Lady Ration Shop Dealer attack: రేషన్ షాప్ సీజ్ చేసేందుకు వెళ్లిన రెవెన్యూ అధికారులకు వింత అనుభవం ఎదురైంది. ఏకంగా కళ్లలో కారం చల్లి ఊపిరాడకుండా చేసింది ఆ డీలర్. వివరాల్లోకి వెళ్తే, ఏపీలో ఓ మహిళా రేషన్ డీలర్ భద్రకాళిగా మారింది. తనను కదిలిస్తే ఊరుకుంటానా అంటూ చెలరేగిపోయింది. పోలీసులు, రెవెన్యూ అధికారులు, విలేజ్ సెక్రటేరియట్ ఉద్యోగులకు చుక్కలు చూపించింది. తూర్పుగోదావరి జిల్లా నడురబడలో రేషన్ షాపు స్వాధీనానికి రామచంద్రాపురం ఆర్డీవో సింధు ప్రయత్నించారు.
ఈ క్రమంలో డీఎస్పీ బాలచంద్రారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులతో కలిసి రేషన్ షాప్ దగ్గరకు వెళ్లారు. ముందుగా రెవెన్యూ అధికారులు అనుకున్నట్టే జరిగింది. దుకాణాన్ని స్వాధీనం చేసేందుకు మహిళా రేషన్ డీలర్ జ్యోతి ససేమిరా అంది. అధికారులపై ఎదురు దాడికి దిగింది. చేసేదిలేక ఇంటి గేటు పగలగొట్టాలంటూ ఆర్డీవో సింధు ఆర్డర్ ఇవ్వడంతో రేషన్ డీలర్ జ్యోతి మరింత రెచ్చిపోయింది. తన ఇంటి గేటును తీసేందుకు ప్రయత్నించిన అధికారుల కళ్లల్లో కారం కొట్టి రాడ్డుతో అటాక్ చేసింది.
రేషన్ డీలర్ అటాక్‌లో ఇద్దరు మహిళా పోలీసులు, సచివాలయ ఉద్యోగి, వాలంటీర్‌కు గాయాలయ్యాయి. కళ్లల్లో కారం పడటంతో విలవిల్లాడిపోయారు. డీలర్ జ్యోతి ఎదురుదాడితో ఏం చేయాలో పాలుపోక సతమతమయ్యారు అధికారులు. ఈ-పోస్, వేయింగ్ మిషన్, సరకులు అప్పగించేందుకు డీలర్ జ్యోతి నిరాకరించడంతో చేసేదేమీలేక వెనుదిరిగారు. డీలర్‌గా తనకు 2025 వరకు హక్కుందనేది జ్యోతి వాదన. హైకోర్టు ఆర్డర్‌లో కూడా అదే ఉందని చెబుతోంది. అలా కాదంటూ ఆర్డర్ చూపించమని చెప్తోంది. కేసు పెండింగ్‌లో ఉండగా.. తన ఇంటిపై దౌర్జన్యం చేస్తారా? నన్ను చంపుతారా? అంటూ డీలర్ జ్యోతి కౌంటర్ అటాక్ చేసింది. ఈ ఘటనతో అధికారులు షాక్‌కు గురయ్యారు.
Read also: Hyderabad: నల్లగండ్ల లాడ్జిలో యువతి మృతి కేసు మిస్టరీ.. అందుకే ఒంగోలు పారిపోయానంటోన్న కోటిరెడ్డి