Andhra Pradesh: గోదావరి జిల్లాలకు పులస వచ్చేసిందోచ్‌.. పుస్తెలమ్ముకోనైనా సరే.. పులుసు రుచి చూడాల్సిందే

|

Jul 30, 2022 | 7:50 PM

వింటే భారతం వినాలి.. తింటే గారెలు తినాలి.. ఇది ఒకప్పటి మాట..! కానీ.. గోదావరి జిల్లాల లెక్కే వేరప్ప..! పుస్తెలమ్ముకోనైనా సరే.. పులస పులుసు రుచి చూడాల్సిందేనని అంటారు..!! ఇప్పుడీ మ్యాటర్‌ ఎందుకంటే... పులస వచ్చేసిందోచ్‌..!! ఇదేకాదు మరో ఇంపార్టెంట్‌ మ్యాటర్‌ కూడా ఉంది.. అదేంటో చూద్ధాం..!!

Andhra Pradesh: గోదావరి జిల్లాలకు పులస వచ్చేసిందోచ్‌.. పుస్తెలమ్ముకోనైనా సరే.. పులుసు రుచి చూడాల్సిందే
Godavari Pulasa
Follow us on

Pulasa fish: నిగనిగలాడే పులసను పడితే జాలర్లకు పండగే. ఎందుకంటే పుస్తెలమ్మయినా సరే పులస తినాలని జనం క్యూ కడుతారు. ఖరీదు ఎంతైతేనేం పులసెట్టి పులస కూర తినాల్సిందే. టేస్ట్‌ ఆ రేంజ్‌లో వుంటది. చూస్తూనే నోరూరిపోద్ది. పులస మాట వింటే చాలు.. వహ్వా.. వహ్వా అని జిహ్వా లాగేలాయల్సిందే..!! గోదావరి(Godavari) వంటకాలు వాల్డ్‌ ఫేమస్‌ అనడం ఎంత నిజమో. కొసిరి కొసిరి వడ్డించే గోదావరి జిల్లా వాసుల ఆత్మీయతకు ఫిదా కాని వారుండరనేది కూడా అంతే. గోదావరి గట్టున పొయ్యి పెట్టి పులస పులుసు తినాలంటే రాసిపెట్టి వుండాలంటారు. గోదావరిలో ఎర్రనీరు పోటెత్తిందంటే చాలు.. నాన్‌ వెజిటేరియన్స్‌ అంతా నదీ తీరం వైపు పరుగులు తీస్తారు.. ఎందుకంటే.. అదిరిపోయే రుచి వుండే పులస చేపల కోసం..! ప్రతి యేటా ఇక్కడ జాతరే..!! ఇప్పుడు వరదలతో.. మళ్లీ పులస ప్రత్యక్షమైంది. మొన్నటి వరకూ.. తెలుగు రాష్ట్రాల్లో(Telugu states) ముసురు ముంచెత్తి.. వాగులు, వంకలు పొంగి పొర్లాయి. గోదావరి కనీవినీ ఎరుగని రీతిలో ప్రవహించింది. ఈ వరద నీటిలో బీభత్సం కొనసాగింది. గోదావరి వరదను సముద్రంలోకి వదిలేందుకు ధవళేశ్వరం బ్యారేజ్‌ దగ్గర గేట్లు కూడా ఎత్తివేశారు. ఈ సమయంలోనే.. సముద్రంలో నుంచి ఇలసలు అంతర్వేది దగ్గర… వరదకు ఎదురీదుతూ గోదావరిలో ప్రవేశించాయి. ఇప్పుడు గోదారిలో పులసలు సందడి చేస్తున్నాయి.

