థానంలో గురు, రాహువుల కలయిక కూడా జరిగినందువల్ల వ్యక్తిగత ప్రతిష్టను కూడా పట్టించుకోని పరిస్థితి ఏర్పడుతుంది.
- సింహం: ఈ రాశి వారికి 12వ స్థానంలో కుజ, శుక్ర సంచారం, లాభ స్థానంలో బుధుడి ప్రవేశం, సప్తమ స్థానంలో శనీశ్వరుడి వక్రగతి కారణంగా పూర్తిగా దారి తప్పే అవకాశం ఉంది. అక్రమ సంబంధాలు పెరగటానికి ఈ గ్రహ సంచారం బాగా అనుకూలంగా ఉంది. అనవసర పరిచ యాలు ఏర్పడతాయి. విచక్షణ కోల్పోయే సూచనలు కూడా ఉన్నాయి. ఆరోగ్యం కొద్దిగా దెబ్బతిన్నప్పటికీ లెక్కచేయని పరిస్థితికి చేరుకునే అవకాశం ఉంది. ముఖ్యమైన స్నేహితులు విలాస జీవితానికి, రహస్య జీవితానికి అలవాటు చేసే అవకాశం ఉంది. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది.
- కన్య: ఈ రాశి వారికి లాభ స్థానంలో కుజ, శుక్ర సంచారం, అష్టమ స్థానంలో గురు రాహువుల సంచారం కారణంగా అనవసర ఆలోచనలు లైంగిక ధోరణులు ఎక్కువయ్యే సూచనలు ఉన్నాయి. తొందరపాటు నిర్ణయాలతో అక్రమ సంబంధాలకు, వివాహేతర సంబంధాలకు అలవాటు పడే అవకాశం ఉంది. మంచి చెడు విచక్షణకు కూడా దూరమవడం జరుగుతుంది. దశమ స్థానంలో బుధ సంచారం వల్ల తప్పకుండా ఏదో ఒక వ్యసనానికి బానిస అయ్యే ప్రమాదం ఉంది. ఒక్కోసారి కోరికలను అదుపు చేయటం కూడా కష్టం అవుతుంది.
- తుల: సన్నిహితులు, సహచరులు, బంధువులకు సంబంధించిన వారితో అక్రమ సంబంధాలు వివాహేతర సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంది. కామ వాంఛ హద్దులు దాటడం జరుగుతుంది. సంప్రదాయాలు, విలువలు, మంచి, చెడు వగైరాలు వెనక పట్టు పడతాయి. సప్తమ స్థానంలో గురు చండాల యోగం పట్టడం, దశమ స్థానంలో కుజ శుక్రులు కలిసి ఉండడం, ఆలోచన స్థానమైన పంచమ స్థానంలో శని వక్రగతి పట్టడం తదితర కారణాలవల్ల ఈ రాశి వారు లైంగిక కార్యకలాపాల విషయంలో విజృంభించే అవకాశం ఉంది.
- వృశ్చికం: నవమ స్థానంలో కుజ శుక్ర గ్రహాల సంచారం నాలుగవ స్థానంలో అంటే సుఖస్థానంలో శని వక్రగతి, ఆరవ స్థానంలో గురు చండాల యోగం వగైరా కారణాలవల్ల ఈ రాశి వారికి అతి రహస్యంగా లైంగిక కార్యకలాపాలు పెరిగి పెద్దవయ్యే అవకాశం ఉంది. ఈ రకమైన కార్యకలాపాలు, సంబంధాల కారణంగా బాగా డబ్బు ఖర్చు అయ్యే సూచనలు ఉన్నాయి. స్నేహితులతో లేదా దగ్గర బంధువులతో సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంది. సాధారణంగా ఈ రాశి వారు లైంగికంగా సంతృప్తి చెందే అవకాశం కూడా ఉండకపోవచ్చు.
