ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 11 నుంచి రెండు రోజులపాటు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నగరంలో పర్యటించనున్నారు. ఈ రెండు రోజుల పర్యటనలో ప్రధాని మోడీ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ప్రధాని మోడీ విశాఖ రానుండడం ఇది మూడోసారి. నవంబర్ 11న విశాఖలోని నావికాదళానికి చెందిన ఐఎన్ఎస్ డేగా వద్దకు ప్రధాని మోడీ చేరుకుంటారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీకి.. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్ స్వాగతం పలకనున్నారు. ఆ రోజు రాత్రి పీఎం మోడీ ఐఎన్ఎస్ చోళాలో బస చేస్తారు. ఆ మరుసటి రోజు ప్రధాని మోడీ ఆంధ్రా యూనివర్సిటీ మైదానానికి చేరుకుని అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ.. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పూర్తయిన, చేపట్టనున్న దాదాపు రూ.700 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. మోడీ పర్యటన ఖరారైన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు.
ఈ మేరకు విశాఖలో వైసీపీ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు విజయసాయిరెడ్డి.. మంగళవారం పర్యటించారు. ప్రధాని మోడీ పర్యటన ఏర్పాట్లను విజయసాయి రెడ్డి అధికారులతో పర్యవేక్షించారు. 3 లక్షల మందితో బహిరంగ సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఆంధ్రా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో బహిరంగ సభ నిర్వహించేందుకు ఈ సందర్భంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ సమీక్ష సమావేశానికి కలెక్టర్ మల్లిఖార్జున్, నగర సీపీ శ్రీకాంత్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రధాని మోడీ విశాఖ పర్యటనలో 7 అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు నిర్వహిస్తారని విజయసాయి రెడ్డి తెలిపారు. ప్రధాని కార్యక్రమం పార్టీలకు సంబంధం లేదని స్పష్టంచేశారు. రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమం జరుగుతోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వమే ప్రధాని పర్యటన ఏర్పాట్లను చేస్తోందని తెలిపారు. విశాఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున్ మాట్లాడుతూ.. 11, 12 తేదీలలో ప్రధాని మోడీ విశాఖలో పర్యటిస్తారని.. 11న రాత్రి విశాఖలో బస చేస్తారని తెలిపారు. మొత్తం 10,700 కోట్ల విలువ చేసే 7 అభివృద్ది పనులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు.
విశాఖపట్నం రైల్వేస్టేషన్ ఆధునీకరణకు..
ప్రధాని మోడీ విశాఖ పర్యటనలో రూ.400 కోట్లతో చేపట్టనున్న విశాఖపట్నం రైల్వేస్టేషన్ నవీకరణ పనులకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు ప్రధాని మోడీ పర్యటనను ప్రధానమంత్రి కార్యాలయం అధికారికంగా ఖరారు చేయడంతో.. రాష్ట్ర అధికార యంత్రాంగం ప్రధాని పర్యటన ఏర్పాట్లపై ఫుల్ ఫోకస్ చేశారు. పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయనున్నారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లపై ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఎ.మల్లికార్జున, జేసీ విశ్వనాథన్, జీవీఎంసీ కమిషనర్ రాజాబాబు.. అధికారులతో పలు మార్లు చర్చించారు. ప్రధాని పర్యటనను విజయవంతం చేసేలా ప్రణాళికలు రచించడంతో పాటు ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.
బీజేపీ నేతలతో భేటీ..?
కాగా.. ఈ పర్యటనలో ప్రధాని మోడీ రాష్ట్ర బీజేపీ నేతలతో కూడా సంభాషించే అవకాశం ఉందని తెలుస్తోంది. బీజేపీ కీలక నాయకులతో భేటీ అవుతారని సమాచారం. ఈ సందర్భంగా ఏపీ రాజకీయ అంశాలు కూడా వారి మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. త్వరలో ప్రధాని మోడీ వైజాగ్ రానుండటంతో బీజేపీ శ్రేణుల్లో నూతనుత్సాహం నెలకొంది. ప్రధాని పర్యటను విజయవంతం చేయాలని కాషాయదళం ప్రణాళికలు రచిస్తున్నట్లు పేర్కొంటున్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం..