రండి.. నన్ను ప్రశ్నించండి.. శివమణి స్టైల్‌లో ప్రజలకు నెంబర్ ఇచ్చి మరీ ఎమ్మెల్యే ఓపెన్ ఆఫర్!
కమాన్ ఆస్క్ మీ.. సమస్యలపై ప్రశ్నించండి, నన్ను నిగ్గదీసి అడగండి అని ఓపెన్ ఆఫర్ ఇచ్చారు ఆ నియోజక వర్గ ఎమ్మెల్యే. అంతే కాదు తనను కాంటాక్ట్ చేసేందుకు శివమణి స్టైల్‌లో ఫోన్ నెంబర్ కూడా ఇచ్చేయడంతో పాటు 2029 ఎన్నికల్లో నెల్లూరు రూలర్ ఎవరనే దానిపైన క్లారిటీ ఇచ్చేశారు. ఇంతకూ ఎవరా ఎమ్మెల్యే అనేగా మీ డౌట్ అయితే ఈ స్టోరీ చదవాల్సిందే

ఏ మాటకు ఆమాట స్థానిక సమస్యలపై సోషల్ మీడియాలో ప్రశ్నిస్తేనే కేసులు పెడుతున్న ఈ రోజుల్లో రండి నన్ను ప్రశ్నించండి అని ఓ ఎమ్మెల్యే ప్రజలకు పిలుపునివ్వడం నిజంగానే జవాబుదారితం కదూ. అదే పని చేశారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. తనను ప్రశ్నించండి అంటూ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రజలు తమ సమ్యలపై ప్రశ్నించేందుకు తన ఫోన్ నెంబర్ కూడా చెప్పేశారు.
ఎన్నికల్లో ప్రజలు వేసిన ఓట్లతో గెలిచిన నాయకులు.. తమని ప్రశ్నించకూడదు అంటే అది ధర్మం కాదు, ప్రతి పౌరుడి ప్రశ్నను ఎదుర్కోవాల్సిందే.. అందుకే నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజానీకానికి పిలుపునిస్తున్నా.. మీకు ఏ సందేహం ఉన్నా నన్ను ప్రశ్నించవచ్చు. ఫోన్, సోషల్ మీడియా, లేదా నేరుగా ఎమ్మెల్యే కార్యాలయానికి వచ్చి కూడా నన్ను ప్రశ్నించవచ్చుని కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు. ఎస్సీ వాడలో రెండేళ్లుగా అభివృద్ధి పనులు జరగకపోవడంపై ఆయన ప్రజలకు క్షమాపణలు కోరారు.
కనుపర్తిపాడు దళితవాడలో ఈ రెండు ఏళ్లుగా ఒక్క పని కూడా జరగలేదని.. తమ దృష్టికి ఇటీవలే వచ్చినట్టు తెలిపారు. అందుకే తాను, తన తమ్ముడు నేరుగా దళితవాడకు వెళ్లి ప్రతి వీధి తిరిగి స్థానికులందరినీ కూర్చోబెట్టుకొని మాట్లాడాడమన్నారు. ఈ సమస్యలన్నీ తమకు రాత్రే తెలిశాయని.. అయినా ప్రత్యక్షంగా విచారణ కోసం వచ్చామన్నారు. కచ్చితంగా ఇక్కడ ఏదో తప్పు జరిగింది.అందుకే తలదించుకొని కనుపర్తిపాడు దళితవాడకు బహిరంగంగా క్షమాపణలు చెప్తున్నామన్నారు.
జరిగిన తప్పును సరిదిద్దుతూ, కనుపర్తిపాడు దళితవాడ అభివృద్ధి కోసం రూ. 50 లక్షల నిధులతో టెండర్లు పిలవాలని అధికారులను ఆదేశించినట్లు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. అలాగే వచ్చే ఎన్నికల్లో తన తమ్ముడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఎమ్మెల్యే కావాలని అందరూ ఆశిస్తున్నారని, అయితే పోటీ ఎవరనేది సీఎం చంద్రబాబు , లోకేష్ నిర్ణయిస్తారని తెలిపారు. పార్టీ అధిష్ఠానం గిరిధర్ రెడ్డిని, తన కుమార్తె సాయి వైష్ణవిని లేదా మహిళా, బీసీ కోటాలో నందిమండలం భానుశ్రీని నిలబెట్టినా.. చివరకు మరెవరిని ఖరారు చేసినా తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. రూరల్ నియోజకవర్గ అభివృద్ధికి తమ కుటుంబం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందన్నారు.
నెల్లూరు కార్పొరేషన్ డివిజన్ల డీ-లిమిటేషన్‌లో తన జోక్యం లేదని కాకాణి గోవర్ధన్ విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. మీడియా ముందే నగర కమిషనర్‌కు ఫోన్ చేసి, ఎన్నికల కమిషన్ నియమాల ప్రకారం నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు. టీడీపీ, వైఎస్సార్‌సీపీ, జనసేన, బీజేపీ, సీపీఎం సహా అన్ని పార్టీలు ఇచ్చిన అభ్యంతరాలను పరిశీలించి, నిజమైన వాటిని సరిచేయాలని ఒక ఎమ్మెల్యేగా విజ్ఞప్తి చేశారు. స్థానిక సమస్యలపై యువత కూడా చురుగ్గా స్పందించాలని కోటంరెడ్డి పిలుపునిచ్చారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
