Andhra Pradesh: ఉమామహేశ్వరి ఆత్మహత్యకు చంద్రబాబే కారణం.. సంచలన ఆరోపణలు చేసిన లక్ష్మీ పార్వతి..
Andhra Pradesh: దివంగత నేత ఎన్టీఆర్ చిన్న కూతురు ఉమామహేశ్వరి మృతిపై సంచలన ఆరోపణలు చేశారు నందమూరి లక్ష్మీ పార్వతి.
Andhra Pradesh: దివంగత నేత ఎన్టీఆర్ చిన్న కూతురు ఉమామహేశ్వరి మృతిపై సంచలన ఆరోపణలు చేశారు నందమూరి లక్ష్మీ పార్వతి. ఆమె బలవన్మరణానికి చంద్రబాబే కారణమని అనుమానం వ్యక్తం చేశారు. ఆస్తి కోసం చంద్రబాబు, లోకేష్ ఆమెతో గొడవ పడుతున్నారని, ఆ ఒత్తిడి భరించలేకనే ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోందన్నారు. ఆమె సూసైడ్ లెటర్ మాయం కావడంతో ఈ అనుమానాలు మరింత బలపడ్డాయని లక్ష్మీ పార్వతి వ్యాఖ్యానించారు. ఉమామహేశ్వరి ఆత్మహత్యపై సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారామె. ఇదే అంశంపై బుధవారం ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడారు లక్ష్మీ పార్వతి. ఈ మీడియా సమావేశంలో చంద్రబాబుపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. లక్ష్మీ పార్వతి ఏం మాట్లాడారో ఆ కామెంట్స్ యధావిధిగా..
అంతా ఒక మిస్టరీలా ఉంది.. ఎన్టీఆర్ కుటుంబంలో వరసగా విషాద ఘటనలు జరుగుతున్నాయి. హరికృష్ణ మరణాన్నే జీర్ణించుకోలేకపోతుంటే, ఇప్పుడు ఎన్టీఆర్ చిన్న కూతురు ఆత్మహత్య చేసుకోవడం ఇంకా బాధ కలిగిస్తోంది. వాస్తవంగా ఏం జరుగుతోందనేది అర్ధం కావడం లేదు. అంతా ఒక మిస్టరీగా కనిపిస్తోంది. సోషల్ మీడియాలో చాలా కథనాలు వినిపిస్తున్నాయి. అందులో కొన్ని వాస్తవాలు, మరికొన్ని అవాస్తవాలు ఉండొచ్చు.
అనుమానం కలుగుతుంది.. చంద్రబాబు మనస్తత్వం, అతడి నీచ రాజకీయాలు, హత్యా రాజకీయాలు తెలిసిన ఎవరికైనా అనుమానం రాక తప్పదు. శవ రాజకీయాలు చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. ఎన్టీఆర్ కుటుంబంలో ఒక శనిలా ప్రవేశించారు. ఆయన వచ్చినప్పటి నుంచి ఆ కుటుంబానికి కష్టాలు మొదలయ్యాయి. చివరికి ఇంటి పెద్దను కూడా ఆ కుటుంబం కోల్పోవడం జరిగింది.
నా భర్త మరణానికి కారకుడతనే.. నా భర్త నందమూరి తారక రామారావు మరణానికి ముందు రోజు ఏం జరిగిందనేది అందరికీ తెలుసు. సింహగర్జన సదస్సు నిర్వహించి, చంద్రబాబు చేసిన దగాను ప్రజలకు వివరించాలని అనుకుంటున్నప్పుడు, అదే జరిగితే, ఎన్టీఆర్ బయటకు వస్తే, తనకు రాజకీయ భవిష్యత్తు ఉండదని భయపడిన చంద్రబాబు, ఎన్టీఆర్ మరణానికి ఒక రోజు ముందు, అంటే జనవరి 17వ తేదీన ఎన్టీఆర్ బ్యాంక్ ఖాతాల్లో ఉన్న డబ్బును తీసుకోకుండా, స్టే తీసుకొచ్చాడు. దీంతో అదే రాత్రి ఎన్టీఆర్ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. ఆ విధంగా ఎన్టీఆర్ మరణానికి చంద్రబాబు కారణమయ్యాడు.
ఇప్పుడు కూడా ఎన్టీఆర్ కుటుంబం.. గొర్రె కసాయివాణ్ణి నమ్మినట్లుగా చంద్రబాబును నమ్ముతోంది. దీన్ని చూస్తే నాకు చాలా జాలి అనిపిస్తోంది. నన్ను బూచిగా చూపి, ఎన్టీఆర్ నుంచి పదవిని, పార్టీని లాక్కున్నాడు. దాన్ని ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు నమ్మారు. ఆ తర్వాత ఎన్టీఆర్ కుటుంబంలో చాలా జరిగాయి. ఎన్టీఆర్ మరణానికి చంద్రబాబే కారణం. అయన చనిపోవడానికి ముందు ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారు.
