
ధర్మవరం, మే 6: ఏటీఎం ఎత్తుకెళ్లడానికి ఓ దొంగ ముఠా నానాఅగచాట్లు పడ్డారు. ముసుగులు ధరించిన ముగ్గురు దొంగలు తొలుత ఇనుప రాడ్లతో ఏటీఎమ్ మిషన్‌ను పగలగొట్టి ఎత్తుకెళ్లాలని ప్రయత్నించారు. ఆ ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఏకంగా బోలెరో వాహనంతో ATMను బయటకు ఈడ్చుకెళ్లి అదే వాహనంలో దాన్ని ఎక్కించుకుని ఉడాయించారు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో మే 6 (బుధవారం) తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన సీసీటీవీ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అసలేం జరిగిందంటే..
ఈ రోజు ఉదయం తెల్లవారు జామున ముసుగు ధరించిన దొంగల ముఠా ఒకటి ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ ఏటీఎం దోచుకునేందుకు వచ్చింది. ముసుగు ధరించిన ముగ్గురు వ్యక్తులు ఎస్‌యూవీలో సంఘటనా స్థలానికి చేరుకుని మొదట ఇనుప రాడ్లతో ఏటీఎంను పగలగొట్టడానికి ప్రయత్నించారు. ఆ ప్రయత్నం విఫలమవడంతో వారు మరింత సాహసోపేతమైన పద్ధతిని అవలంబించారు. దుండగులు యంత్రానికి తాళ్లు కట్టి, బొలెరో వాహనంతో దాన్ని బలవంతంగా బయటకు లాగి, వాహనంలోకి ఎక్కించుకుని బట్టలపల్లి వైపు పారిపోయారు. కొద్దిసేపటికే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. నిందితులను గుర్తించేందుకు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని విశ్లేషిస్తున్నారు. దొంగతనం జరిగిన సమయంలో ఏటీఎంలో ఉన్న నగదు మొత్తాన్ని అధికారికంగా వెల్లడించలేదు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.
కాగా ఇటీవల కొద్ది నెలలుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకుంటున్న వరుస ఏటీఎం దోపిడీలు ఆందోళన కలిగిస్తున్నాయి. తెలంగాణలోని రాజన్న-సిరిసిల్ల జిల్లా, ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్‌కు కేవలం కొన్ని మీటర్ల దూరంలో ఉన్న ఓ SBI ఏటీమ్‌ను ఏప్రిల్ 11వ తేదీ తెల్లవారుజామున దొంగలు పూర్తిగా దోచుకున్నారు. దానిని పగలగొట్టలేకపోయిన దొంగలు ఆ యంత్రాన్ని తవ్వి బయటకు తీసి ఒక వాహనంలో ఎత్తుకుపోయారు. అయితే ఏటిఎమ్‌ను పగలగొట్టడం వీలుకాకపోవడంతో దొంగలు డబ్బు తీసుకోకుండానే దొంగిలించిన ఆఏటిఎమ్‌ను అక్కపల్లి సమీపంలో వదిలిసి పరారయ్యారు. 2025 డిసెంబర్‌లోనూ ఇదే మాదిరి మరో సంఘటన చోటు చేసుకుంది. ఐదుగురు సభ్యుల ముఠా గ్యాస్ కట్టర్లను ఉపయోగించి నిజామాబాద్ నగరంలోని రెండు ఏటీఎంలలోకి చొరబడ్డారు. సాయినగర్‌లోని ఎస్‌బీఐ ఏటీఎం, ఆర్యానగర్‌లోని డీసీబీ ఏటీఎం నుండి మొత్తం సుమారు రూ. 39 లక్షలు దోచుకున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.