బస్సుయాత్రలతో గేరు మార్చి పక్కా ఎన్నికల మూడ్‌లోకి వచ్చేసింది వైసీపీ. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల నుంచి మొదలైన బస్సు యాత్రల్లో రెట్టించిన ఉత్సాహంతో పాల్గొన్నారు నేతలు. ప్రభుత్వ విధాన నిర్ణయాల్ని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ సాగింది తొలిరోజు సామాజిక సాధికార బస్సు యాత్ర.
ఏపీలో 65 రోజులకు పైగా సాగే వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్రలు గురువారం ప్రారంభమయ్యాయి. ఇచ్ఛాపురం, తెనాలి, శింగనమలలో దూసుకెళ్లాయి వైసీపీ బస్సులు. ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ మైనారిటీ వర్గాలతో మమేకం అవుతూ సాగారు నేతలు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఇచ్చాపురం నుంచి మంత్రి బొత్స సత్యనారాయణ జెండా ఊపి, పూజా కార్యక్రమాలు నిర్వహించి బస్సు యాత్రను ప్రారంభించారు. సాయంత్రం 10 వేల మందితో నిర్వహించిన బహిరంగసభలో ప్రసంగించారు నేతలు. అటు.. మధ్యాంధ్ర ప్రాంతంలో గుంటూరు జిల్లా తెనాలి నుంచి ప్రారంభమైంది సామాజిక సాధికార బస్సు యాత్ర. కొలకలూరుకు ఉదయాన్నే చేరుకున్న నేతలు.. బీసీలకు ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురించి వివరించారు.
దక్షిణాంధ్రలో అనంతపురం జిల్లా శింగనమల నుంచి వైసీపీ బస్సు యాత్ర మొదలైంది. ఇన్‌చార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, డిప్యూటీ ముఖ్యమంత్రి అంజాద్ బాషా, బాపట్ల ఎంపీ నందిగం సురేష్, మంత్రులు ఉషశ్రీ చరణ్, జయరాం, ఎంపీ గోరంట్ల మాధవ్.. స్థానిక ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రంలో బహిరంగసభ జరిగింది.
బస్సు యాత్ర ప్రారంభం సందర్భంగా సోషల్ మీడియా ద్వారా ప్రత్యేకంగా సందేశమిచ్చారు సీఎం జగన్. దేశచరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో అన్ని సామాజికవర్గాలకూ ప్రగతిని ఒక హక్కుగా అందించామంటూ ట్వీట్ చేశారు. షెడ్యూల్ ప్రకారం శుక్రవారం గజపతి నగరం, నరసాపురం, తిరుపతి నియోజకవర్గాల్లో రెండోరోజు బస్సు యాత్రలు జరుగుతాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి