Kakinada: కొడుకు మరణం తర్వాత అతనిచ్చిన పాత ఫోన్ ఓపెన్ చేసిన తండ్రి.. వెలుగులోకి భయంకర నిజం

|

Aug 22, 2022 | 3:44 PM

నిజం నిప్పులాంటిది... అది ఎప్పటికైనా బయటపడి తీరుతుంది. ఇది పచ్చి నిజం. అందుకే, భర్తను హతమార్చిన ఆమె ఘాతుకం.. ఎక్కువకాలం దాగలేదు. అవును.. కాకినాడలో జరిగిన పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ హత్యకేసు మిస్టరీని ఛేదించారు. ఒక్క స్మార్ట్‌ ఫోన్‌ డేటాతో... భార్యే అసలు నిందితురాలని తేల్చారు. 

Kakinada: కొడుకు మరణం తర్వాత అతనిచ్చిన పాత ఫోన్ ఓపెన్ చేసిన తండ్రి.. వెలుగులోకి భయంకర నిజం
Cellphone (representative image)
Follow us on

Andhra Pradesh: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన కాకినాడ ప్రత్యేక పోక్సో కోర్టు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ మహ్మద్‌ అక్బర్‌ ఆజాం మర్డర్‌(Andhra public prosecutor murder) మిస్టరీ వీడింది. పోలీసు దర్యాప్తులో సంచలన విషయాలే వెలుగుచూశాయి. మత్తుమందును ఎక్కువ డోసులో ఇవ్వడం వల్లే అతను చనిపోయినట్టు నిర్ధారించారు. కట్టుకున్న భార్యే అతణ్ని కడతేర్చినట్టు తేల్చారు పోలీసులు. భార్య అహ్మదున్నీసా బేగంతో పాటు, ఆమెకు సహకరించిన మరో ఇద్దరు నిందితులను కటకటాల్లోకి పంపారు. ఈ ఏడాది జూన్‌ 23న అజాం చనిపోయాడు. అంటే ఘటన జరిగి రెండు నెలలు కావస్తోంది. అప్పుడంతా అతనిది సహజ మరణంగానే భావించారు. అలా నమ్మించడంలో అప్పటికి సక్సెస్‌ అయ్యారు నిందితులు. మామూలుగానే అంత్యక్రియలు నిర్వహించేశారు. కానీ, ఆ తర్వాత అజాం తండ్రి హుస్సేన్‌కు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇది మామూలు మరణం కాదనీ… ప్రి ప్లాన్డ్‌ మర్డర్‌ అని నిర్ధారించారు పోలీసులు.

ఈ దర్యాప్తులో అసలు నిజం బయటకు రావడానికి.. అజాం తండ్రి హుస్సేన్‌ దగ్గర ఉన్న స్మార్ట్‌ ఫోన్‌ కారణం కావడం విశేషం. టెక్నాలజీ దెబ్బకు.. అజాం పట్ల అతని భార్య చేసిన ఘాతుకం బయటికొచ్చింది. 59 రోజుల తర్వాత మిస్టరీ వీడింది. కాకినాడలో ప్రత్యేక పోక్సో కోర్టు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా పనిచేస్తున్న మహ్మద్‌ అక్బర్‌ అజామ్‌ మొదటి భార్య 15ఏళ్ల కిందట ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చి ప్రాణాలు విడిచింది. ఆ తర్వాత యానాంకు చెందిన అహ్మదున్నీసా బేగంను మ్యారేజ్ చేసుకున్నాడు అజాం. వీరికి మళ్లీ ఇద్దరు సంతానం.. ఒక కుమారుడు, కుమార్తె కలిగారు. అయితే, అంతా బాగుందనుకున్న అజాం.. తన భార్య అహ్మదున్నీసా పన్నుతున్న కుట్రను పసిగట్టలేకపోయాడు.

