Pawan Kalyan Vs YCP: జనసేనానిపై కొనసాగుతోన్న వైసీపీ నేతల మాటల దాడి.. గెలవని పవన్ ని మోడీ పక్కన పెట్టారంటున్న రోజా

|

Nov 14, 2022 | 7:07 AM

ఒక్కడిపై దండయాత్ర చేస్తోన్న వైసీపీ లీడర్స్.. తమ శ్రేణులకు దైర్యం చెబుతూ సాగుతున్న జనసేనాని.. ఏపీలోట్ తాజా రాజకీయ ముఖ చిత్రం ఇలా సాగుతోంది.

Pawan Kalyan Vs YCP: జనసేనానిపై కొనసాగుతోన్న వైసీపీ నేతల మాటల దాడి.. గెలవని పవన్ ని మోడీ పక్కన పెట్టారంటున్న రోజా
Pawan Kalyan Vs Ycp Leaders
Follow us on

వైసీపీ, జనసేన మధ్య మాటల యుద్ధం మలుపుల మీద మలుపులు తిరుగుతోంది. ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టక తప్పదంటూ.. వైసీపీ నాయకుల వ్యూహంగా ఉంటే.. మీరు ధైర్యంగా పోరాడండి. మీ వెంట నేనున్నా అంటూ తన శ్రేణులతో కలసి ప్రతివ్యూహం రచిస్తున్నారు పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలకు దాదాపు ఏడాదిన్నరకు పైగా సమయం ఉంది. ఇప్పటి నుంచే వైసీపీ వర్సెస్ జనసేన అన్నచందంగా మాటల తూటాలు పేలుతున్నాయి. వైసీపీ నేతలు ప్రేమాయణమంటూ సూటి పోటి మాటలు ..వీకెండ్ గెస్ట్.. వ్యంగ్యాస్త్రాలు..చిలుకా గోరింకల.. ఉపమానాలు..తెగిన గాలిపటం.. ఉపమేయాలు..పాల్ తో పోలికల ఎద్దేవాలు..టార్గెట్ ఒక్కటే కానీ..ఎక్కు పెట్టిన మాటల బాణాలు ఎన్నో… అన్నిటికీ ఒకటే మందు.. ధైర్యంగా ముందుకెళ్లడమేనంటూ..జనసేనాని తన శ్రేణులకు ధైర్యవచనాలు..ఇదీ తాజాగా ఏపీలోని పరిస్థితి.

రీసెంట్ గా పవన్ కళ్యాణ్‌ మోదీతో భేటీ అయినప్పటి నుంచి వైసీపీ నుంచి మాటల దాడి నాన్ స్టాప్ గా కొనసాగుతోంది. మరీ ముఖ్యంగా రోజా అయితే అది జాలి పడ్డమా? లేక ఎలాంటి జాలి దయలేకుండా మాటల దాడి చేయడమా అర్ధం కాని విధంగా మాటల తూటాలు ఎక్కు పెట్టేశారు. పవన్ కళ్యాణ్ రోజుకో రకంగా వ్యవహరిస్తారనీ. రెండు చోట్ల పోటీ చేస్తే ఎక్కడా గెలవలేదనీ. అందుకే ఆయన వల్ల ఉపయోగం లేదని గుర్తించి మోదీ పక్కన పెట్టేశారంటూ.. రొజా తన ముళ్లనన్నిటినీ పవన్ కళ్యాణ్‌ పై విసిరేశారు. సరిగ్గా ఇదే సమయంలో అంబటి కూడా.. పవన్ పై తన అవగాహన మొత్తం బయట పెట్టేశారు.

ప్రధాని మోదీతో భేటీ తర్వాత పవన్ ఎక్స్ ప్రెషన్స్ లో బాగా తేడా కొట్టిందనీ. ఇది వరకున్న జోష్ ఇప్పుడు కనిపించలేదనీ. పవన్ కల్యాణ్ ఎందుకో అంత ఉత్సాహంగా లేరంటూ అంబటి మాటల మీద మాటలను సంధించారు. ఫ్యూచర్లో జనసేన, టీడీపీ కలిసి పోటీ చేసే అవకాశముందనీ. ఈ విషయంపై తనను ఎవరు అడిగినా ఇదే చెబుతానని అంటారు మంత్రి అంబటి రాంబాబు.

ఇవి కూడా చదవండి

ఇక ఇదే కోవలోకి వచ్చిన మరో మంత్రి జోగి రమేష్ అయితే.. జగనన్న ఇళ్లు, పేదల కన్నీళ్లు కార్యక్రమం పేరు మార్చుకోవాలనీ. జగనన్న ఇళ్లు- పవన్ బాబుల కన్నీళ్లంటూ వీరీ కార్యక్రమానికి ట్యాగ్ లైన్ తగిలించుకోవడం మంచిదంటూ.. తనదైన స్టైట్లో సజెషన్ పాస్ చేశారు మంత్రి జోగి రమేష్. అంతే కాదు పవన్ కల్యాణ్ ఒక వీకెండ్ గెస్ట్ లాంటి వారనీ అభివర్ణించారు. మంత్రి జోగి రమేష్.

ఇక ఎంపీ చంద్రశేఖర్ అయితే ఒక అడుగు ముందుకేసి.. పవన్ కి కేఏ పాల్ కీ పెద్ద తేడా ఏం లేదనీ. అక్కడ మునుగోడు ఎన్నికల్లో పాల్ ఎలాంటి కామిక్ బిహేవియర్ చూపారో.. ఇక్కడ పవన్ కూడా సరిగ్గా అలాంటి వ్యవహారశైలితోనే వెళ్తున్నారనీ కామెంట్ చేశారు.

కోలగట్ల వీరభద్రస్వామి అయితే సామెతల మీద సామెతలు విడమరచి చెప్పారు. గోల గోవింద రాజులది. ముడుపులేమో వెంకన్న సామివి ఎలాగో.. జగన్ విషయంలో పవన్ కళ్యాణ్ వ్యవహారం కూడా సరిగ్గా ఇలాగే ఉంటుందని పోలికలు తెచ్చారు.

జనసేన ఓ సినిమా పార్టీలా మారిందన్నారు మంత్రి అమర్నాథ్‌. జనసేనను రాజకీయపార్టీగానే చూడడం లేదన్నారు. పవన్‌, నాదెండ్ల తప్ప జనసేనలో ఎవరున్నారని ప్రశ్నించారు. ఇద్దరూ చిలకా గోరింకల్లా బీచ్‌కు వెళ్లి.. విహరించారని విమర్శించారు. త్వరలోనే జనసేనను నాదెండ్ల బంగాళాఖాతంలో కలిపేస్తారని ఆరోపించారు.

మీరు వంద మాటలంటే.. నాది ఒకటే మాట అంటూ.. పవన్ కళ్యాణ్ తన శ్రేణులను ఉత్సాహపరిచారు. ధైర్యంగా పోరాడండి. కేసులు పెడితే మీతో పాటు.. నేను కూడా జైలుకొస్తానంటూ.. కేడర్ లో ఊపు తెచ్చే యత్నం చేశారు పవన్. ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే..ముందుంది అసలు సినిమా
అంటూ వీరంతా ఆంధ్ర ప్రజానీకానికి.. హింట్స్ ఇస్తున్నారా ?అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తానికి అతడే ఒక సైన్యంగా పవన్ ముందుకు అడుగు వేస్తుంటే.. వైసీపీ లీడర్ల అందరూ కలిసి ఒక్కడిపై దండయాత్ర చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..