
ఆపరేగన్ కగార్‌తో మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ఇప్పటికే, వందల మందిని కోల్పోయిన మావోయిస్ట్ పార్టీకి.. ఇప్పుడు మరో అతిపెద్ద నష్టం వాటిల్లింది. ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ ప్రాంతంలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావును కోల్పోయింది. గాగన్న అలియాస్ ప్రకాష్, అలియాస్ క్రిష్ణ, అలియాస్ విజయ్, అలియాస్ కేశవ్, అలియాస్ బస్వరాజు, అలియాస్ బీఆర్, అలియాస్ దారపు నరసింహారెడ్డి, అలియాస్ నరసింహ. మావోయుస్టు పార్టీ సారథ్య బాధ్యతలు చేపట్టిన నంబాల కేశవరావుకు ఉన్న వివిధ పేర్లు ఇవి.
శ్రీకాకుళం జిల్లా… ఉద్యమాల ఖిల్లా… ఈ జిల్లా పేరు వింటే నక్సల్ ఉద్యమం, గిరిజన రైతాంగ పోరాటం గుర్తుకు వస్తాది. ఎంతో మంది మావోయిస్టులు ఈ నేలపైనే పుట్టి పెరిగారు. శ్రీకాకుళం గిరిజన రైతాంగ పోరాటాన్ని ఆయన అతి దగ్గర నుంచి చూశారు. విద్యార్థి దశ నుంచే విప్లవ రాజకీయాలవైపు ఆకర్షితుడై అంచెలంచెలుగా ఎదిగారు. ఛత్తీస్‌గడ్ రాష్ట్రం నారాయణ్ పూర్ లో బుధవారం(మే 21) జరిగిన ఎన్‌కౌంటర్‌లో 28 మంది మావోయిస్టులు మృతి చెందితే అందులో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు(70) కూడా ఉన్నారు.
నంబాల కేశవరావు మృతితో శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం జియ్యన్నపేట గ్రామం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు స్వగ్రామం జియ్యన్నపేట కావడంతో ఆ గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది. కేశవరావు చిన్నప్పటి నుండి చదువుల్లో మేటి, అభ్యుదయ భావజాలం ఉన్న వ్యక్తి. అతని ప్రాధమిక విద్య అంతా జియ్యన్నపేటలోనే కొనసాగింది. తాతగారి ఊరైన టెక్కలి మండలం తలగాంలో హైస్కూల్ విద్యను, టెక్కలి జూనియర్ కళాశాలలో ఇంటర్ విద్య పూర్తి చేశాడు. అనంతరం టెక్కలి డిగ్రీ కాలేజీలో రెండో ఏడాది డిగ్రీ చదువుతుండగా.. వరంగల్ లోని కాకతీయ రీజినల్ ఇంజనీర్ కళాశాలలో బీటెక్ లో సీటు రావడంతో అక్కడ ఇంజనీరింగ్ విద్యనభ్యసించాడు. ఆ సమయంలోనే ఆయన జీవితం ఊహించని మలుపు తిరిగింది. బీటెక్ చదువుతుండగా రాడికల్ విద్యార్ధి సంఘం వైపు ఆయన అడుగులు పడ్డాయి. బీటెక్ చదివాక, వరంగల్‌లోని రీజనల్ ఇంజనీరింగ్ (ప్రస్తుతం నేషనల్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) కాలేజీలో 1974లో ఎంటెక్ పూర్తి చేశారు. 1975 ఎమర్జెన్సీ కాలంలో అజ్ఞాతంలోకి వెళ్లారు.
సామాన్య కుటుంబం నుంచి మావోయిస్టు అగ్రనేత స్థాయికి..
కేశవరావు 1955లో జన్మించారు. తండ్రి వాసుదేవరావు ఉపాద్యాయుడు. చిన్నతనంలోనే కేశవరావు తల్లి లక్ష్మి నారాయణమ్మ మృతి చెందగా, ఆ తరువాత కేశవరావు పిన్ని భారతమ్మను వివాహం చేసుకున్నారు తండ్రి వాసుదేవరావు. లక్ష్మినారాయణమ్మకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉండగా, రెండవ సంతానమే కేశవరావు. వాసుదేవరావు వివాహం చేసుకున్నాక భారతమ్మకు ఒక కుమారుడు జన్మించాడు. కేశవరావు అన్నయ్య ఢీల్లిశ్వరరావు పోర్ట్ బ్లేయర్ లో పోర్ట్ చైర్మన్ గా పనిచేసి రిటైర్ అయ్యి విశాఖలో ఉంటున్నారు. ఇతని చిన్న చెల్లెలు చనిపోయారు.