మిలమిల మెరిసే పులస.. దునియాలో ఏక్‌ పీస్‌..! ప్రతీయేటా జూన్‌, ఆగస్ట్‌, సెప్టెంబర్‌ మాసాల్లో మాత్రమే గోదావరిలో పులసల గలగల వుంటది. అన్ని చేపలు నీటి వాటానికి తగ్గట్టుగా పోతుంటాయి. కానీ… పులస రూటే సపరేటు..! ప్రవాహానికి ఎదురీదడం పులస స్పెషాల్టీ…! ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, టాంజనీయల నుంచి సముద్ర మార్గంలో మన గోదార్లోకి వస్తుందీ పులస..!! గోదావరి సముద్రంలో కలిసే చోట ఇలా ప్రవాహానికి ఎదురీదుతూ ఈదుతూ ధవళేశ్వరం వరకు వస్తాయి పులస చేపలు. ఇక్కడ ఇంకో ముచ్చట కూడా వుంది. నిజానికి సముద్రంలో వున్నప్పుడు వీటిని ఇలస అంటారు. గోదారి నీళ్లు తాకగ.. వెండి పసిడి కలగలిసిన రంగులోకి మారి ఇలస కాస్తా పులసగా మారుద్ది. వెండి వెలుగులతో వయ్యారి భామ ఇలా ఎదురొస్తుంటే.. సిగదరగ ఆ సొగసు చూడతరమా…..!!! ఆ పులస చిక్కితే లైఫ్‌ టర్నింగే…! ఆ ఆశతోనే రేయింబళ్లు వలలేసుకొని గోదారికి ఎదురీదుతారు జాలర్లు..!

పులసలా ప్రవాహానికి ఎదురీదే చేపలు మరెక్కడా కన్పించవు. ఇదిక్కొటే కాదు.. పులుసులో పులసకు మించిన రుచి వుండదు. రాసిపెట్టుకోండి… ఇది కాదనలేని నిజం.. అని గోదారి వాసులు సంబరంగా చెప్తారు మరి..! గోదారిలో ఎన్నెన్నో జలపుప్షాలు.. అన్నీ ఆరోగ్యానికి శ్రేయస్కారమే..! కానీ అన్నింటా పులస రూటే సపరేటు. పులుసు పెడితే రుచి కత ఇక మాములుగా ఉండదు. తిన్నోళ్లకు స్వర్గం కన్పిస్తది. ఒడిశాలో కూడా పులస ఉనికి వుంది. కానీ ధవళేశ్వరం పాయెలో దొరికే పులసకు వాటికి జమీన్‌ ఆస్మాన్‌ ఫరక్‌..! వింటే ఏదైనా వినండి కానీ మాంచి చేపల కూర తినాలంటే మాత్రం పులసకి మించి మరేది వుండదంటే ఉండదంతే. ఇది క్రిస్టల్‌ క్లియర్‌.

పుస్తెలమ్మయినా సరే పులుసు కూర తినాల్సిందే.. నిజంగా అలా జరుగుతుందా !..

అంత సీనుండదు ..కానీ…పులుసకున్న క్రేజ్‌ ఎంతో ఆ మాటే నిదర్శనం. చిన్నా పెద్దా..ధనికా..పేద తేడాలేదు. పులస దొరికిందంటే .. నాన్‌ వెజ్ జనులకు ఇక పండగే. రేటు ఎంతన్నది కాదు పాయింట్‌..పులుస కర్రీ తిన్నామా లేదా? అన్నది ఇంపార్టెంట్‌. చూస్తుండగానే సీజన్‌ వచ్చేసింది. రుచిలోనే కాదు ధరలో కూడా పులస పులిలాంటిదే. అందుకే ఓ మాటంటారు. రేట్‌ ఎక్కువని పులుస తినకుండా వుంటే బతుకు పులిసిపోతుందని…! కానీ.. పులస మాటున నకిలీ పులసలు కూడా మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి. పులసలకున్న డిమాండ్‌ను అడ్డుపెట్టుకుని.. వ్యాపారులు నకిలీ పులస చేపలను అమ్ముతున్నారు ఒడిశా నుంచి తెచ్చే ఇలసనే…. పులస పేరుతో అమ్మేస్తున్నారు. కానీ.. టేస్ట్‌ పులసలా లేదని పెదవి విరుస్తున్నారు పులస ప్రియులు. నకిలీ పులసల విషయంలో జాగ్రత్తగా ఉండాలి..!!

ఏదైతేనేం.. ఇప్పుడు వరద పోటెత్తడంతో.. గోదారిలో మళ్లీ పులస మిలామిలా మెరిసిపోతోంది. పులస ప్రియుల్లారా ఇక ఊపిరి పీల్చుకోండి. జిహ్వా చాపల్యం జిందాబాద్‌… అని ఎలుగెత్తండి.. పులస పులుసు టేస్ట్‌ చేసేందుకు గెట్‌ రెడీ..!!