వైసీపీ అధినేత జగన్ పార్టీలో ఎవరికీ ప్రాధాన్యత ఇవ్వరా? ఎవరైనా తలాడించడమేనా?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్‌రెడ్డి జగన్మోహన్ రెడ్డితో తన బంధం నమ్మకం, కృతజ్ఞతపై ఆధారపడిందని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు అరెస్టు, ఈవీఎంలలో అక్రమాలు, బీజేపీతో పార్టీ సంబంధాలు, అంతర్గత ప్రజాస్వామ్యం వంటి కీలక అంశాలపై టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్‌కు ఇచ్చిన క్రాస్‌ఫైర్‌లో మిథున్ రెడ్డి తన అభిప్రాయాలను పంచుకున్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) పార్లమెంటు సభ్యుడు మిథున్‌రెడ్డి టీవీ9 క్రాస్‌ఫైర్ ప్రత్యేక ఇంటర్వ్యూలో అనేక రాజకీయ అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో తనకున్న బంధం ఆర్థిక లేదా అంగబలం కాదని, అది నమ్మకం, కృతజ్ఞత, నిబద్ధతపై ఆధారపడిందని ఆయన స్పష్టం చేశారు. తాను జగన్‌కు 100 శాతం అభిమానినని, ఆయన ఆశీస్సులతోనే మూడుసార్లు ఎంపీగా ఎన్నికయ్యాయని తెలిపారు. ఎంతో మంది పార్టీని వీడినా, తాను మాత్రం “ఫెవికాల్” లా అతుక్కుపోయి ఉంటానని, జగన్ కోసం ఎంత పని చేయడానికైనా సిద్ధంగా ఉన్నానని తెలిపారు.
చంద్రబాబు నాయుడు అరెస్టుపై స్పందిస్తూ, జగన్ 16 నెలల జైలు జీవితం తర్వాతే ఆయనను అరెస్టు చేయాల్సి వచ్చిందన్నారు. ఈ కేసును ఈడీ నమోదు చేసిందని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఈవీఎంల పనితీరుపై సందేహాలు వ్యక్తం చేస్తూ, పోలింగ్ తర్వాత ఓట్ల శాతం అనూహ్యంగా పెరగడం, సీసీటీవీ ఫుటేజీలు అందుబాటులో లేకపోవడం, ఈవీఎం బ్యాటరీ రీడింగ్‌లలో తేడాలు వంటి అంశాలను లేవనెత్తారు. వైఎస్సార్సీపీ ఈ విషయమై ఎన్నికల కమిషన్, కోర్టులు, పార్లమెంటులో కూడా గట్టిగా మాట్లాడిందని చెప్పారు.
బీజేపీతో వైఎస్సార్సీపీకి అలయన్స్ లేదని, తాము ట్రిపుల్ తలాక్ వంటి కీలక బిల్లులను వ్యతిరేకించామని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే తమ పార్టీ ఇండిపెండెంట్‌గా ఉంటుందని, 2024 ఎన్నికల ముందు వచ్చిన అలయన్స్ ఆఫర్‌ను తాము తిరస్కరించామని తెలిపారు. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం గురించి ప్రస్తావిస్తూ, జగన్ సీనియర్ నాయకుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకునే నిర్ణయాలు తీసుకుంటారని వివరించారు.
పార్లమెంటులోని 11వ నంబర్ గది సెంటిమెంట్‌పై వచ్చిన వార్తలను మిథున్‌రెడ్డి ఖండించారు. అది “చెత్త న్యూస్” అని, ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇలాంటివి సృష్టిస్తారని అన్నారు. స్పీకర్ వారికి ఎనిమిది ఖాళీ గదుల ఆప్షన్ ఇచ్చారని, వాస్తు ప్రకారం నచ్చిన గదిని తాము ఎంపిక చేసుకున్నామని వివరించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
