కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా.. తనను ఈసారి గెలిపించకపోతే 2024 చివరి ఎన్నికలే చివరివని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో తనను గెలిపించి అసెంబ్లీకి పంపించాలని.. టీడీపీని అధికారంలోకి తీసుకురావాలన్నారు. ఈ సారి గెలిపించకుంటే ఇవే తన చివరి ఎన్నికలు అవుతాయని వ్యాఖ్యానించటం సర్వత్రా చర్చకు దారి తీసింది. ఇక చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలపై వైసీపీ నాయకులు తమదైన శైలిలో కౌంటర్ ఇస్తున్నారు. చంద్రబాబు కర్నూలు పర్యటనలో చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నుంచి పెద్ద ఎత్తు అటాక్ జరుగుతోంది.
చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను మాట్లాడుతూ.. వాకౌట్ చేసిన రోజే అసెంబ్లీలో చంద్రబాబుకు చివరి రోజు అయ్యిందన్నారు. చంద్రబాబు 40 ఇయర్స్ ఇండస్ట్రీ క్లోజ్ అయ్యిందని, అతను ఇక రెస్ట్ తీసుకోవచ్చు అంటూ కామెంట్ చేశారు. ప్రభుత్వ పథకాలతో ప్రజలు సీఎం జగన్‌కు బ్రహ్మరథం పడుతున్నారన్న ఆయన టీడీపీ మాటలను జనం నమ్మే పరిస్థితి లేదన్నారు. మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. ‘చంద్రబాబు తొలిసారి ఒక నిజాన్ని చెప్పారు. 2024 ఎన్నికలే చివరి ఎన్నికలు. మేం కూడా చంద్రబాబు చెబుతున్నదే చెబుతున్నాం. వచ్చేవి టీడీపీకి సమాధి కట్టే ఎన్నికలు’ అని ఫైర్ అయ్యారు.
ఇక చంద్రబాబు మరీ దిగజారిపోయి మాట్లాడుతున్నారని వైవీ సుబ్బారెడ్డి విరుచుకుపడ్డారు. అధికారం కోసం చంద్రబాబు ఏమైనా చేస్తారని మోపిదేవి వెంకట రమణ విమర్శించారు. ఇక చంద్రబాబు వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి బొత్స సత్యనారాయణ తథాస్తు అన్నారు. చంద్రబాబు నెగిటివే మాట్లాడుతున్నారని, చంద్రబాబు కోరుకున్నట్లే ప్రజలు తీర్పు ఇస్తారన్నారు. రాష్ట్రం బాగుండాలంటే చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రాకూడదన్నారు. ఆయన అధికారంలోకి వస్తే కరువు కాటకాలు వస్తాయని, చంద్రబాబు నిజంగా ఇవే చివరి ఎన్నికలను బొత్స వ్యాఖ్యానించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..