
Jai Bharat National Party: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఈ తరుణంలో ప్రధాన పార్టీలన్నీ వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. ఇప్పటికే వైసీపీ దాదాపు అన్ని స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించగా.. టీడీపీ, జనసేన కూటమి 99 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాయి. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల మధ్య పొత్తు చర్చలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు వీవీ లక్ష్మీ నారాయణ కూడా దూకుడు పెంచారు. తాను విశాఖపట్నం నుంచి పోటీ చేస్తానంటూ వీవీ లక్ష్మీ నారాయణ క్లారిటీ ఇచ్చారు. శ్రీకాకుళంలో బుధవారం వీవీ లక్ష్మినారాయణ పార్టీ జై భారత్ నేషనల్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు.
ఈ సందర్భంగా లక్ష్మినారాయణ మాట్లాడుతూ.. తాము చిన్న చిన్న పార్టీలతో పొత్తులు పెట్టుకుని ఓ ఫ్రంట్‌గా ఏర్పడి అన్ని స్థానాల్లో పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకువస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన వైసీపీ.. స్వప్రయోజనాల కోసం ఏపీని కేంద్రం వద్ద తాకట్టు పెట్టిందంటూ విమర్శించారు. 25 ఎంపీలను గెలిపించినా రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలను సాధించుకోవడంలో ఘోరంగా విఫలమైందన్నారు.
అవినీతి, డ్రగ్స్, రౌడీయిజం, ప్రకృతి విధ్వంసం లేని ఆంధ్రప్రదేశ్ సాధనే తమ లక్ష్యమంటూ వీవీ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు, హోదా తెస్తామని చెప్పి మోసం చేశారన్నారు. ఇప్పుడు ఎన్నికలు రావడంతో మళ్లీ ప్రత్యేక హోదా అంటూ కొత్త నాటకాలు మొదలు పెట్టారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. మార్పు కోసం తమ పార్టీ పనిచేస్తుందని వెల్లడించారు.
ఇదిలాఉంటే.. విద్యార్థులు మార్చి 1న తలపెట్టిన చలో తాడేపల్లి ప్యాలెస్ ఆందోళనకు వీవీ లక్ష్మీనారాయణ పార్టీ తరపున మద్దతును ప్రకటించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..