ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. తూ.గో జిల్లాలోని 104 ఆలయాలకు ఆమెనే చైర్ పర్సన్..!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మాన్సస్ ట్రస్ట్ చైర్‌పర్సన్ సంచయిత గజపతిరాజుకు కీలక పదవి కట్టబెట్టింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మాన్సస్ ట్రస్ట్ చైర్‌పర్సన్ సంచయిత గజపతిరాజుకు కీలక పదవి కట్టబెట్టింది. తూర్పుగోదావరి జిల్లాలోని 104 ఆలయాలకు చైర్ పర్సన్‌గా సంచయితను నియమించింది. ఈ నెల 2న ఏపీ దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేసింది. సింహాచలం ఆలయంతోపాటు తూర్పుగోదావరి జిల్లాలోని 104 ఆలయాలకు ఆమె చైర్ పర్సన్‌గా కొనసాగనున్నారు.
గతంలో చైర్మన్‌గా సంచయిత తండ్రి ఆనందగజపతిరాజు వ్యవహరించారు. ఆనందగజపతిరాజు వారసురాలిగా సంచయితను చైర్మన్‌గా తిరిగి నియమించాలని దేవాదాయశాఖకు ప్రభుత్వం అక్టోబర్ 27న లేఖ రాసింది. రూ.2 లక్షల కంటే తక్కువ ఆదాయమున్న 104 ఆలయాలకు సంచయిత చైర్ పర్సన్‌గా వ్యవహరించనున్నారు. సింహాచల దేవస్ధానం పాలక మండలి చైర్ పర్సన్‌గా ఆనంద గజపతిరాజు రెండో కుమార్తె సంచయితను ప్రభుత్వం నిమయించిన విషయం తెలిసిందే. ఈ తర్వాత విజయనగరరాజుల ఆధీనంలో మాన్సస్ ట్రస్ట్ బోర్డు చైర్‌పర్సన్ ఆమెకు బాధ్యతలు అప్పగించారు. సంచయిత ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లాలోని ఆలయాలు పూర్వ వైభవం సాధించి అభివృద్ధి చెందుతాయని అధికార వైసీపీ నేతలు భావిస్తున్నారు.