Andhra Pradesh: ఎన్నికలే టార్గెట్‌గా స్పీడు పెంచుతోన్న వైసీపీ.. బస్సు యాత్రలతో పార్టీ శ్రేణుల్లో జోష్..
వచ్చే ఎన్నికలే టార్గెట్‌గా వైసీపీ స్పీడ్ పెంచుతోంది. గేరు మార్చి పక్కా ప్లాన్‌తో ప్రజల్లోకి వెళ్తోంది. ఏపీలోని మూడు ప్రాంతాలను బస్సుయాత్రలతో చుట్టేస్తోంది. ఇప్పటికే.. ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ చేసిన వైసీపీ.. సెకండ్ ఫేజ్‌తోనూ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపుతోంది. ఇవాళ విజయనగరం జిల్లా రాజాం, అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో బస్సు యాత్రలు కొనసాగాయి.
ఏపీలోని మూడు ప్రాంతాల నుంచి మొదలైన సామాజిక సాధికార బస్సు యాత్రల్లో రెట్టించిన ఉత్సాహంతో పాల్గొంటున్నారు వైసీపీ ప్రజాప్రతినిధులు, నేతలు. ఏపీ ప్రభుత్వ విధాన నిర్ణయాల్ని జనంలోకి తీసుకెళ్తున్నారు. ప్రధానంగా.. జగన్ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు జరిగిన మేలును వివరిస్తున్నారు. ఇక.. రెండో దశలో రెండో రోజు.. విజయనగరం జిల్లా రాజాం, అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గాల్లో బస్సుయాత్రలు నిర్వహించారు వైసీపీ నేతలు. రాజాం ఎమ్మెల్యే కంభాల జోగులు ఆధ్వర్యంలో జరిగిన బస్సుయాత్రలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ముందుగా బొద్దాంలో నూతన సచివాలయ భవనాన్ని ప్రారంభించి.. బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం.. రాజాం బస్సు యాత్ర బహిరంగ సభలో ప్రసంగించారు వైసీపీ ప్రజాప్రతినిధులు. ఈ సందర్భంగా.. వచ్చే ఎన్నికల్లో పొరపాటు చేస్తే మళ్ళీ రాష్ట్రం దోపిడీ దొంగల చేతిలోకి వెళ్తుందని.. అందుకే.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు ఏపీ శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం. ఇంటికో జాబు ఇస్తామని చెప్పిన చంద్రబాబు.. స్కిల్ డెవలెప్‌మెంట్ పేరుతో యువకుల జేబులు కొట్టేశారని ఆరోపించారు.
మరోవైపు.. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో సామాజిక సాధికార బస్సుయాత్ర కొనసాగింది. రావులపాలెంలో మీడియా సమావేశం నిర్వహించిన వైసీపీ నేతలు.. అక్కడి నుంచి ఎనిమిది కిలోమీటర్ల మేర బస్సు యాత్ర చేశారు. అనంతరం.. కొత్తపేట సెంటర్ బహిరంగ సభలో పాల్గొన్నారు. నాలుగున్నరేళ్లలో మంచి చేస్తేనే ఓటెయ్యామని ప్రజల్ని అడుగుతున్న నేత సీఎం జగన్ అన్నారు మాజీ మంత్రి కన్నబాబు. టీడీపీ, జనసేన పార్టీలు.. ఏపీలో ఒకలా, తెలంగాణలో మరోలా వ్యవహరిస్తూ.. ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నాయని మండిపడ్డారు.
వీడియో చూడండి..
మొత్తంగా.. ఏపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్రలు కొనసాగుతున్నాయి. విడతల వారీగా డిసెంబర్ నెలాఖరికి 175 నియోజకవర్గాల్లోనూ బస్సు యాత్రలు పూర్తి కానున్నాయి.