Weather Report: రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు.. ఉరుములు, మెరుపులతో జోరు వానలు! ఎల్లో అలర్ట్ జారీ

గత కొన్ని రోజులుగా నైరుతి రుతుపవనాల ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో జోరు వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈ రోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది..

Weather Report: రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు.. ఉరుములు, మెరుపులతో జోరు వానలు! ఎల్లో అలర్ట్ జారీ
Heavy Rains Forecast

Updated on: Jun 15, 2025 | 8:05 AM

అమరావతి, జూన్‌ 15: నైరుతి రుతుపవనాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో చురుగ్గా కదులుతున్నాయి. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. బంగ్లాదేశ్ నుంచి ఉత్తర బంగాళాఖాతం మీదుగా దక్షిణ ఒడిశా వరకు, మరాఠ్వాడా నుంచి తెలంగాణ మీదుగా కోస్తాంధ్ర వరకు వేర్వేరుగా ఉపరితల ద్రోణులు ఏర్పడ్డాయి. అలాగే ఉత్తరాంధ్రకు ఆనుకొని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఆవరించింది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కోస్తాలో అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. నేడు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందందని వాతావరణ శాఖ సూచించింది.

తెలంగాణ రాష్ట్రంలో నేటి వాతావరణం ఎలా ఉంటుందంటే..

ప్రస్తుతం మరాత్వాడ, దాని పరిసర ప్రాంతాలలో సగటు సముద్రమట్టం నుంచి 5.8 కి మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. తెలంగాణ మీదుగా ఉత్తరాంధ్ర తీరం వరకు సగటు సముద్రమట్టానికి 3.1 కి మీ ఎత్తులో ద్రోణి కొనసాగుతుంది. దీని ప్రభావంతో ఈ రోజు (జూన్‌ 15) తెలంగాణలోని రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇక ఈరోజు ఉష్ణోగ్రతల విషయానికి వస్తే.. ఈ రోజు తెలంగాణలోని నల్లగొండలో గరిష్టంగా 37.5, మహబూబ్ నగర్‌లో కనిష్టంగా 28.8 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు తమ పంటలను జాగ్రత్త చేసుకోవాలని అధికారులు సూచనలు జారీ చేశారు. మరోవైపు ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో రైతులు జోరుగా వ్యవసాయ పనుల్లో మునిగిపోయారు. ఈ వర్షాలు సాగు పనులకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తున్నాయి. రైతులు ఇప్పటికే భూమిని దున్నడం, విత్తనాలు చల్లడం వంటి పనులను ప్రారంభించారు. వరితోపాటు పత్తి, మొక్కజొన్న, కంది వంటి పంటలకు రైతులు సన్నాహాలు చేస్తున్నారు. భూమిలో తగినంత తేమ చేరడంతో విత్తనాలు మొలకెత్తడానికి, పంటల దిగుబడికి ఈసారి వర్షాలు ఆశాజనకంగా ఉన్నయని రైతుఉల చెబుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.https://tv9telugu.com/andhra-pradesh