హరికృష్ణ మరణానికి కూడా.. హరికృష్ణను కూడా స్వార్థం కోసం వినియోగించుకున్నారు చంద్రబాబు. ఒక మంత్రి పదవి ఇచ్చి, ఆరు నెలల్లోనే లాగేసుకున్నారు. దాంతో హరికృష్ణ చాలా నిరాశ, నిస్పృహకు లోనయ్యానే. ఆ ఫ్రస్టేషన్‌లోనే కారు నడిపిన హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఆ విధంగా పరోక్షంగా ఆయన మరణానికి కూడా చంద్రబాబే కారణం. అందుకే జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్ ఇద్దరూ ఇప్పటికీ చంద్రబాబుతో మాట్లాడరు.
నాడు ఫోన్.. నేడు లేఖ.. ఇప్పుడు ఉమా మహేశ్వరి ఆత్మహత్య కూడా ఒక మిస్టరీగా మారింది. ఆమె మంచి విద్యావంతురాలు. అలాంటి ఆమె ఆత్మహత్య చేసుకుంటే, తప్పనిసరిగా లేఖ రాసి ఉంటుంది. అయితే అక్కడికి చంద్రబాబు వచ్చిన తర్వాత ఆ లేఖ మాయమైంది అంటున్నారు. గతంలో కోడెల శివప్రసాదరావు మరణానికి కూడా చంద్రబాబే కారణం. ఆయనను చంద్రబాబు చాలా దారుణంగా మోసం చేశాడు. అదే విషయాన్ని కోడెల స్వయంగా తన ఫోన్‌లో రికార్డు చేశాడు. దాంతో ఆ ఫోన్‌నే మాయం చేశారు. కోడెలను దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి కాకుండా దూరంగా ఉన్న బసవ తారకం ఆస్పత్రికి తీసుకుపోయారు. దీంతో ఆయన చనిపోయాడు. ఆ తర్వాత కూడా కోడెల భౌతిక కాయాన్ని అడ్డం పెట్టుకుని ఏ స్థాయిలో రాజకీయాలు చేశాడో అందరం చూశాం.
జూనియర్ ఎన్టీఆర్‌ను కూడా.. జూనియర్ ఎన్టీఆర్‌ను కూడా చంద్రబాబు తన స్వార్థ రాజకీయాల కోసం వినియోగించుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని తెలిసి, ఇంటికి స్వయంగా వెళ్లి, ఒప్పించి ఎన్నికల్లో ప్రచారం చేయించుకున్నారు. ఆ తర్వాత తన కొడుకు కోసం అదే జూనియర్ ఎన్టీఆర్‌ను దూరం చేశారు. చివరకు ఆయన సినిమాలకు కూడా అడ్డుపడ్డారు. చంద్రబాబుది ఎంతసేపూ అనైతిక స్వార్థ రాజకీయాలే. ఇవాళ ఎన్టీఆర్ పేరుతో రాజకీయం చేస్తున్న చంద్రబాబు.. నాడు ఎన్టీఆర్ మరణానికి కారణం కాదా?.
ఆమె ధైర్యవంతురాలు.. చిన్నమ్మాయి ఉమామహేశ్వరి చాలా ధైర్యవంతురాలు. బాగా చదువుకుంది. 30 ఏళ్ల క్రితం నా దగ్గరకు వస్తే, చీర, నగ పెట్టి గౌరవించుకున్నాను. ఆ తర్వాత నన్ను ఇంట్లో నుంచి వెళ్లగొట్టినప్పుడు నాతో అమెరికా నుంచి మాట్లాడింది. అలాంటి ఆమె ఆత్మహత్య చేసుకుంది అంటే, అస్సలు నమ్మబుద్ధి కావడం లేదు. ఎన్టీఆర్ కుటుంబంలో అంత పిరికితనం లేదు.
ఆస్తి కోసం గొడవలు జరుగుతున్నాయి.. ప్రస్తుతం బయట ఒక ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు, ఆయన కొడుకు ఒక ఆస్తి విషయంలో ఉమామహేశ్వరిని వేధిస్తున్నారని, బాగా గొడవ కూడా జరిగిందని తెలుస్తోంది. వారి వేధింపులు భరించలేక, ఆ విషయాలన్నీ సూసైడ్ నోట్‌లో రాసి, ఉరి వేసుకుని చనిపోయిందని ప్రచారం జరుగుతోంది. నేను దీన్ని చాలా గట్టిగా నమ్ముతున్నాను. ఎందుకంటే చంద్రబాబుది అంత నీచమైన రాజకీయం. స్వార్థం కోసం ఎంతకైనా తెగించే మనస్తత్వం చంద్రబాబుది. ఆయనది అధికార వ్యామోహం. అధికారం కోసం ఎంతకైనా దిగజారుతారు. ఇన్నేళ్లుగా చూస్తునే ఉన్నాం.