అజాం తల్లిదండ్రులు కూడా కాకినాడలోనే ఉంటున్నారు. కొన్నాళ్ల క్రితం భార్యకు కొత్త ఫోన్‌ కొనిచ్చిన అజాం… ఆమె దగ్గరున్న పాతఫోన్‌ను తండ్రి హుస్సేన్‌కు ఇచ్చాడు. ఆ తర్వాత జూన్‌ 23న అజాం హఠాన్మరణంతో తీవ్ర ఆవేదన చెందిన హుస్సేన్‌.. కొడుకుది సహజ మరణమనే అనుకున్నాడు. అయితే, కోడలి పాత ఫోన్‌ను వాడుతున్న హుస్సేన్‌… ఇటీవల అందులోని వాట్సాప్‌ చాటింగులు, వాయిస్‌ మెసేజ్‌లన్నీ చూసి షాకయ్యాడు. అజాం ఉండే అపార్ట్‌మెంట్‌లోనే పైఫ్లాట్‌లో ఉండే రాజస్థాన్‌వాసి రాజేష్‌జైన్‌, మెడికల్‌ రిప్రజెంటేటివ్‌ కిరణ్‌లతో… అహ్మదున్నీసా చేసిన సీక్రెట్‌ చాటింగ్‌ అది. అదంతా విన్న హుస్సేన్‌.. తన కొడుకు అజామ్‌ది సాధారణ మరణం కాదని నిర్ధారించుకున్నాడు. ఈనెల 17న పోలీసుల్ని ఆశ్రయించాడు.

హుస్సేన్‌ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు… అజాం మృతదేహాన్ని వెలికితీశారు. జీజీహెచ్‌ ఫోరెన్సిక్‌ వైద్యుల బృందం… దానికి పోస్టుమార్టం నిర్వహించింది. ఇక, తమ స్టయిల్‌లో విచారణ మొదలెట్టిన పోలీసులకు.. విస్తుగొలిపే నిజాలే తెలిశాయి. చాలారోజులుగా పైఫ్లాట్‌లో ఉంటున్న రాజేష్‌ జైన్‌తో, మెడికల్‌ రిప్రజెంటేటివ్‌తో.. భర్త మర్డర్‌ కోసం చర్చలు జరుపుతోంది బేగం. చివరకి జూన్‌ 23ను అజామ్‌కు ఆఖరి రోజుగా ఫిక్స్‌ చేశారు. ఆరోజు, అహ్మదున్నీసా తన భర్తకు ముందుగా నిద్రమాత్రలు ఇచ్చింది. గాఢ నిద్రలోకి వెళ్లాక మెడికల్‌ రిప్రజెంటేటివ్‌ కిరణ్‌ ఎంటరయ్యాడు. క్లోరోఫామ్‌లో ముంచిన గుడ్డను..గాఢ నిద్రలో ఉన్న ఆజాం ముక్కు దగ్గర గట్టిగా అదిమి పెట్టాడు. అహ్మదున్నీసా కూడా ఓ చెయ్యేసింది. దీంతో, ఊపిరాడక ప్రాణాలు వదిలాడు అక్బర్‌ అజాం. ఇదంతా జరుగుతున్నంత సేపూ… రాజేష్‌ జైన్‌ ఇంటి బయట కాపలాగా ఉన్నాడు. ఇదీ… పోలీసు విచారణలో తేలిన విషయం.

మత్తు మోతాదు ఎక్కువ కావడంతోనే ఆజాం మరణించినట్టు నిర్దారించారు. తనకు సన్నిహితంగా మెలిగిన యువకుల సహాయంతో భార్యే ఈ దారుణానికి పాల్పడినట్లు నిర్ధారించి మర్డర్ కేసు నమోదు చేశారు. 59 రోజుల తర్వాత మర్డర్ మిస్టరీని ఛేదించిన కాకినాడ ఖాకీలు… అహ్మదున్నీసా, కిరణ్‌, రాజేష్‌ జైన్‌లను కటకటాల వెనక్కి నెట్టారు. అయితే, ఈ మర్డర్‌ ఎందుకు చేశారు? కట్టుకున్న భర్తనే కడతేర్చాల్సిన అవసరం ఆమెకు ఎందుకొచ్చింది? అనే విషయం బయటకు రావాల్సి ఉంది. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..