AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Traffic Rules: బెజవాడ వాహనదారులకు హెచ్చరిక.. ఇకపై వన్ వేలో వస్తే వాహనం సీజ్..!

Traffic Rules: ఇకపై కేవలం ఫైన్లకే పరిమితం కాకుండా.. పదేపదే నిబంధనలు ఉల్లంఘించే వారిపై వాహనం సీజ్ చేసే దిశగా చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. నగర వ్యాప్తంగా ఇప్పటికే ఉన్న సీసీ కెమెరాల ద్వారా రాంగ్‌రూట్ డ్రైవింగ్‌ను గుర్తిస్తున్న పోలీసులు. ఇక ఫీల్డ్‌లో

Traffic Rules: బెజవాడ వాహనదారులకు హెచ్చరిక.. ఇకపై వన్ వేలో వస్తే వాహనం సీజ్..!
Traffice Rules
M Sivakumar
| Edited By: |

Updated on: May 16, 2026 | 6:35 PM

Share

Traffic Rules: విజయవాడ నగరంలో ట్రాఫిక్ రూల్స్‌ను లైట్ తీసుకుంటున్న వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు కొత్త నిబంధనలు జారీ చేస్తున్నారు. ముఖ్యంగా వన్‌వే రోడ్లలో ప్రయాణించే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో.. ఇక కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఫైన్ వేసి వదిలేస్తున్న పోలీసులు. ఇప్పుడు పరిస్థితి అదుపు తప్పుతోందని భావిస్తున్నారు.

యూటర్న్ చాలా దూరం ఉంది ఎదురుగా ఎవరూ రావడం లేదు అంటూ చాలామంది డ్రైవర్లు రాంగ్‌రూట్‌లోకి ఎంటర్ అవుతున్నారు. కానీ అదే నిర్లక్ష్యం.. ఎదురుగా వచ్చే వాహనదారులకు ప్రమాదంగా మారుతోంది. ప్రధానంగా బెంజ్ సర్కిల్, బందర్ రోడ్, ఎలూరు రోడ్, గవర్నర్‌పేట, రైల్వే స్టేషన్ పరిసరాలు, కనకదుర్గ వారధి మార్గాల్లో వన్‌వే ఉల్లంఘనలు భారీగా నమోదవుతున్నట్లు ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. ఆఫీస్ టైమింగ్స్, స్కూల్ అవర్స్, ఈవెనింగ్ పీక్ అవర్స్‌లో అయితే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతోందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజుకు వందకు పైగా వన్‌వే ఉల్లంఘన కేసులు నమోదు చేస్తున్నప్పటికీ.. చాలా మంది వాహనదారుల్లో మార్పు కనిపించడం లేదని ట్రాఫిక్ విభాగం పేర్కొంటోంది. జరిమానాలు చెల్లించి మళ్లీ అదే తప్పు చేస్తున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉందని అధికారులు చెబుతున్నారు.

దీంతో ఇకపై కేవలం ఫైన్లకే పరిమితం కాకుండా.. పదేపదే నిబంధనలు ఉల్లంఘించే వారిపై వాహనం సీజ్ చేసే దిశగా చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. నగర వ్యాప్తంగా ఇప్పటికే ఉన్న సీసీ కెమెరాల ద్వారా రాంగ్‌రూట్ డ్రైవింగ్‌ను గుర్తిస్తున్న పోలీసులు. ఇక ఫీల్డ్‌లో ప్రత్యేక డ్రైవ్‌లు కూడా చేపట్టాలని నిర్ణయించారు. ముఖ్యమైన జంక్షన్ల వద్ద ట్రాఫిక్ సిబ్బందిని పెంచడంతో పాటు.. మొబైల్ పెట్రోలింగ్ టీమ్‌లను కూడా రంగంలోకి దింపనున్నారు. వన్‌వే ఉల్లంఘనలు కేవలం ట్రాఫిక్ జామ్‌కే కాదు.. ప్రాణాంతక ప్రమాదాలకు కూడా కారణమవుతున్నాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో రాంగ్‌రూట్‌లో వేగంగా వచ్చే ద్విచక్ర వాహనాల వల్ల అనేక ప్రమాదాలు నమోదవుతున్నాయని గుర్తు చేస్తున్నారు.

మరోవైపు కొంతమంది వాహనదారులు మాత్రం నగరంలో కొన్ని ప్రాంతాల్లో సరైన సైన్ బోర్డులు లేకపోవడం, డైవర్షన్ సమాచారం స్పష్టంగా కనిపించకపోవడం కూడా సమస్యగా మారుతోందని చెబుతున్నారు. ముఖ్యంగా కొత్తగా నగరానికి వచ్చే వారు అనుకోకుండా వన్‌వేలోకి వెళ్లే పరిస్థితులు ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు. అయితే ట్రాఫిక్ పోలీసులు మాత్రం నిబంధనలు ప్రజల భద్రత కోసం మాత్రమేనని స్పష్టం చేస్తున్నారు. కొన్ని నిమిషాల సమయం ఆదా చేసుకోవాలని చేసే తప్పు జీవితాంతం బాధను మిగిల్చొచ్చు అని హెచ్చరిస్తున్నారు అధికారులు. ఇప్పటికే రూల్స్ బ్రేక్ చేస్తే ఫైన్ అనే దశ దాటిపోయిందని ఇక రూల్స్ అతిక్రమిస్తే వాహనం సీజ్ అనే స్థాయికి పరిస్థితి చేరుకుందని చెబుతున్నారు ట్రాఫిక్ అధికారులు.

విజయవాడలో ట్రాఫిక్ క్రమశిక్షణ కోసం పోలీసులు చేపడుతున్న ఈ కఠిన చర్యలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం ఇక నగరంలో రాంగ్‌రూట్ డ్రైవింగ్ చేస్తే తప్పించుకోవడం అంత ఈజీ కాదనే సంకేతాలు కనిపిస్తున్నాయి.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us