Ap Weather: ఏపీలో నేడు కూడా విస్తారంగా వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు

ఏపీలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలుచోట్ల రాకపోకలకు అంతరాయం వాటిల్లింది.

Ap Weather: ఏపీలో నేడు కూడా విస్తారంగా వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు
Ap Weather Report
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 14, 2022 | 11:14 AM

ఆంధ్రప్రదేశ్ తీరానికి దగ్గరగా రుతుపవనాల ద్రోణి ఏర్పడింది. దీంతో పాటు దక్షిణ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. వీటి కారణంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాల్లో ఓ మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి.  అనంతపురం, కడప, అన్నమయ్య ఉభయగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో వర్షాల ప్రభావం కనిపిస్తుంది. శుక్రవారం అంతా విశాఖపట్నం జిల్లాల్లో వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. కోస్తా ఆంధ్రాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం మధ్యాహ్నం/సాయంత్రం సమయంలో వర్షాలు ఎక్కువగా కురుస్తాయని ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్  సాయి ప్రణీత్ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. ఇతను ఇచ్చే వెదర్ రిపోర్ట్ వెదర్ రిపోర్ట్ నూటికి 90 శాతం ఖచ్చితంగా ఉంటుంది.

భారీ వర్షాలకు పొంగిపొర్లుతున్న వాగులు, చెరువులు…

వర్షాలు దంచికొడుతున్నాయి. వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వాగులు, వంతెనలు దాటేటప్పుడు అప్రమత్తంగా ఉండండి. లేదంటే.. ప్రమాదం బారిన పడక తప్పదు. రోజు వెళ్లే దారే కదా.. ఎప్పుడూ దాటే వాగే కదా అని నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రమాదాన్ని కొని తెచ్చుకోకండి. తెలుగురాష్ట్రాల్లో ఎక్కడ చూసినా వరదలు ఉధృతంగా వస్తున్నాయి. ముఖ్యంగా రాయలసీమలో ఎన్నడూ లేనంతగా డేంజర్ ఫ్లడ్స్ వస్తున్నాయి. దీంతో పలు చోట్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. బస్సులు, వాహనాలు వరదలో చిక్కుకుపోయి.. ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి.

శ్రీసత్య సాయి జిల్లా గోరంట్ల సమీపంలోని పెద్ద చెరువు వంకలో ఓ ప్రైవేట్‌ బస్సు ఆగిపోయింది. ఆ సమయంలో 30మంది ప్రయాణికులు ఉన్నారు. ఇది గమనించిన స్థానికులు అధికారులకు సమాచారమిచ్చారు. పోలీసులు, రెస్క్టూ టీమ్‌ స్పాట్‌కు చేరుకున్నాయి. స్తానికుల సాయంతో బస్సును సేఫ్‌గా ఒడ్డుకి చేర్చారు. దీంతో బస్సులో ఉన్న వాళ్లంతా ఊపిరిపీల్చుకున్నారు. పెద్దవంక వాగు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో బెంగళూరు – కదిరి రహదారిలో రాకపోకలు నిలిచిపోయాయి.

హిందూపూర్‌లో పెన్నా నది ఉగ్రరూపం దాల్చడంతో సమీప ప్రాంతాల వాసులు వణికిపోతున్నాయి. అనంతపురం జిల్లాలో భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఎగువ నుంచి వరద వస్తుండడంతో ఉధృతి పెరుగుతూనే ఉంది. కుట్టమూరు మరువలో ఓ లారీ చిక్కుకుంది. లారీని జేసీబీతో ఒడ్డుకు చేర్చేందుకు స్థానికులు ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు కొత్తపల్లి మరవ వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో.. హిందూపురం – చిలమత్తూరు మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇదే అనంతపురం జిల్లాలోని బుక్కరాయ సముద్రం చెరువు దగ్గర ప్రవాహంలో నిన్న లారీ కొట్టుకుపోయింది. ప్రవాహం దాటుతుండగా లారీ అదుపుతప్పింది. దీంతో ఆ రూట్‌లో రాకపోకలు బంద్ చేశారు అధికారులు.

అటు.. కడప జిల్లాలోని కంచనగారి పల్లె దగ్గర పెన్నా నదిలో కొందరు చిక్కుకుపోయారు. నదిలో ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో వాళ్లకు ఏమి చేయాలో దిక్కుతోచలేదు. చెట్టును పట్టుకుని ఒకరు కేకలు వేస్తుండడంతో స్థానికులు గమనించారు. అతనితో పాటు ఐదుగురు నదీ ప్రవాహంలో చిక్కుకుపోయారని భావిస్తున్నారు. స్థానికులు సమాచారం అందించడంతో రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు మొదలు పెట్టాయి.

గుంటూరు జిల్లాలో వర్షాలకు చెరువులు, నదులు పొంగిపొర్లుతున్నాయి. అచ్చంపేట, అమరావతి, పెదకూరపాడు,క్రోసూరు మండలాల్లో భారీవర్షం కురిసింది. పులిచింతల ప్రాజెక్టుకు ఎగువనుండి భారీ వరదనీరు వచ్చి చేరింది. కృష్ణా నదికి వరద పెరగడంతో ఇసుక లోడుకు వచ్చిన లారీలోనే చిక్కుకుపోయాయి. డ్రైవర్లను స్ధానికులను ప్రాణాలతో కాపాడారు.

ఇక అల్లూరి జిల్లాలో వరద బాధితుల కష్టాలు వర్ణణాతీతం. ప్రాణాలకు తెగించి వాగులోంచి తాళ్లపై డేంజర్‌ ప్రయాణం చేస్తున్నారు గ్రామస్తులు. వరద వచ్చిందంటే రంపచోడవరం బందమామిడి గ్రామస్తుల పరిస్ధితి ఏంటో ఈ దృశ్యాలు చూస్తే అర్ధం అవుతుంది. సరైన వంతెన లేక స్కూల్ కెళ్లే విద్యార్థులు, పనుల మీద వేరే గ్రామాలకు వెళ్లేవాళ్లు ఇదిగో ఇలా ప్రాణాలను ఫణంగా పెగట్టి సాహస యాత్ర చేయాల్సి వస్తోంది. గ్రామంలో నుంచి రంపచోడవరం తిరిగి వెళ్లాలంటే రోడ్లు బాలేకపోవడంతో వాగుపై తాళ్లతో ఏర్పాటు చేసుకుని.. ప్రమాదకరంగా ప్రయాణాలు చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.