
బోలెడంత సీనియారిటీ ఉంది. కానీ ఆయనకెందుకో బ్యాడ్ టైమ్ నడుస్తోంది. పార్టీలోని చికాకులతో కిందామీదా పడుతుంటే ఇప్పుడు కుటుంబవివాదం ఆయన్ని మరిన్ని చిక్కుల్లో పడేసింది. నెల్లూరు రాజకీయాల్లో వివాదాలకు కేంద్రబిందువు అవుతున్నారు ఉదయగిరి వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి. ఇటీవల పేరు. జిల్లాలోని కాకలు తీరిన రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన చంద్రశేఖర్‌రెడ్డి మాజీ ఎంపీ రాజమోహన్‌రెడ్డికి స్వయానా తమ్ముడు. ఇంటాబయటా సవాళ్లతో ఆయన పరిస్థితి ఇప్పుడు ముందునుయ్యి వెనుకగొయ్యి అన్నట్లే ఉంది.
ఉదయగిరి నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి. ఇంత అనుభవంతో పాతుకుపోవాల్సిన చోట ఆయనకు అసమ్మతి సెగ తగులుతోంది. గత ఎన్నికల్లోనే మేకపాటికి సీటు ఇవ్వొద్దని కొందరు అధినాయకత్వానికి ఫిర్యాదులు కూడా చేశారు. అయితే ఎలాగోలా టిక్కెట్ దక్కింది..మళ్లీ గెలిచారు. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదినుంచీ మేకపాటికి వ్యతిరేకంగా అసమ్మతి గట్టిగా గొంతెత్తుతోంది. కొందరు ఆయనపై బహిరంగ విమర్శలు చేస్తున్నారు. మాజీ ఎంపీపీ చేజర్ల సుబ్బారెడ్డి మేకపాటిని టార్గెట్ చేసుకుంటూ మీడియాకి ఎక్కుతున్నారు.
వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు వచ్చే అవకాశం లేనివారి జాబితాలో మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అధినాయకత్వం దగ్గరున్న 40 మంది జాబితాలో ఉదయగిరి ఎమ్మెల్యే కూడా ఉన్నారని ఆయన వ్యతిరేక వర్గం విస్తృతంగా ప్రచారం చేస్తోంది. మేకపాటి వర్గం మాత్రం మళ్లీ ఆయనకే ఇస్తారంటూ కౌంటర్ ఇస్తోంది. టికెట్‌మీద మాటామాటా నడుస్తుండగానే కొత్త టెన్షన్ మొదలైంది ఎమ్మెల్యే మేకపాటికి. ఈసారి బయటినుంచి కాదు. ఇంటిపోరు ఆయన్ని షేక్ చేస్తోంది. చంద్రశేఖర్ రెడ్డి తన తండ్రి అంటూ బెంగళూరులో ఉంటున్న శివచరణ్‌రెడ్డి విడుదలచేసిన లేఖ ఎమ్మెల్యేని డిఫెన్స్‌లో పడేసింది.
తన చిన్న వయసులోనే తండ్రి తనవద్దకు రావడం మానేశారని ఆయన కుమారుడిగా చెప్పుకుంటున్న శివచరణ్‌రెడ్డి ప్రకటించాడు. తనకు ఆస్తులు అవసరంలేదని, ఆయన కొడుకుగా గుర్తింపు చాలంటూ సెంటిమెంట్‌తో కొట్టాడు. ఎమ్మెల్యే మేకపాటి ఆ లేఖను ఖండించడం.. మళ్లీ శివచరణ్ వీడియో విడుదల చేయడంతో నెల్లూరులో నాలుగురోజులుగా ఇదే రచ్చ నడుస్తోంది. తనకేం సంబంధం లేదంటున్న మేకపాటికి అటు శివచరణ్, అతని తల్లి లక్ష్మీదేవి వీడియోతో కౌంటర్ ఇచ్చారు.
మేకపాటి ఖండిస్తున్నా ఆ ప్రచారాన్ని పార్టీ కేడర్ నమ్మడం లేదట. ఆయన అనుచరులు కూడా అదంతా పర్సనల్ అన్నట్లు మాట్లాడుతున్నారని సమాచారం. ఈ వారసత్వ గోల నడుస్తుండగానే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి రెండో భార్యగా ప్రకటించిన శాంతమ్మ తెరపైకొచ్చారు. న్యాయం చేయి స్వామీ అంటూ ఆమె దేవుడికి మొరపెట్టుకుంటున్న పోస్టులు సోషల్ మీడియాలో మరింత కలకలం రేపుతున్నాయి. ఇలా వరుస వివాదాలతో ఎమ్మెల్యే మేకపాటి తల బొప్పికడుతోంది. సార్ ఖండించేకొద్దీ మరిన్ని ఆధారాలు తెరపైకొచ్చేలా ఉన్నాయని కేడర్ చెవులు కొరుక్కుంటోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం