AP – Telangana: వాయుగుండంగా మారనున్న అల్పపీడం.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు

తెలుగురాష్ట్రాల్లో మళ్లీ వానలు మొదలయ్యాయి. మూడురోజుల పాటు వర్షాలుంటాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. పిడుగులు, ఉరుములతో వానలు పడనుండడంతో అప్రమత్తత అవసరమని హెచ్చరించింది. హైదరాబాద్‌పై అయితే ఇప్పటికే వరుణుడు దండెత్తాడు. సిటీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. పూర్తి వెదర్‌ రిపోర్ట్‌పైనా ఓ లుక్కేద్దాం పదండి.

AP - Telangana: వాయుగుండంగా మారనున్న అల్పపీడం.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు
Andhra, Telangana Weather

Updated on: Sep 14, 2023 | 4:54 PM

తెలుగురాష్ట్రాల్లో విస్తృతంగా వానలు పడనున్నాయి. ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారనుంది. దీంతో ఏపీతో పాటు తెలంగాణలో పెద్ద ఎత్తున వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే అల్పపీడనం ప్రభావంతో ఏజెన్సీ ప్రాంతాల్లో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. వర్షానికి వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో కొన్ని గ్రామాల్లో రాకపోకలు అంతరాయం ఏర్పడింది. పంట పొలాల్లోకి వరద నీరు వచ్చి చేరింది. భారీ వర్షం కురవడంతో పాడేరు ఏజెన్సీలో జనజీవనం ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఏపీలోని ఉమ్మడి జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరులో భారీ వర్షాలు కురుస్తాయని చెబుతోంది విశాఖ వాతావరణ శాఖ. మిగతా చోట్ల ఓ మోస్తరు వర్షాలకు అవకాశమున్నట్లు తెలిపింది. ఇటు రాయలసీమ జిల్లాల్లో ఒకటి రెండు చోట్లు మినహా వాతావరణం పొడిగానే ఉంటుందని వాతావరణశాఖ సూచించింది.

ఇటు తెలంగాణకు కూడా భారీ వర్షసూచన ఉందని ప్రకటించింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. రానున్న 3 రోజుల పాటు భారీగా వానలు పడతాయంది. ఉరుములు, మెరుపులతో వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇక హైదరాబాద్ సిటీలో వర్షం దంచి కొడుతుంది. జూబ్లిహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్ పేట్, ఎస్సార్ నగర్, ఫిల్మ్ నగర్, మాదాపూర్ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో ఆఫీసులు ముగించుకుని ఇళ్లకు బయల్దేరినవారు ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్‌ సిటీలో చిన్న వర్షం పడినా…నాలాలు, మ్యాన్‌హోల్స్‌ పొంగిపొర్లుతున్నాయి. అలాంటిది అల్పపీడనం ఎఫెక్ట్‌తో గురువారం నుంచి నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నాలాలు, మ్యాన్‌హోల్స్ ఉప్పొంగి ప్రవహించే అవకాశం ఉంది. దీంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. ఇటీవల జరిగిన ఘటనల నేపథ్యంలో GHMC సైతం కీలక చర్యలు తీసుకోవాలి. వర్షపునీరు పోవడానికి మ్యాన్‌హోల్స్‌ ఓపెన్‌ చేసే అధికారులు, హెచ్చరికల బోర్డులు పెట్టడం మానేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్నిసార్లు చెప్పినా…అధికారులు వినడంలేదని స్థానికులు వాపోతున్నారు.

హైదరాబాద్‌ ప్రజలకు హైఅలర్ట్‌ ప్రకటించింది వాతావరణశాఖ. అప్పుడప్పుడూ ఆగినా, మళ్లీ సడన్‌గా వర్షం దంచికొడుతుందని హెచ్చరించింది. మళ్లీ ఈ రాత్రికి, తెల్లవారుజామున కుండపోత ఖాయమంటోంది వాతావరణశాఖ. ప్రస్తుతం హైదరాబాద్‌కి ఆరెంజ్‌ వార్నింగ్‌ కొనసాగుతోంది. దాంతో, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటికి రావొద్దని హెచ్చరిస్తోంది GHMC.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..