చిత్తూరు జిల్లా, ఆగస్టు 6: తెలుగు దేశం పార్టీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును బహిరంగ చర్చకు రావాలని చాలెంట్ చేశారు శ్రీకాళహస్తి వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి. శ్రీకాళహస్తిలో యుద్దబేరి సభలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి ఘాటుగా రియక్ట్ అయ్యారు. చంద్రబాబు చేసిన ఆరోపణలపై తాను చర్చకు సిద్దమన్నారు. ఆధారాలతో చంద్రబాబు చర్చకు రావాాలి లేదంటే ఆయన కొడుకు లోకేష్ రావాలన్నారు మధుసూదన్ రెడ్డి. రానున్న ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలోని ప్రజలు చంద్రబాబును నమ్మరని, శ్రీకాళహస్తిలో పోటీకి చంద్రబాబు రావాలన్నారు. కుప్పంలో చంద్రబాబును ముఖ్యమంత్రి జగన్ ఎలాగూ గెలవనివ్వరని మధుసూదన్ ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు. అనవసరపు ఆరోపణలు చేసి చర్చకు రాకపోతే చంద్రబాబును శివుడు కూడా క్షమించడన్నారు.
చంద్రబాబు రూ. 1.50 లక్ష కోట్ల ఆస్తిలో సగం వాటా సొంత తమ్ముడుకు ఇవ్వాల్సి వస్తుందని తమ్ముడు ఎక్కడున్నాడో కూడా చూపడం లేదన్నారు. చంద్రబాబుకు ఓపన్ ఛాలెంజ్ విసురుతున్నానని, 40 ఏళ్లులో చంద్రబాబు చేసింది, 4 ఏళ్లు ఎమ్మెల్యేగా శ్రీకాళహస్తికి తానేమి చేసానో జనం మధ్య తేల్చుకునేందుకు ఆయన చర్చకు రావాలని మధుసూదన్ చాలెంచ్ చేశారు. అలిపిరి ఘటనలో చంద్రబాబు ప్రాణాలతో బయటపడింది నరకాన్ని అనుభవించేందుకేనని ఆయన అన్నారు. క్లైమోర్ మైన్స్ దాడిలో ప్రజలకు సేవ చేసేందుకు స్వామివారు చంద్రబాబును కాపాడలేదన్నారు. పవన్ కళ్యాణ్‌తో చంద్రబాబు అరాచకాలు సృష్టించాలని ప్రయత్నం చేశాడన్నారు. మొన్న తిరుపతికి పవన్‌ను అదే ప్లాన్ చేసి పంపారని, అయితే పవన్ ఆ పని చేయకుండా వెళ్లి పోయారు కాబట్టే చంద్రబాబే రంగంలోకి దిగి పుంగనూరులో దాడులు చేయించారని తీవ్ర ఆరోపణలు చేశారు బియ్యపు మధుసూదన్ రెడ్డి.
పుంగనూరులో చంద్రబాబే అల్లర్లు సృష్టించారని, శ్రీకాళహస్తి ఆలయ అవినీతిపై ఆరోపిస్తున్న చంద్రబాబుకు చాలెంజ్ చేస్తున్నానన్నారు.
ఆలయ అవినీతి ఆరోపణలపై విచారణ జరపాలని సీఎం జగన్‌కి కూడా విజ్ఞప్తి చేస్తున్నామని మధుసూదన్ పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయంలో, ఈ 4 ఏళ్లలో ఆలయంలో ఎప్పుడు ఏం అవినీతి జరిగిందో విచారణలో తేలిపోతుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎం పదవి కోసం చంద్రబాబు ఎన్నో పూజలు చేస్తున్నారని, అన్ని త్వరలోనే బయటకు వస్తాయన్నారు. చంద్రబాబు ఉంటే ఆయన్ను ప్రతిపక్ష పార్టీగా కూడా చూడలేమని, జూనియర్ ఎన్టీఆర్ వస్తే ప్రతిపక్ష పార్టీగా అయినా టీడీపీని చూస్తామన్నారు శ్రీకాళహస్తి వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..