పచ్చి స్వార్థపరులు.. చంద్రబాబు స్వార్థపరుడు. ఆయన భార్యను ఎవరూ ఏమనకున్నా సరే, కూర్చుని భోరుమని ఏడ్చి.. పెద్దసీన్ క్రియేట్ చేశాడు. ఆ తర్వాత ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరినీ ఒక చోట చేర్చి, వారితో మాట్లాడించాడు. గతంలో అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వని చంద్రబాబు, అప్పుడు డాక్టర్‌గారి భుజంపై చేయి వేసి మాట్లాడాడు.
అండగా ఉంటారనుకుంటే.. చంద్రబాబుకు నిజంగా పెద్ద మనసు ఉంటే, ఆ కుటుంబంలో ఏమైనా సమస్యలు ఉంటే, పరిష్కరించలేకపోయేవాడా? ఆ అమ్మాయి అమెరికా నుంచి వచ్చింది. చంద్రబాబు అండగా ఉంటారనుకుంది. కానీ ఆ కుటుంబాన్ని పట్టించుకోలేదు. ఆమె ఆత్మహత్యలో చంద్రబాబుకు భాగం ఉంది. ఆ అమ్మాయి సూసైడ్ నోట్‌ను మాయం చేసింది చంద్రబాబే. అది లభిస్తే వాస్తవాలు బయటకు వస్తాయి.
ఆ కుటుంబాన్ని విడిచిపెట్టు.. చంద్రబాబూ.. ఇప్పటికైనా ఆ కుటుంబాన్ని వదిలిపెట్టు. ఇంకా ఎన్నాళ్లూ నీవు, నీ కొడుకు ఎన్టీఆర్ పేరు చెప్పుకుని బతుకుతారు. నందమూరి కుటుంబాన్ని వదిలిపెట్టు. వారంతట వారు బతుకుతారు. పార్టీని అడ్డు పెట్టుకుని నీవు, నీ కొడుకు లక్షల కోట్లు సంపాదించుకున్నారు. నిజానికి ఎన్టీఆర్ పార్టీ ద్వారా ఏమీ సంపాదించుకోలేదు. తన పిల్లలకు కూడా ఏమీ ఇవ్వలేదు. కానీ నీవు లక్షల కోట్లు సంపాదించుకున్నావు. నీవు, నీ కొడుకు, మనవడు తరతరాలు తిన్నా తరగని ఆస్తి సంపాదించావు. అందుకే ఏ మాత్రమైనా మనసు అనేది ఉంటే, ఆ కుటుంబాన్ని విడిచిపెట్టు. బాలకృష్ణను విడిచిపెట్టు. బాలకృష్ణ ఒట్టి అమాయకుడు. ఆయనపై వైశ్రాయ్ హోటల్‌లో ఒత్తిడి చేసి.. ఎంతో విద్యాధికురాలు, అందగత్తె అయిన ఆయన కూతురిని నీ కొడుక్కు ఇచ్చే విధంగా ఒప్పించావు.
సీబీఐ దర్యాప్తు కోసం లేఖ రాయాలి.. ఉమా మహేశ్వరి ఆత్మహత్య విషయంలో నీకు ఏ సంబంధం లేకపోతే, నీవు నిర్దోషివి అయితే సీబీఐ దర్యాప్తు కోరుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నీవే స్వయంగా లేఖ రాయి. ఆ దర్యాప్తులో నీ నిర్దోషిత్వం లేదని తేలితే, అప్పుడు నిన్ను నమ్ముతాం. ఆ కుటుంబానికి అండగా ఉండి, బాధ్యతగా వ్యవహరించాల్సిన నీవు.. అందుకు విరుద్ధంగ.. నీవు, నీ కొడుకు ఉమామహేశ్వరితో గొడవ పడ్డారని తెలిసింది. అందుకే నువ్వే వెంటనే సీబీఐ దర్యాప్తు కోరుతూ లేఖ రాయాలి. ఒకవేళ నువ్వు లేఖ రాయకపోతే, నేనే స్వయంగా రాస్తాను అంటూ చంద్రబాబుపై తీవ్రమైన ఆరోపణలతో, పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు లక్ష్మీ పార్వతి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..