టైం మారిందేమో- టైమింగ్ మాత్రం మార్లా.. అదే రీసౌండ్, అదే రిజల్ట్. ఇదీ ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల సందర్భంగా వైసీపీ శ్రేణులు విజయగర్వంతో అన్న మాటలు. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ ఎన్నికల్లో అధికార పార్టీ విజయ ఢంకా మోగించింది. మొత్తం 50 డివిజన్లలో వైయస్ఆర్సీపీ- 47 స్థానాలు కైవసం చేసుకోగా, టీడీపీ- 3 చోట్ల గెలిచి ఉనికి చాటుకుంది. బీజేపీ, జనసేన, వామపక్షాలు పత్తాలేకుండా పోయాయి.
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు రానే వచ్చాయి. మేయర్ పీఠాన్ని ఎవరు కైవసం చేసుకుంటారన్న సస్పెన్స్ కు తెర పడింది. ఏలూరు శివారులోని సీఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో.. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఇందులో మూడు ఏకగ్రీవం కావడంతో మిగిలిన 47 డివిజన్లకు.. కౌంటింగ్ జరిగింది. 47 మంది కౌంటింగ్ సూపర్‌వైజర్లు, మరో 254 మంది సిబ్బందితోపాటు, అదనంగా 200 మంది ఏలూరు కార్పొరేషన్ సిబ్బంది కలసి విధుల్లో పాల్గొన్నారు. కౌంటింగ్ కేంద్రంలోకి అభ్యర్థితో పాటు ఒక ఏజెంట్‌కు మాత్రమే అనుమతిచ్చారు.
యాభై డివిజన్లలో 1, 3, 32 డివిజన్లలో అర్నేపల్లి అనురాధ, బొద్దాని జయశ్రీ, బండారు సునీత అనే వైసీపీ అభ్యర్ధులు ఏకగ్రీవమయ్యారు. ఇక టీడీపీ నుంచి 28, 37, 47 డివిజన్లలో తంగిరాల అరుణ, పృధ్వీ శరత్, వందనాల దుర్గా భవానీ గెలుపొందారు. ఇక 17వ డివిజన్లో వైసీపీ జనసేన మధ్య నువ్వా నేనా పోరాటం జరిగినట్టే కనిపించినా.. ఫలితం ఫ్యాను పార్టీనే వరించింది. ఇక 16వ వార్డులో వైసీపీ అభ్యర్ది విజయనిర్మలకు 1323 – రెబల్ అభ్యర్ధి సంతోషమ్మకు 1322 ఓట్లు రావడంతో రీకౌంటింగ్ జరిపారు. ఫైనల్ కౌంట్ లో వైయస్ఆర్సీపీ అభ్యర్దికి 9 ఓట్లతో విజయం లభించింది.
45వ డివిజన్ నుంచి బేతపూడి చంద్ర ముఖర్జీ 1058 ఓట్లతో గెలవగా.. 46వ డివిజన్ నుంచి 1232 ఓట్లతో ప్యారీ బేగం విజయం సాధించారు. అయితే వీరిద్దరు అనారోగ్యం కారణంగా మృతి చెందడం విచారకరం. ఎన్నికల ముందు ఓట్ల తొలగింపు వ్యవహారంపై తీవ్ర స్థాయిలో దుమారం చెలరేగింది. కొందరు కోర్టులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు ఎన్నికలు జరపడానికి, తర్వాత కౌంటింగ్ చేయడానికి కోర్టు అనుమతి లభించడంతో.. మార్చి 10న పోలింగ్ జరిగింది. అయితే కోవిడ్ నిబంధనల కారణంగా కౌంటింగ్ లో జాప్యం ఏర్పడింది. మొత్తం మీద ఎస్ఈసీ ఆదేశాలతో నేడు కౌంటింగ్ ప్రక్రియ పూర్తి కావడంతో.. వైసీపీ గ్రాండ్ విక్టరీ సాధించింది. మేయర్ పీఠం అధికార పార్టీ పరమైంది.
Also Read:భారీ మొసలిని చుట్టేసి అమాంతం మింగేసిన కొండ చిలువ.. వామ్మో..!