పశ్చిమగోదావరి జిల్లా, డిసెంబర్21; కొత్త జీవితంపై కోటి ఆశలతో వివాహబంధంతో ఒక్కటైన ఆ జంట పెళ్లయి 5 రోజులు గడవకముందే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. . ఇద్దరూ కలిసి గోదావరిలో దూకారు. వధువు ప్రాణాలు కోల్పోగా ప్రాణభయంతో వరుడు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాడు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో పెనుగొండలో చోటు చేసుకుంది. వధువు కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉండ్రాజవరం మండలం మోర్తకు చెందిన వరుడు కె.శివరామకృష్ణతో వడలికి చెందిన కోరాడ సత్యవాణికి డిసెంబరు 15న వివాహమైంది. మంగళవారం రాత్రి వడలి నుంచి వీరిద్దరూ సినిమాకి వెళ్తున్నామని ద్విచక్రవాహనంపై బయటకు వెళ్లారు. అలా వెళ్ళినవారు రాత్రయినా ఇంటికి తిరిగి చేరుకోలేదు. ఇటు పుట్టిల్లు… అటు అత్తవారిల్లు ఏ ఇంటికీ వాళ్లు వెళ్లలేదు. దీంతో కంగారుపడిన కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు.
అయితే బుధవారం దంపతులు ప్రయాణించిన బైక్ సిద్దాంతం వంతెన వద్ద గుర్తించారు. సిద్ధాంతం వంతెన వద్ద వారి బండి, వరుడు ఈదుకొచ్చిన చోట వధువు చెప్పులు ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో దంపతులిద్దరు నదిలో దూకి ఆత్మహత్య చేసుకుని వుంటారని పోలీసులు భావించారు. కానీ ఇంతలోనే షాకింగ్ విషయం బయటపడింది. రామకృష్ణ బ్రతికే వున్నాడని… తణుకులోని ఓ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్లు గుర్తించారు. అతడిని విచారించగా అసలేం జరిగిందో బయటపెట్టాడు. భార్య,భర్త ఇద్దరూ ఆత్మహత్య చేసుకోవాలని భావించామని, దీంతో ఇద్దరం కలిసి గోదావరి నదిలో దూకినట్లు రామకృష్ణ తెలిపారు. తాను ప్రాణభయంతో ఈదుకుంటూ వచ్చేశానని, తన భార్య మాత్రం నీటమునిగి గల్లంతయిపోయిందని చెప్పాడు.
పెళ్లయిన ఐదురోజులకే ఆత్మహత్య చేసుకోవాలని అనుకోవడం ఏమిటి? నదిలో దూకిన నవదంపతుల్లో భార్య చనిపోయి భర్త బ్రతకడం ఏమిటి? ఇదేదో అనుమానంగా వుందని సత్యవాణి కుటుంబసభ్యు లు ఆరోపిస్తున్నారు. కట్నం కింద లక్షా 60 వేలు, బంగారు ఆభరణాలు పెట్టామని వధువు కుటుంబసభ్యులు చెబుతున్నారు. శివరామకృష్ణ ఏదో చేసి నాటకం ఆడుతున్నాడని వధువు బంధువులు ఆరోపిస్తున్నారు. దీనిపై అదృశ్యం కేసు నమోదు చేసినట్లు పెనుగొండ పోలీసులు తెలిపారు. శివరామకృష్ణ ఏదో చేసి నాటకం ఆడుతున్నాడని వధువు బంధువులు ఆరోపిస్తున్నారు. దీనిపై మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు పెనుగొండ ఎస్సై రమేష్ తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..