కేశవరావు ఎంటెక్ చదువుతుండగా విద్యార్థి సంఘాల గొడవలలో 1983లో కేశవరావు అరెస్ట్ అయ్యి విశాఖ సెంట్రల్ జైలులో కొంతకాలం శిక్ష అనుభవించాడు. అదే సమయంలో ఊరుకి వచ్చేయమని విశాఖ జైలులో కలిసి కుటుంబ సభ్యులు ప్రాధేయపడ్డారు. కానీ తరువాత బెయిల్‌పై విడుదల అయిన కేశవరావు జైలు నుండి అటు నుంచి అటే అడవి బాట పట్టారు. ఆతరువాత మరి వెన్నక్కి తిరిగి చూడలేదు. దశాబ్దాలుగా సాయుధ పోరాటమే ఊపిరిగా అజ్ఞాత జీవనం గడిపారు. 1983 నుంచి గ్రామానికి, కుటుంబానికి దూరంగా పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లి పోయారు. తన తండ్రి వాసుదేవరావు చనిపోయినప్పుడు కూడా గ్రామానికి రాలేదని కుటుంబ సభ్యులు అంటున్నారు.
మిలిటరీ వ్యూహరచనలో దిట్ట
కేశవరావుది మిలిటరీ వ్యూహరచనలో అందెవేసిన చేయి. అత్యాధునిక పేలుడు పదార్థాల వినియోగంలో, పేలుళ్లకు సంబంధించిన అధునాతన ప్రక్రియల ఆచరణలోనూ కేశవరావు నిపుణుడు. గెరిల్లా పోరాట వ్యూహకర్తగా, ఆయుధ శిక్షణలోనూ ఆయన సిద్ధహస్తుడు. మావోయుస్టు పార్టీ సైనిక విభాగానికి కేశవరావు కీలక వ్యూహకర్త. మావోయుస్టు పార్టీలోని అత్యున్నత సైనిక విభాగం సెంట్రల్ మిలిటరీ కమిషన్ బాధ్యతలను ఆయన నిర్వర్తించారు. అంతేకాకుండా జోనల్ కమిటీ, స్పెషల్ ఏరియా కమిటీ లాంటి పార్టీలోని మిలిటరీ సబ్కమిటీల బాధ్యత కూడా కేశవరావుదేనని పోలీసుల అంచనా. మావోయుస్టు ప్రాబల్య రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్ గఢ్ పై ఆయనకు సంపూర్ణ అవగాహన ఉంది.
ఆరు నెలల క్రితం నుంచే కేశవరావు మావోయిస్టు పార్టీ బాధ్యతలను పర్యవేక్షిస్తున్నప్పటికీ తాజాగా అధికారికంగా ఈ నిర్ణయం వెలువడిందని తెలుస్తోంది. పార్టీని బలోపేతం చేయడంలో, కేడర్ రెక్రూట్‌మెంట్లో కేశవరావు బాధ్యత కీలకమని తెలుస్తోంది. 1980లో అప్పటి పీపుల్స్ వార్ అనుబంధ విద్యార్థి సంఘం ఆర్ఎస్‌యూ, ఏబీవీపీ విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ సందర్భంగా ఒకే ఒక్కసారి కేశవరావు శ్రీకాకుళంలో అరెస్టయ్యారు. ఆయన కళింగ సామాజిక వర్గానికి చెందిన వారు. మావోయుస్టు పార్టీ ఆధ్వర్యంలో జరిగిన పలు దాడుల్లో కేశవరావు కీలక నిందితుడిగా ఉన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అలిపిరి దాడి కేసులో సూత్రధారి. అలాగే బలిమెల ఘటనలో నంభల కేశవరావు పాత్ర ఉందని పోలీసుల అంచనా. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరావు, మాజీ ఎమ్మెల్యే సోములపై దాడి వ్యూహకర్త కేశవరావేనని అంచనా. కేశవరావుపై కేంద్రం రూ. 10 లక్షల రివార్డు ప్రకటించింది.
