Andhra: నువ్వు మనిషివేనా.. మిక్సీ వైరు గొంతుకు బిగించి భార్యను హతమార్చిన భర్త

మద్యం కోసం డబ్బులు ఇవ్వలేదనే కోపంతో భార్యను గొంతు బిగించి హత్య చేసిన ఘన్ఘటన పార్వతీపురం మన్యం జిల్లాలో జరిగింది. తాపీ మేస్త్రీగా పనిచేస్తున్న రామకృష్ణ, తన భార్య త్రివేణిని మిక్సీ వైరు సహాయంతో హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. చిన్న కుమారుడి సమాచారంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Andhra: నువ్వు మనిషివేనా.. మిక్సీ వైరు గొంతుకు బిగించి భార్యను హతమార్చిన భర్త
Triveni - Rama Krishna

Edited By: Ram Naramaneni

Updated on: Aug 31, 2025 | 10:43 PM

మద్యం త్రాగడానికి డబ్బులు ఇవ్వలేదని భార్యను అతికిరాతకంగా హతమార్చాడు ఓ కసాయి భర్త. కంటికి రెప్పలా కాపాడాల్సిన భర్తే కాలయముడైన ఘటన పార్వతీపురం మన్యం జిల్లాలో సంచలనంగా మారింది. మక్కువ మండలం గోపాలపురం గ్రామానికి చెందిన త్రివేణి, పార్వతీపురం మండలం బందలుప్పి గ్రామానికి చెందిన రామకృష్ణలు గత కొన్నేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. అనంతరం ఈ దంపతులు సాలూరు పట్టణం దుగ్గాన వీధిలో అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఆదిత్య, మహేందర్ ఉన్నారు. రామకృష్ణ తాపీ మేస్త్రీగా పనిచేస్తుండగా త్రివేణి కూలి పనులు చేస్తుంటుంది. ఇద్దరు కలిసి కష్టపడి కుటుంబాన్ని పోషిస్తున్నారు. వర్షాల కారణంగా పనులు లేక గత కొద్ది రోజులుగా ఇంట్లోనే ఉండిపోయారు. ఈ క్రమంలోనే రామకృష్ణ మద్యం కోసం త్రివేణిని డబ్బులు అడిగాడు. అయితే త్రివేణి తన దగ్గర డబ్బులు లేవని డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ విషయంలో ఇరువురు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే తీవ్ర ఆగ్రహానికి గురైన రామకృష్ణ ఇంట్లో ఉన్న మిక్సీ వైరు తీసుకొని భార్య మెడకు చుట్టి బిగించి చంపేశాడు. ఆ తరువాత కొద్దిసేపటికి ఇంటికి వచ్చిన చిన్న కుమారుడు మహేందర్ తల్లి విగతజీవిగా పడి ఉండటాన్ని చూసి షాక్ అయ్యాడు. ఏమి జరిగిందని తండ్రిని అడిగాడు. దీంతో మీ అమ్మ గుండెపోటుతో పడిపోయిందని, గొల్లవీధిలో ఉన్న నీ పెద్దమ్మకు చెప్పి రా అని కొడుకు మహేంద్రని పంపించాడు రామకృష్ణ.
ఆ తర్వాత కొద్ది సేపట్లోనే త్రివేణిని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.

విషయం తెలుసుకున్న రామకృష్ణన్ వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు. చిన్నకొడుకు మహేందర్ ఈ విషయం తన అన్న ఆదిత్యకు ఫోన్ ద్వారా తెలిపి అనంతరం బంధువుల సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు ముమ్మరం చేశారు.

మరిన్ని అంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.