అక్కడ జింక.. ఇక్కడ కొండచిలువ.. తరచూ జనావాసాల్లోకి వస్తున్న వన్యప్రాణులు.. భయంతో స్థానికులు ఏం చేశారంటే!

పట్టణాభివృద్ధి పేరిట అడవులను నరికేస్తున్న జనాలు ఏరికొరి మరీ కష్టాలను కొని తెచ్చుకుంటున్నారు. తమ అవసరాల కోసం జనాలు అడవులను నరికివేయడంతో.. అడవుల విస్తీర్ణం తగ్గి అక్కడ నివసించే వణ్యప్రాణులు జనావాసాల్లోకి వస్తున్నాయి. ఇలా వచ్చే వాటిలో కొన్ని క్రూర జంతువులు కూడా ఉండడంతో వాటిని చూసిన ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా ఇలాంటి కొన్ని ఘటనలు ప్రకాశం జిల్లాలో వెలుగు చూశాయి. నలమల్ల అటవీప్రాంత సమీప గ్రామాల్లో చొరబడిన పెద్దపులి స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది.

అక్కడ జింక.. ఇక్కడ కొండచిలువ.. తరచూ జనావాసాల్లోకి వస్తున్న వన్యప్రాణులు.. భయంతో స్థానికులు ఏం చేశారంటే!
Prakasham

Edited By: Anand T

Updated on: Jun 23, 2025 | 10:08 PM

తమ అవసరాల కోసం జనాలు అడవులను నరికివేయడంతో.. అడవుల విస్తీర్ణం తగ్గి అక్కడ నివసించే వన్యప్రాణులు జనావాసాల్లోకి వస్తున్నాయి. వీటిలో ప్రమాదకరమైన పెద్దపులులు, చిరుతలు, ఎలుగుబంట్లు కూడా ఉంటున్నాయి. అడవిలో ఆహారం, నీటి లభ్యత తక్కువగా ఉన్న సమయాల్లో అటవీప్రాంత సమీప గ్రామాల్లోకి ఈ వన్యప్రాణులు రావడం సహజంగా మారుతోంది. వనాన్ని వీడి వన్యప్రాణులు జనంలోకి రావడం ప్రస్తుతం తీవ్ర కలకలం రేపుతోంది. తాజాగా ప్రకాశంజిల్లా నల్లమల అటవీప్రాంత సమీప గ్రామాల్లోకి వచ్చిన పెద్దపులి.. స్థానికంగా సంచరిస్తూ ఆవులపై దాడులు చేయడం గ్రామస్థుల కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.

ఓ వైపు గ్రామాల్లోకి చొరబడిన పెద్దపులి స్థానికులను భయాందోళనలకు గురిచేస్తుంటే.. గిద్దలూరు మండలం కొండపేట గ్రామ శివారులోకి వచ్చిన ఓ జింక ముళ్లపొదల్లో చిక్కుకుని విలవిల్లాడింది. గమనించిన స్థానికులు వెంటనే స్థానిక అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న గుండ్లకమ్మ ఎఫ్‌ఆర్ఓ మధు ప్రియాంక, డిఆర్ఓ వంశీకృష్ణ ఆధ్వర్యంలో అటవీ శాఖ అధికారులు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి జింకను చాకచక్యంగా పట్టుకున్నారు. గాయపడిన జింకను అటవీ శాఖ వాహనంలో చికిత్స కోసం గిద్దలూరు వెటర్నరీ ఆసుపత్రికి తరలించారు.

ఇదిలా ఉండగా పట్టణంలోని నేతపాలెంలోనూ ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. అటవీ ప్రాంతాల్లో ఉండాల్సి ఓ 10 అడుగుల కొండ చిలువ ప్రవేశించింది ఇంట్లోకి ప్రవేశించింది. ఇంటి ఆవరణలోని గోడ దగ్గర ఏదో అలికిడి వినిపించడంతో ఇంట్లోని మహిళ పరిశీలించగా పది అడుగుల పొడవున్న కొండచిలువ కనిపించింది. దీంతో భయాందోళనకు గురైన మహిళ స్థానికులకు సమాచారం ఇచ్చింది. వెంటనే అక్కడికి చేరుకున్న స్థానికులు.. స్నేక్‌ క్యాచర్‌ సాయంతో ఇంట్లో ఉన్న కొండ చిలువను పట్టుకుని గ్రామానికి దూరంగా తీసుకెళ్ళి వదిలిపెట్టారు.

అయితే వన్యప్రాణులు తరచూ జనావాసల్లోకి ప్రవేశించడంపై అటవీశాఖ అధికారులు స్పందించారు. జనావాసాల్లో ఎక్కడైనా వన్యప్రాణులు సంచరిస్తుంటే వెంటనే తమకు సమాచారం అందించాలని అధికారులు కోరారు. వన్యప్రాణులపై ఎటువంటి దాడులు చేయరాదని సూచించారు. దాడులు చేస్తే వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటామని అటవీ శాఖ అధికారులు గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..