ప్రస్తుత జనరేషన్‌లో కొందరు లైఫ్ వాల్యూని అర్థం చేసుకోలేకపోతున్నారు. చిన్న, చిన్న కారణాలకే బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల గురించి, భవిష్యత్ గురించి కన్న కలలను మర్చిపోయి.. క్షణికావేశంలో తనువు చాలిస్తున్నారు. తాజాగా పెళ్లి వాయిదా పడిందన్న మనస్తాపంతో ఓ యువతి (19) ఆత్మహత్య చేసుకున్న సంఘటన నెల్లూరు నగరంలోని శెట్టిగుంట రోడ్డులో గురువారం చోటుచేసుకుంది. స్థానిక పిండిమిల్లు సెంటరు వద్ద ఓ కుటుంబం నివాసం ఉంటోంది. వీరికి ముగ్గురు కుమార్తెలు. పెద్ద కుమార్తెకు ఆరు నెలల క్రితం పెళ్లి చేశారు పెద్దలు. రెండో కుమార్తెకూ వివాహం చేయాలని నిర్ణయించినా.. ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఏడాది వాయిదా వేశారు. దాంతో మనస్తాపానికి గురైన ఆ యువతి బెడ్ రూమ్‌లో ఫ్యానుకు ఉరేసుకుంది. గదిలోనుంచి కుమార్తె ఎంతకూ బయటకు రాకపోవడం, పిలిచినా పలకకపోవడంతో తల్లిదండ్రులు పరిశీలించగా ఫ్యానుకు వేలాడుతూ కనిపించింది. వెంటనే హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన డాక్టర్లు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. నవాబుపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.