
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు కేసుల ఉచ్చులో కూరుకుపోతున్నట్టు కనిపిస్తోంది. కేసుల నుంచి బయటపడేందుకు ఆయన న్యాయస్థానాల్లో పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తున్నారు. అదే సమయంలో రకరకాల వ్యవహారాల్లో ప్రభుత్వమూ ఆయనపై కేసులు నమోదు చేస్తోంది. తనపై మోపిన కేసులు అక్రమమని వాదిస్తున్న చంద్రబాబుకు న్యాయస్థానంలో ఊరట ఎప్పుడు లభిస్తుందో.
మాజీ సీఎం చంద్రబాబుపై పెట్టిన కేసుల విషయంలో ఏపీ సీఐడీ పట్టుబిగిస్తున్నట్టు కనిపిస్తోంది. చంద్రబాబుపై ఏపీ సీఐడీ వరుసగా కేసులు నమోదు చేస్తోంది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో ఇప్పటికే అరెస్టు చేయగా ఇప్పుడు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసు, ఫైబర్‌నెట్ స్కాం కేసులో చంద్రబాబును విచారించేందుకు పీటీ వారెంట్ కోసం కోర్టులో సీఐడీ అధికారులు పిటిషన్లు వేశారు. అదే సమయంలో చంద్రబాబు కస్టడీకి కోర్టు అనుమతించడంతో తొలిరోజు సీఐడీ అధికారులు ఆయనను ప్రశ్నించారు. రాజమండ్రి సెంట్రల్ జైలు కాన్ఫరెన్స్ హాల్‌లో ఈ విచారణ జరిగింది. సీఐడీ అధికారులు రేపు కూడా చంద్రబాబును ప్రశ్నించనున్నారు.
మరో వైపు అరెస్టు, రిమాండ్, కస్టడీని సవాల్ చేస్తూ చంద్రబాబు నాయుడు న్యాయపోరాటం చేస్తున్నారు. అయితే ఏసీబీ కోర్టులోగాని, హైకోర్టులోగాని ఆయనకు ఊరట లభించలేదు. తాజాగా హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఏసీబీ కోర్టు రిమాండ్‌ను కొట్టేయాలని కోరుతూ చంద్రబాబు తరపు న్యాయవాదులు అత్యున్నత న్యాయస్థానంలో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను సోమవారం ప్రధాన న్యాయమూర్తి ముందు మెన్షన్ చేసి వెంటనే విచారణ చేపట్టాలని కోరే అవకాశం ఉంది. అటు చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో సోమవారం విచారణ జరగనుంది. చంద్రబాబుకు బెయిల్ ఇవ్వొద్దంటూ సీఐడీ అధికారులు 186 పేజీల కౌంటర్ దాఖలు చేశారు. ఫైబర్‌గ్రిడ్, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుల్లో చంద్రబాబు నిందితుడిగా ఉన్నారనే విషయాన్ని సీఐడీ కౌంటర్‌లో పేర్కొంది.
అటు చంద్రబాబు అరెస్టు తర్వాత రాజమండ్రిలోనే ఉంటున్న భువనేశ్వరి, బ్రాహ్మణికి చాలా మంది నాయకులు సంఘీభావం తెలుపుతున్నారు. పార్టీ శ్రేణులతో పాటు సాధారణ ప్రజలు కూడా వారిని కలుస్తున్నారు. మరి చంద్రబాబు చేస్తున్న న్యాయపోరాటం ఫలిస్తుందా? స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు పాత్రపై సీఐడీ సాక్ష్యాధారాలు సమర్పిస్తుందా? ఈ కేసుల పరంపర ఎంత వరకు వెళ్తుందో చూడాలి.
ఈ అంశంపై వీకెండ్ హావర్‌లో డిబేట్ జరిగింది. ఆ వీడియో ఇక్కడ చూడండి..