టీఎస్‌పీఎస్‌సీ పేపర్ల లీకేజీ వ్యవహారంలో కేసీఆర్ సర్కార్‌పై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మరోసారి పేపర్ లీక్ కాదంటూ తామే కేసీఆర్ కోసం ఒక అఫిడవిట్ తయారు చేశామని.. దీన్ని కేసీఆర్‌కు పంపుతున్నామని పేర్కొన్నారు. ఈ డిక్లరేషన్ చదువుకొని ముఖ్యంత్రి కేసీఆర్ సంతకం పెట్టాలని అన్నారు.ఐటీ శాఖ వైఫల్యంతోనే పేపర్ లీకేజీ జరిగిందని దీనివల్ల లక్షల మంది ఆశలను అడి ఆశలు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్టీపీ విలీనంపై షర్మిల స్పందించారు. 2014, 2018 ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ గెలిచిన సీట్లను నిలబెట్టుకోలేకపోవడం నాయకత్వ వైఫల్యం కాదా..? అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు నాయకత్వం లేకపోవడంతోనే పక్క పార్టీ నుంచి లీడర్లను తీసుకువస్తున్నారంటూ విమర్శించారు. కాంగ్రెస్‌లో విలీనం చేయాలని అనుకుంటే పార్టీ ఎందుకు పెడతానని ప్రశ్నించారు.
తాను ఏ పార్టీలో అయినా చేరతానంటే ఎవరైనా వద్దంటారా అంటూ వ్యాఖ్యానించారు. అలాగే కర్ణాటకలో డీకే శివ కుమార్ కష్టపడి పనిచేయడం వల్లే కాంగ్రెస్ అక్కడ అధికారంలోకి వచ్చిందన్నారు. డీకే శివ కుమార్ లేకుంటే కర్ణాటకలో కాంగ్రెస్ లేదని తెలిపారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలు అనేవి మత, కుట్ర రాజకీయాలకు చెంప పెట్టు అంటూ పేర్కొన్నారు. ఇది ఎన్నికల ఏడాది కాబట్టి అన్ని పార్టీలు తమ ప్రయత్నాలు వాళ్లు చేస్తారన్నారు. తనకు కూడా అన్ని పార్టీల నుంచి కాల్స్ వస్తున్నాయని.. ఫోన్ చూస్తే చాలా మిస్డ్ కాల్స్ ఉంటున్నాయని తెలిపారు. అయితే ప్రస్తుతం తాము ఇంకా ఛార్జింగ్ మోడ్‌లోనే ఉన్నామని… ఎన్నికల సమయంలో అన్ని బయటకు వస్తాయని వెల్లడించారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..