- ధనుస్సు: ఆలోచన స్థానమైన పంచమ స్థానంలో గురు రాహుల సంచారం, సప్తమ స్థానంలో బుధ గ్రహ ప్రవేశం, అష్టమ స్థానంలో కుజ, శుక్ర గ్రహాల కలయిక ఓ పది రోజులపాటు ఈ రాశి వారిని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. లైంగిక సంబంధాలకు ప్రయత్నించడం జరుగుతుంది. అనవసర పరిచయాల మీద ఎక్కువగా ఖర్చు చేయడం జరుగుతుంది. కొద్దికాలం పాటు విచక్షణ కూడా కోల్పోయే సూచనలు ఉన్నాయి. ఆలోచనలు ప్రయత్నాలు నిర్ణయాలు లైంగిక సంబంధాల మీదే కేంద్రీకృతం అయి ఉంటాయి. స్నేహితులు తప్పుదోవ పట్టించడం జరుగుతుంది.
- మకరం: సాధారణంగా క్రమశిక్షణతో వ్యవహరించే ఈ రాశి వారు కూడా ఇతరుల మీద మోజు పెంచుకునే సూచనలు ఉన్నాయి. రహస్య కార్యకలాపాలు పెరగటం జరుగుతుంది. ప్రేమ వ్యవహారాలలో లైంగిక సంబంధాలకు ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది. కొందరు సన్నిహిత మిత్రుల కారణంగా లైంగిక సంబంధాలకు అలవాటు పడటం జరుగుతుంది. ఈ రాశి నాధుడైన శనీశ్వరుడు కుటుంబ స్థానంలో వక్రగతి చెందటం, సుఖస్థానంలో గురు చండాల యోగం ఏర్పడటం, సప్తమ స్థానంలో కుజ, శుక్ర గ్రహాలు కలవటం వల్ల ఈ రాశి వారు కొద్ది రోజులపాటు దారి తప్పే అవకాశం ఉంది.
- కుంభం: ఈ రాశిలో శనీశ్వరుడు వక్రగతి చెందటం వల్ల, ఏలినాటి శని జరుగుతున్నందువల్ల, ఆరవ స్థానంలో కుజ శుక్ర గ్రహాల కలయిక వల్ల ఈ రాశి వారికి కొద్దిగా స్త్రీ వ్యామోహం పెరిగే అవకాశం ఉంది. సాధారణంగా క్రమశిక్షణతో మెలిగే ఈ రాశి వారికి మిత్రుల వల్ల మనసులో చెడు ఆలోచనలు చోటు చేసుకునే అవకాశం ఉంది. వివాహేతర సంబంధం పెట్టుకునే సూచనలు ఉన్నాయి. ఒకటి రెండు రహస్య సంబంధాలు ఏర్పడడం కూడా జరుగుతుంది. ఈ రాశి వారి మీద ఇతరులు మోజు పెంచుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీటి మీద బాగా డబ్బు నష్టపోవడం జరుగుతుంది.
- మీనం: వ్యయ స్థానంలో అంటే శయన స్థానంలో శని వక్రించడం, కుటుంబ స్థానంలో గురు చండాల యోగం ఏర్పడటం, ఆలోచన స్థానంలో కుజ, శుక్ర గ్రహాలు కలవటం, సుఖస్థానంలో బుధుడు ప్రవే శించడం ఈ రాశి వారిని వివాహేతర సంబంధా లకు పురిగొల్పడం జరుగుతుంది. ఇతరుల ద్వారా అక్రమ సంబంధాలను ఏర్పరచుకునే అవకాశం ఉంది. సున్నిత మనస్కులైన ఈ రాశి వారు ఇతరుల ప్రలోభాల కారణంగా దారి తప్పే ప్రమాదం ఉంది. గతంలో ఏర్పడిన కొన్ని చెడు పరిచయాల వల్ల అక్రమ సంబంధాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి.
పరిహారాలు
ఇటువంటి అక్రమ సంబంధాలు వివాహేతర సంబంధాలు వ్యసనాలకు దూరంగా ఉండాలని భావించే పక్షంలో ప్రతిరోజు ఉదయం హనుమాన్ చాలీసా పఠించడం ఆదిత్య హృదయం పారాయణ చేయడం, నరసింహ స్వామిని స్తుతించడం, వినాయకుడికి అర్చన చేయించడం చాలా మంచిది. ఇవి తప్పకుండా మనసుని స్థిరంగా బలంగా ఉంచడం జరుగుతుంది.
నోట్: ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం..
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..