కేశవరావు కబడ్డీ ప్లేయర్..
కేశవరావుకు చిన్నతనంలోనే తల్లి లక్ష్మి నారాయణమ్మ మృతి చెందడంతో అతని పిన్ని భారతమ్మ సవతి తల్లి అయింది. చిన్నప్పటి నుండి భారతమ్మ చేతుల మీదుగానే కేశవరావు పెరిగి పెద్దవాడు అయ్యాడు. దీంతో అప్పట్లో ఆయన ఇష్టాఅయిష్టాలు ఏంటో ఆమెకు తెలుసు. కేశవరావుకు ఎక్కువుగా అరెసలు, పొంగడాలు, ఉత్తరాంధ్రకు చెందిన వంటలు బాగా ఇష్టం ఉండేవని అతని సవతి తల్లి భారతమ్మ చెబుతుంది. అంతేకాదు చదువులో చురుకుగా ఉండే కేశవరావుకు వ్యవసాయం అంటే బాగా ఇష్టం అని అతని వరుసకు సోదరుడు అయిన అదే గ్రామానికి చెందిన నంబాల సూర్యనారాయణ చెబుతున్నారు. ఆయనకు వ్యవసాయ పనులన్నీ వచ్చని, విద్యార్థి దశలో కూడా పొలానికి వెళ్లి వచ్చాకే స్కూల్‌కు వెళ్ళేవాడిని అంటున్నారు. కేశవరావు మంచి క్రీడాకారుడు. కబడ్డీ ప్లేయర్. కాలేజీలో చదివే రోజుల్లో స్టేట్ లెవల్ కబడ్డీ ప్లేయర్ గా రాణించారని సోదరుడు సూర్యనారాయణ అంటున్నారు.
కేశవరావు స్వగ్రామంలో పోలిసుల నిఘా..
శ్రీకాకుళం జిల్లాలోని జియ్యన్నపేట గ్రామంలో పుట్టి మావోయిస్టు అగ్రనేత, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మోస్ట్ వాంటెడ్ పర్సన్ స్థాయికి ఎదిగిన కేశవరావు ఆచూకీ కోసం జియ్యన్నపేట గ్రామంపైన నిత్యం పోలీసుల కన్ను ఉండేది. కేశవరావు 40 ఏళ్ల నుండి గ్రామానికి వచ్చిన దాఖలాలు లేవు. కానీ ఎప్పటికప్పుడు పోలీస్ నిఘా వర్గాలు మాత్రం గ్రామానికి వచ్చి అతని కోసం వాకబు చేసి వెళ్ళిపోయేవారు. గ్రామంలోని ఇతర యువకులను మొబలైజ్ చేసి ఉద్యమం వైపుకి తీసుకువెళతారో అన్న అనుమానంతో అమ్మిరెడ్డి శ్రీకాకుళం జిల్లా ఎస్పీగా ఉన్న సమయంలో గ్రామంలో లైబ్రెరీని ఏర్పాటు చేశారు. కొన్నేళ్ల పాటు పోలీస్ శాఖ నిధులతో ఈ లైబ్రరీ గ్రామంలో కొనసాగింది. ఆ తర్వాత గ్రామంపై అతని ప్రభావం పెద్దగా లేదని భావించిన పోలీసులు లైబ్రరీ నిర్వహణ గ్రామ పంచాయతీకి అప్పజెప్పి తప్పుకున్నారు.
మొత్తానికి నమ్మిన తుపాకి తూటాకే నేలకొరిగాడు కేశవరావు. కేశవరావు మృతితో జియ్యన్నపేట గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కేశవరావు గ్రామంలోని నేటి తరం వారికి పెద్దగా తెలియకపోయినప్పటికి…గ్రామంలోని బందువులు, అప్పటి తరంకి చెందిన గ్రామస్తులు ఆయనను గుర్తు చేసుకొని బాధపడుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..