AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weather Report: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. వాతావరణశాఖ చల్లని వార్త.. ఈ జిల్లాల్లో పిడుగులు

ఏపీ, తెలంగాణకు వాతావరణశాఖ అలర్ట్ జారీ చేసింది. పలు జిల్లాలకు భారీ వర్షసూచన జారీ చేసింది. అలాగే పలు జిల్లాల్లో పిడుగులు పడతాయని హెచ్చరించింది. అటు మూడ్రోజుల తర్వాత ఉష్ణోగ్రతలు పెరుగుతాయని స్పష్టం చేసింది. 2 నుంచి 3 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరుగుతాయని అంచనా వేసింది.

Weather Report: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. వాతావరణశాఖ చల్లని వార్త.. ఈ జిల్లాల్లో పిడుగులు
Rains
Venkatrao Lella
|

Updated on: Apr 08, 2026 | 7:13 AM

Share

తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ మరోసారి వర్షసూచన జారీ చేసింది. తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు ప్రాంతాల మీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం మీదుగా మన్నార్ వరకు ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వానలు పడనున్నాయి. ఏప్రిల్ 8వ తేదీన శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, పోలవరం, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఇక పలు ప్రాంతాల్లో పిడుగులు కూడా పడే అవకాశముందని ప్రజలను హెచ్చరించింది. బాపట్ల, తిరుపతి, చిత్తూరు, మార్కాపురం, ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో పిడుగులు పడతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

ఈ జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలు

అటు ఏపీలో గడిచిన 24 గంటల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. శ్రీకాకుళం జిల్లా కోర్లాంలో 59.5 మి.మీ వర్షపాతం నమోదవ్వగా.. అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేటలో 55.2 మిమీ, రాజాంలో 47 మిమీ, కోటపాడులో 21.2 మిమీ వర్షపాతం నమోదైంది. ఈ మేరకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ స్పష్టం చేశారు. అలాగే నిన్న కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు పడగా.. శ్రీకాకుళం, అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఈ జిల్లాల్లో పలుచోట్ల పిడుగులు కూడా పడ్డాయి. మరోవైపు ఏపీలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు ప్రాంతాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అత్యధికంగా మార్కాపురం జిల్లా బోట్లగూడూరులో 43.4 డిగ్రీలు, ప్రకాశం జిల్లా కొప్పెరపాడులో 43.2, తిరుపతి జిల్లా వెంకటగిరిలో 43.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.

తెలంగాణకు మూడ్రోజుల వర్షసూచన

ఇక తెలంగాణకు మూడ్రోజుల పాటు భారీ వర్షసూచన జారీ చేసింది. మలుగు, ఖమ్మం, సూర్యాపేట, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, మహబూబ్ నగర్, వరంగల్, నల్లగొండ జిల్లా్లలో వానలు పడతాయని హెచ్చరించింది. ఇక మరికొన్ని ప్రాంతాల్లో వడగండ్లతో కూడిన భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. ఇక కొన్ని జిల్లాల్లో పిడుగులు కూడా పడే అవకాశముందని హెచ్చరించింది. ఇక మూడ్రోజుల తర్వాత తెలంగాణలో ఎండలు మొదలుకానున్నాయి. గరిష్ణ ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల మేర పెరిగే అవకాశముందని హెచ్చరించింది. ఈ నెల 10వ తేదీ నుంచి రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని పేర్కొంది.

Follow Us