Andhra Pradesh: ఏపీలో తెరమీదకు మరో కొత్త జిల్లా డిమాండ్.. లేకపోతే రాజీనామా అంటున్న..

ఏపీలో జిల్లాల పునర్విభజన మళ్లీ వివాదాస్పదమైంది. మంత్రివర్గ ఉప సంఘం గూడూరును తిరుపతి జిల్లాలోనే కొనసాగించాలని నిర్ణయించడంతో.. గూడురు ప్రజలు కొత్త డిమాండ్‌‌ను తెరపైకి తీసుకొచ్చారు. ఎన్నికల హామీ నిలబెట్టుకోకపోతే రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.

Andhra Pradesh: ఏపీలో తెరమీదకు మరో కొత్త జిల్లా డిమాండ్.. లేకపోతే రాజీనామా అంటున్న..
South Nellore District Demand

Edited By: Krishna S

Updated on: Dec 01, 2025 | 9:11 PM

ఏపీలో జిల్లాల పునర్విభజన అంశం రోజుకో వివాదంగా మారుతోంది. వైసీపీ అధికారంలో ఉన్నపుడు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న 13 జిల్లాలు 26 జిల్లాలుగా విభజించింది. పార్లమెంట్ కేంద్రాలుగా జిల్లాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన అప్పటి ప్రభుత్వం అదనంగా అల్లూరు జిల్లాను ఏర్పాటు చేసింది. దాంతో మొత్తం 26 జిల్లాలు అయ్యాయి. అయితే అప్పట్లో జిల్లాల విభజన సరైన పద్ధతిలో జరగలేదని అభ్యంతరం తెలిపిన టీడీపీ ఓటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మార్పులు చేర్పులు చేపట్టేందుకు నిర్ణయించింది. అందులో భాగంగా తీసుకున్న తీసుకున్న నిర్ణయాలు కొన్నిచోట్ల వివాదాలకు కారణం అవుతుండగా రాష్ట్రంలో మరో కొత్త జిల్లా ఏర్పాటుకు డిమాండ్ పెరుగుతోంది .

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన కొత్త రెవిన్యూ డివిజన్ల ఏర్పాటు కోసం కూటమి ప్రభుత్వం మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించింది. ఎప్పటినుంచో తిరుపతి జిల్లా ఏర్పాటు చేయాలని దశాబ్దాలుగా డిమాండ్ ఉండగా గత ప్రభుత్వం నెల్లూరు జిల్లా నుంచి కొంత ప్రాంతాన్ని కలుపుతూ తిరుపతి జిల్లాను ఏర్పాటు చేసింది. పార్లమెంట్ స్థానం కేంద్రంగా జిల్లాల ఏర్పాటు జరగగా ఉన్న కొన్ని ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని తిరుపతి జిల్లాలో ఉన్న సర్వేపల్లిని అప్పట్లో స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అలాగే పలువురు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నెల్లూరు జిల్లాలో కలిపేలా చేయగలిగారు. ఆ సందర్భంలోనే గూడూ ను కూడా నెల్లూరు జిల్లాలో కలపాలని డిమాండ్ వచ్చినా అది సాధ్యపడలేదు.

తిరుపతి కంటే గూడూరు నుంచి నెల్లూరుకి వెళ్లడమే తక్కువ సమయం తక్కువ దూరం ఉండడంతో అందరూ కూడా నెల్లూరు జిల్లాలోనే ఉంచాలని ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికలకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గూడూరు నెల్లూరులో కలుపుతామని హామీ ఇచ్చారు. ఇటీవల మంత్రివర్గ ఉప సంఘం గూడూరును తిరుపతిలోనే కొనసాగించాలని నిర్ణయించారు. అయితే స్థానిక ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ ఎన్నికల ముందు చంద్రబాబు, లోకేశ్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని లేదంటే ప్రజల కోసం రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించారు.

అధికార వైసీపీ నుంచి కూడా గూడూరు తిరుపతిలో కొనసాగించడంపై విమర్శలు ఎదురవుతున్నాయి. రాజకీయంగా జరిగిన విమర్శల మాట అటుంచితే యువతలో అలాగే ప్రజాసంఘాలు గూడూరు విషయాన్ని ఒక సెంటిమెంట్‌గా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కొత్త డిమాండ్‌ను తెరపైకి తీసుకొస్తున్నారు. గూడూరు తిరుపతి జిల్లా నుంచి వేరుచేసి నెల్లూరు జిల్లాలో కలపడం కాకుండా గూడూరు జిల్లా కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటుచేసి దక్షిణ నెల్లూరు జిల్లాగా నామకరణం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రస్తుతం తిరుపతి జిల్లాలో కలిసిన వెంకటగిరి, సూళ్లూరుపేట, గూడూరు నియోజకవర్గంతో పాటు గతంలో చిత్తూరు జిల్లాలో ఉండే సత్యవేడును కూడా కలిపి దక్షిణ నెల్లూరు జిల్లాగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ప్రస్తుతం నెల్లూరు జిల్లాగా ఉన్న ప్రాంతాన్ని యధావిధిగా ఉంచి ఉత్తర నెల్లూరు జిల్లా దక్షిణ నెల్లూరు జిల్లాగా ఉభయ గోదావరి జిల్లాల తరహాలో ఉభయ నెల్లూరు జిల్లాల ఏర్పాటు ద్వారా ప్రజల సెంటిమెంట్ దెబ్బ తినకుండా ప్రాంతాన్ని ప్రత్యేకంగా జిల్లాను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. గూడూరు నుంచి ప్రజా సంఘాల నేతలు యువత ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..