Andhra Pradesh: చంద్రబాబు నాయుడుపై విజయసాయిరెడ్డి ఫైర్.. అలాంటి రాజకీయాలు మీకు కీడు తెస్తాయంటూ ఘాటు వ్యాఖ్యలు..

|

Sep 28, 2022 | 4:51 PM

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి తెలుగుదేశం పార్టీపై మరో సారి ఫైర్ అయ్యారు. రాజకీయాల కోసం దేవుళ్లను వదల్లేదంటూ మండిపడ్డారు. ముఖ్యమంత్రి..

Andhra Pradesh: చంద్రబాబు నాయుడుపై విజయసాయిరెడ్డి ఫైర్.. అలాంటి రాజకీయాలు మీకు కీడు తెస్తాయంటూ ఘాటు వ్యాఖ్యలు..
Vijayasai Reddy
Follow us on

Andhra Pradesh: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి తెలుగుదేశం పార్టీపై మరో సారి ఫైర్ అయ్యారు. రాజకీయాల కోసం దేవుళ్లను వదల్లేదంటూ మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం కోసం ఎంతకైనా దిగజారుతున్నారని, దేవుళ్ల విషయంలోనూ రాజకీయాలు చేయడం మీ పార్టీకి కీడు తెస్తాయంటూ చంద్రబాబు నాయుడు, లోకేశ్ తో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులపై విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై అభాండాలు వేయడానికి, దుష్ట రాజకీయం చేయడానికి తెలుగుదేశం సాక్షాత్తూ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి పేరును సైతం వాడుకోవడం మానలేదని ఓ ప్రకటనలో దుయ్యబట్టారు. కుల మతాలకు అతీతంగా తెలుగువారు సహా ప్రజలందరికీ దర్శనమిచ్చే కలియుగ దైవం తిరుమల వెంకన్న స్వామి. ఏడుకొండలవాడిపై భక్తిప్రపత్తులు ఉన్న ఎవరైనా కోనేటి రాయుడి దర్శనం చేసుకోవచ్చన్నారు.తిరుమల క్షేత్రంలో దేవుడిపై భక్తిశ్రద్ధలకే గాని సాంప్రదాయాలకు పెద్ద పీట వేయరని తెలిపారు.

తెలుగునాట గత 40 నెలలుగా ప్రతిపక్షంగా కొట్టుమిట్టాడుతున్న తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్, ఆయన బృందం ఇప్పుడు మరోసారి వెంకటేశ్వరస్వామి పేరుతో దుర్మార్గ రాజకీయం మొదలు పెట్టారని విజయసాయిరెడ్డి విమర్శించారు. వెంకటేశ్వరస్వామికి పట్టు వస్త్రాలను ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఎప్పటిలాగానే సమర్పించారని, ఇదే సందర్భంలో సప్తగిరి దైవం దీవెనలు అందుకున్నారని తెలిపారు. ఇది గిట్టని ఎమ్మెల్సీ లోకేష్‌ సహా టీడీపీ నేతలు, ఏ సీఎం అయినా సతీసమేతంగా పట్టు వస్త్రాలు దేవుడికి ఇవ్వాలనే కొత్త పాట అందుకున్నారని అన్నారు. వైఎస్.జగన్మోహన్ రెడ్డి తండ్రి దివంగత సీఏం వైఎస్‌ రాజశేఖర రెడ్డి అవకాశం వచ్చినప్పుడల్లా వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేవారని ఏంపీ విజయసాయిరెడ్డి గుర్తు చేశారు.

ఏనాడూ జననేత వైఎస్.రాజశేఖర్ రెడ్డి ఆలయ ప్రోటొకాల్‌ సౌకర్యాలను వాడుకోవడానికి ఇష్టపడేవారు కాదని, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ ద్వారా ఆయన దైవదర్శనం చేసుకునేవారని తెలిపారు. పట్టువస్త్రాలు సమర్పించాల్సివచ్చినప్పుడు మాత్రమే ఆయన ముఖ్యమంత్రి హోదాలో మహాద్వారంలోంచి వెంకన్న స్వామిని దర్శించుకునేవారని విజయసాయిరెడ్డి చెప్పారు. వెంకటేశ్వరస్వామిపై అపార భక్తిశ్రద్ధలు, విశ్వాసం ఉన్న కుటుంబం వారిదని తెలిపారు.

ఇవి కూడా చదవండి

వైఎస్.రాజశేఖరరెడ్డి తాత వెంకటరెడ్డి గారి ఇష్టదైవం వెంకటేశ్వరస్వామి అని అన్నారు. తిరుమల ఆలయ ప్రవేశంలో ప్రోటొకాల్స్, కాలం చెల్లిన సాంప్రదాయాలకు మించిన భక్తిప్రపత్తులు ఉన్న కుటుంబానికి చెందిన నేత వైఎస్. జగన్‌ మోహన్‌ రెడ్డి అని పేర్కొన్నారు. అటువంటి ముఖ్యమంత్రిపై ప్రస్తుత పవిత్ర సందర్భంలో సైతం అభాండాలు వేయడం తెలుగుదేశం పార్టీకి కీడుచేసే అంశమేగాని ‘రాజకీయ లబ్ధి’ చేకూర్చే విషయం కాదని ఘాటు వ్యాఖ్యలు చేశారు విజయసాయిరెడ్డి. 2019 మే నెల నుంచి వరుసగా జరిగిన అన్ని ఎన్నికల్లో ఓడిపోయిన చంద్రబాబు నాయుడు వారి పార్టీ తెలుగుదేశంఇక నుంచైనా మతం, కులం, సాంప్రదాయం పేరుతో చౌకబారు రాజకీయాలు చేయడం మానుకోవాలన్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం కూడా పవిత్ర గ్రంథమే అనే విషయం టీడీపీ అధినేత గుర్తించాలని హితవు పలికారు విజయసాయిరెడ్డి. ఇప్పటికైనా రాజకీయ స్వప్రయోజకనాల కోసం దిగజారవద్దని విజయసాయిరెడ్డి సూచించారు. ప్రజల హృదయాలను గెలుచుకోవడం ద్వారా మాత్రమే ఎన్నికల్లో విజయం సాధిస్తారని, ఇలాంటి విమర్శల వల్ల ప్రజల హృదయాలను గెల్చుకోలేరని విజయసాయిరెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులను విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి పట్టువస్త్రాలు సమర్పించిన విషయం తెలిసిందే. ఈసందర్భంగా సీఏం కుటుంబ సమేతంగా కాకుండా ఒక్కరూ మాత్రమే వెళ్లి స్వామి వారిని దర్శించుకుని పట్టువస్త్రాలు సమర్పించారు. ఈవిషయంపై టీడీపీ నాయకులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని విమర్శించడంతో విజయసాయిరెడ్డి టీడీపీ నాయకులపై ఫైర్ అయ్యారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..