
నిన్నటి వరకూ YS కుటుంబం వేరు.. ఇప్పుడు YS కుటుంబం వేరు.. రాజకీయంగా అన్నాచెల్లెళ్లు జగన్, షర్మిల చెరోదారిలో చేస్తున్న ప్రయాణం.. ఇప్పుడు వ్యక్తిగత విమర్శలకూ కారణమవుతోంది. తమ కుటుంబంలో చిచ్చు పెట్టింది కాంగ్రెస్ పార్టీయే అని జగన్ తొలిసారి ఓపెన్ అయ్యారు. దీనికి షర్మిల కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ.. వీరి మధ్య మాటల యుద్ధం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. వైఎస్సార్ వారసత్వం మొదలు.. పొలిటికల్‌గా ప్రతిదీ ఇప్పుడు షర్మిల సీరియస్‌గా తీసుకున్నారు. సీఎం జగన్ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు. వైఎస్ కుటుంబం చీలిందంటే దానికి కారణం.. చేజేతులా జగనన్న చేసుకున్నదే.. అందుకు సాక్ష్యం దేవుడు, నా తల్లి విజయమ్మ, యావత్ కుటుంబం అని షర్మిల చెప్పారు. వైఎస్‌ఆర్ సంక్షేమ పథకాలను జగన్ తూట్లు పొడిచారని ఆరోపించారు. నాడు వైసీపీ కోసం తాను ఎంతో శ్రమపడ్డానని.. పాదయాత్ర కూడా చేశానని గుర్తు చేశారు. తాను కాంగ్రెస్‌లో చేరడాన్ని సమర్థించుకున్నారు. వైసీపీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు 18 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారని.. వాళ్లను మంత్రులను చేస్తానని చెప్పి జగన్ మోసం చేసినట్లు తెలిపారు.
వైసీపీ అధికారంలోకి రావడానికి తాను ఎంతో చేశానని.. కానీ అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం జగన్ మారిపోయారని షర్మిల విమర్శించారు. ప్రజలకు ఎలాంటి మేలు జరగలేదని అన్నారు. రాష్ట్రానికి ఒక్క మేలు చేయకున్నా బీజేపీ పార్టీకి ఎందుకు దాసోహమయ్యారు? అని ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వం పోలవరం, ప్రత్యేక హోదా, రాజధాని నిర్మాణాన్ని పట్టించుకోలేదని ఏపీసీసీ చీఫ్ షర్మిల ఆరోపించారు. ఆఖరికి విశాఖ స్టీల్‌ను కూడా బీజేపీకి పణంగా పెట్టారని ఆరోపించారు. వైఎస్సార్ ప్రభుత్వంలో వ్యవసాయం ఒక పండుగ.. ఇప్పుడు దండగగా మారిందన్నారు. వాలంటీర్ ఉద్యోగాలు ఇస్తే సరిపోతుందా? అని ప్రశ్నించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.