వైఎస్ షర్మిల నేడు కడప జిల్లా ఇడుపులపాయకు వెళ్లనున్నారు. కొడుకు వైఎస్ రాజా రెడ్డి పెళ్లి ఫిక్స్ అయిన నేపథ్యంలో తన తండ్రి అశీర్వాదం తీసుకోనున్నారు. వైఎస్ఆర్ ఘాట్ వద్ద పెళ్లి పత్రికను ఉంచిన తరువాత మిగిలిన పెళ్లి పనులు నిర్వహించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి 3 గంటలకు ఇడుపులపాయకు చేరుకోనున్నారు. షర్మిలతో పాటూ కొడుకు రాజారెడ్డి, కాబోయే కోడలు ప్రియా, వారి కుటుంబ సభ్యులు వెళ్లనున్నారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త అట్లూరి శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో వియ్యానికి సిద్దమైన విషయం నిన్న ఎక్స్ వేదికగా ప్రకటించారు వైఎస్ షర్మిల.
జనవరి 18న హైదరాబాద్లో నిశ్చితార్థ వేడుకను నిర్వహించనున్నారు. ఆ తరువాత ఫిబ్రవరి 17న వివాహం జరగనున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే ఈరోజు వైఎస్ఆర్ ఘాట్ వద్ద పెళ్లికి సంబంధించిన తొలి ఆహ్వాన పత్రిక ఉంచి తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశీర్వాదం తీసుకోనున్నారు. అక్కడ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన తరువాత ఈరోజు రాత్రికి వైఎస్ఆర్ ఎస్టేట్లోని ఫాం హౌజ్ లో బస చేయనున్నారు. ఉన్నత చదువులకై యూఎస్ వెళ్లిన రాజా రెడ్డి ప్రముఖ పారిశ్రామికవేత్త అట్లూరి శ్రీనివాస్ కుమార్తె అట్లూరి ప్రియాతో పరిచయం ఏర్పడింది. గత కొంత కాలంగా రాజా రెడ్డి, ప్రియా యూఎస్లోనే పని చేస్తున్నారు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి పరిణయానికి దారి తీసింది. ఇరువురి కుటుంబ సభ్యులతో చర్చించుకుని పెళ్లిపై స్పష్టత వచ్చాక ఆ విషయాన్ని ప్రజలకు తెలియజేశారు వైఎస్ షర్మిల.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..