Anantapur District: పురుగుల మందు తాగి యువరైతు దంపతుల ఆత్మహత్య.. అనాథలైన ముగ్గురు పిల్లలు

|

May 01, 2023 | 11:27 AM

అప్పులు చేసి పంటలు వేశారు ఆ యువ రైతు దంపతులు. పంట చేతికి రాకపోగా చేసిన అప్పులు వడ్డీతో సహా కొండంత అయ్యాయి. వాటిని తీర్చే దారి లేక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరూ..

Anantapur District: పురుగుల మందు తాగి యువరైతు దంపతుల ఆత్మహత్య.. అనాథలైన ముగ్గురు పిల్లలు
Young Farmer Couple Dies By Suicide
Follow us on

అప్పులు చేసి పంటలు వేశారు ఆ యువ రైతు దంపతులు. పంట చేతికి రాకపోగా చేసిన అప్పులు వడ్డీతో సహా కొండంత అయ్యాయి. వాటిని తీర్చే దారి లేక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరూ మృతిచెందారు. ఏం జరిగిందో.. అమ్మనాన్నలు ఏమయ్యారో తెలియని అభం శుభం తెలియని ముగ్గురు పిల్లలు అనాథలుగా మారారు. ఈ హృదయ విదారక ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

అనంతపురం జిల్లా, కణేకల్లు మండలం బెణికల్లు గ్రామానికి చెందిన ఆనంద్‌కు, బిదురుకుంతానికి చెందిన అక్క కుమార్తె లక్ష్మితో ఎనిమిదేళ్ల కిందట వివాహం జరిగింది. వారికి శివరామకృష్ణ (నల్గవ తరగతి), ధనుష్‌ (రెండో తరగతి), రవి (ఏడాదిన్నర వయసు) అనే ముగ్గురు కుమారులు సంతానం. ఆనంద్‌కు తన తల్లి ద్వారా సంక్రమించిన ఎకరా పొలంతోపాటు మరో ఏడు ఎకరాలు కౌలుకు తీసుకుని వరి, పత్తి పంటలు సాగు చేసేవాడు. ఐదేళ్లుగా వరుసగా నష్టాలు వచ్చాయి. పెట్టుబడి కోసం రూ.5 లక్షల వరకు అప్పులు చేశారు. ప్రభుత్వ సాయం అందక.. అప్పుల వాళ్లకు సమాధానం చెప్పలేక దంపతులిద్దరూ మదనపడ్డారు.

ఈ క్రమంలో గత గురువారం దంపతులిద్దరు పురుగుల మందు తాగారు. ఇరుగుపొరుగు బళ్లారి విమ్స్‌లో చేర్పించి చికిత్స అందించగా.. శుక్రవారం ఆనంద్‌, ఆదివారం లక్ష్మి ఒకరి తర్వాత ఒకరు మృతి చెందారు.

ఇవి కూడా చదవండి

కూతురు, అల్లడు మృతి చెందడంతో అనాథలైన మనవళ్లను పట్టుకుని లక్ష్మి తల్లి హనుమక్క రోదించిన తీరు పలువురిని కలచివేసింది. ఆనంద్‌ తండ్రి ఇది వరకే మృతిచెందగా వయసు పైబడిన తల్లి పింఛన్‌ సొమ్ముతో జీవనం సాగిస్తోంది. దీంతో పిల్లల సంరక్షణ బాధ్యత ప్రశ్నార్థకంగా మిగిలింది. దాతల ఆపన్న హస్తం కోసం ఆ పసి హృదయాలు అర్థిస్తున్నాయి. పిల్లల సంరక్షణ, చదువు బాధ్యతలను ప్రభుత్వం తీసుకోవాలని బాధిత కుటుంబం బంధువులు కోరుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.