Cyclone Rain Alerts: దక్షిణ అండమాన్ తీరం సముద్రంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ అల్పపీడనం మరింత బలపడి మరో 48 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశలో ప్రయాణించే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో మరో రెండు రోజులపాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.
దక్షిణ అండమాన్‌లో నేడు ఏర్పడనున్న కొత్త అల్పపీడనం మరింత బలపడి మరో 48 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశలో ప్రయాణించి తీవ్రరూపం దాల్చనుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనించి డిసెంబర్ 2 నాటికి వాయుగుండం మారే అవకాశముందని వెల్లడించారు. అక్కడి నుంచి 24 గంటల మధ్య బంగాళాఖాతం పై తుఫాన్ గా మారవచ్చని పేర్కొన్నారు. వాయువ్య దిశగా పైనుంచి మరింత బలపడి డిసెంబర్ 4న ఉత్తర ఆంధ్ర ప్రదేశ్ ఒరిస్సా తీరాలకు చేరుకునే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, ఒడిశాలో కొన్ని చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అతలాకుతలమైన దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రజలకు మరో వర్షపు ముప్పు పొంచి ఉందని తెలుస్తోంది. బంగాళాఖాతాంలో వాయుగుండం ఏర్పడి దాని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఉండనుంది. తాజాగా ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో నెల్లూరు, ప్రకాశం, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
Cyclone #jawad chance #severe cyclonic storm said #IMD 90-100/110 kmph wind pic.twitter.com/xGASeYwdcY
— Animesh Das (dipu)weathermeterologicaldepart,ot (@Animesh55637724) November 30, 2021
అల్ప పీడనం ప్రభావం అధికమైతే దక్షిణ కోస్తాంధ్రలో నేటి నుంచి మరో మూడు రోజులపాటు ఉరుములతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. యానాంకు సైతం వర్షపు ముప్పు పొంచి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. మత్స్యకారులు డిసెంబర్ 4 వరకు వేటకు వెళ్లడం ప్రమాదకరమని హెచ్చరించింది. రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. డిసెంబర్ 3 వరకు రాయలసీమలో పలు చోట్ల వర్షాలు కురవనున్నాయని అంచనా వేసింది. కొన్ని జిల్లాల్లో 7 నుంచి 20 సెంటీమీటర్ల వరకు ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురవనున్నాయి. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
తెలంగాణలో ..
దక్షిణ అండమాన్‌లో ఇవాళ ఏర్పడనున్న మరో అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో వాతావరణం పొడిగా ఉండనుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వాతావరణం చల్లగా ఉంటుందని అధికారులు తెలిపారు. ఎక్కడో ఓ చోట తేలికపాటి నుంచి చిరు జల్లులు కురిసే అవకాశం ఉంది.
Read Also… Today Horoscope: రాశి ఫలాలు.. ఈ రాశుల వారు అనుకున్నది సాధిస్తారు.. సమస్యలను అధిగమిస్తారు..!