రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు ఏ శాఖ కేటాయిస్తారు? అతను ముందు నుంచి చెబుతున్నట్లుగా హోమ్ శాఖ కేటాయిస్తారా.? తన బాబాయికి హోమ్ శాఖ ఇవ్వాలంటూ గతంలో నారా లోకేష్‌కి బహిరంగ వేదికపై రెకమెండ్ చేసిన కింజరాపు రామ్మోహన్ నాయుడు సిఫార్సు ఇపుడు ఏ మేర పని చేస్తుంది.? మంత్రులకు శాఖలు కేటాయింపు వేళ ఇపుడు అందరి దృష్టి అచ్చెన్నాయుడుకు కేటాయించబోయే శాఖపైనే ఉంది. దీనిపైనే ఇపుడు సిక్కోలు జిల్లా అంతటా చర్చ నడుస్తోంది.
రాజకీయ నాయకులు పార్టీ తరఫున టికెట్ సంపాదించి, గెలిచి, చట్టసభకు వెళ్లడం ఒక ఎత్తు అయితే.. గెలిచాక మంత్రివర్గంలో చోటు దక్కించుకోవడం మరో ఎత్తు. అందులోనూ కీలక శాఖను పొందటం అంటే పెద్ద సాహసమే అని చెప్పాలి. అందుకే పార్టీలో పట్టు సాధించి కాస్త సీనియారిటీ ఉన్న నేతలు ఎవరైనా.. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే హూమ్, రెవెన్యూ, ఆర్థిక వంటి కీలక శాఖలనే అడుగుతారు. టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు, శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు గురి కూడా ఇపుడు హోమ్ శాఖపైనే ఉంది. ఇది ఇప్పటికిప్పుడు అనుకుంటున్నది కాదు. ప్రతి పక్షంలో ఉన్నప్పటి నుంచి పలు సందర్భాలలో చెబుతున్న మాట. దీనికి బలమైన కారణం లేకపోలేదట. ప్రతిపక్షంలో ఉండగా పోలీసులు అనేక కేసులు పెట్టీ తనను అక్రమ అరెస్ట్‌లు చేసి వేధించారని.. తీవ్ర ఆవేదనలో ఉన్నారట అచ్చెన్నాయుడు. అందుకే టిడిపి అధికారంలోకి వచ్చాక చంద్రబాబుకు చెప్పి తానే హోంశాఖ మంత్రిని అవుతానని తప్పు చేసిన పోలీస్ అధికారులను గాడిలో పెడతానని.. గతంలో బహిరంగనే ఈ మాట అన్నారు. అచ్చెన్నాయుడు స్వగ్రామం కోటబొమ్మాళి మండలం నిమ్మాడలో పంచాయితీ ఎన్నికల్లో వైసిపికి చెందిన అప్పన్న అనే వ్యక్తి సర్పంచ్‌గా వేసిన నామినేషన్ వేయకుండా బెదిరించారన్న అభివాదంపై పోలిసులు అరెస్ట్ చేశారు. అలాగే ఆపరేషన్ చేసుకొని ఇంటిలో రెస్ట్ తీసుకుకుంటుండగా 2020లో ESI స్కామ్‌లో తెల్లవారుజామున ఇంటిలోకి ప్రవేశించి పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. తన ఆరోగ్యం బాగోలేదన్నా వినకుండా రోడ్డు మార్గంలో విజయవాడకు తరలించడం వంటి ఘటనలు జరిగాయి. తరువాత కూడా అచ్చన్నయుడుపై పలు పోలీసు కేసులు నమోదు చేశారు. అయితే పోలీసులు అన్యాయంగా తనను అక్రమ కేసులతో వేధిస్తున్నారంటూ తీవ్ర అవేదన వ్యక్తం చేశారు అచ్చెన్నాయుడు. ఆ సందర్భంలోనే పలు సార్లు తాను హోమ్ మినిస్టర్ అవుతనని కూడా అన్నారు.
ఈ వ్యాఖ్యలు అచ్చెన్నాయుడుతోనే సరికాదు. ఎన్నికల ముందు యువగళం సభ పేరిట టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ టెక్కలి వచ్చిన సందర్భంలో ఎంపీ రామ్మోహన్ నాయుడు సైతం ఇదేమాట అన్నారు. తన బాబాయికి హోమ్ శాఖ ఇవ్వాలని యువగళం బహిరంగ సభ వేదికపైనే నార్ లోకేష్‌ను కోరారు. తన ఇంటివాడిగా కాకుండా టిడిపి పట్ల విధేయత కలిగిన ఒక కార్యకర్తగా, టెక్కలి నియోజకవర్గ ఓటర్‌గా అడుగుతున్నానని చెప్పారు. అచ్చెన్నాయుడుకి హోమ్ మినిస్టర్ ఇస్తే లోకేష్ రాసిన రెడ్ బుక్ లాంటి వంద రెడ్ బుక్‌లకు న్యాయం చేయగల సమర్ధత తన బాబాయికి ఉందన్నారు. అయితే దానిపై లోకేష్ వేదికపై ఎటువంటి హామీ ఇవ్వలేదు.
మొత్తానికి బాబాయ్, అబ్బాయిలు హోమ్ మినిస్టర్ పదవి గురించిన ప్రస్తావనను తీవ్ర ఆవేదనతో అన్నారో.. లేక ఆలోచనతో అన్నారో తెలియదు కానీ మంత్రులకు శాఖలు కేటాయింపు వేళ ఇప్పుడు వారి వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. ఇప్పుడు కేంద్రంలో, రాష్ట్రంలో తమ కుటుంబం హవా నడుస్తున్న వేళ అచ్చెన్నాయుడుకు హోం మంత్రి పదవి ఇస్తారా లేదా అన్నదానిపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. అయితే కేంద్ర కేబినెట్లో కింజరాపు కుటుంబం నుంచి రామ్మోహన్ నాయుడుకి చోటు కల్పించటంతో రాష్ట్ర కేబినెట్లో అచ్చెన్నాయుడుకి చోటు ఉండదని విశ్లేషకులు భావించారు. కానీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఒక్క అచ్చెన్నాయుడుకే రాష్ట్ర కేబినెట్లో అవకాశం కలించారు చంద్రబాబు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది సీనియర్లను పక్కన పెట్టేసినా కింజరాపు కుటుంబం విషయంలో మాత్రం ఒకే కుటుంబం నుంచి ఇద్దరికీ కేంద్ర,రాష్ట్ర మంత్రులుగా అవకాశం కల్పించారు. కాబట్టి ఇప్పుడు అచ్చెన్నాయుడికి హోమ్ శాఖ వంటి కీలక శాఖ కేటాయించక పోవచ్చని అంతా భావిస్తున్నారు. పైగా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పట్టాభి, రఘురామ కృష్ణం రాజులతో పాటు చాలామంది సీనియర్లపై అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేశారని, చిత్ర హింసలకు గురిచేసిన సందర్భాలను గుర్తు చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..