AP News: ఓటర్ల జాబితా పంచాయితీకి పుల్‌స్టాప్.. డెడ్‌లైన్ చెప్పేసిన ఎన్నికల కమిషన్.!

| Edited By: Ravi Kiran

Dec 27, 2023 | 12:39 PM

ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ జాబితా పంచాయతీకి తెరపడింది. ఓట్ల గల్లంతు, నకిలీ ఓట్లు, డబుల్ ఎంట్రీ ఓట్లు అంటూ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల పోటాపోటీ ఫిర్యాదులకి తెరపడింది. నిన్న అర్ధరాత్రితో ఓటర్ జాబితాపై అభ్యంతరాల పరిశీలన పూర్తయింది.

AP News: ఓటర్ల జాబితా పంచాయితీకి పుల్‌స్టాప్.. డెడ్‌లైన్ చెప్పేసిన ఎన్నికల కమిషన్.!
AP Voters
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ జాబితా పంచాయతీకి తెరపడింది. ఓట్ల గల్లంతు, నకిలీ ఓట్లు, డబుల్ ఎంట్రీ ఓట్లు అంటూ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల పోటాపోటీ ఫిర్యాదులకి తెరపడింది. నిన్న అర్ధరాత్రితో ఓటర్ జాబితాపై అభ్యంతరాల పరిశీలన పూర్తయింది. తాజా జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదానికి రాష్ట్ర అధికారులు పంపనున్నారు. జనవరి 5వ తేదీన తుది ఓటర్ జాబితా విడుదల కానుంది. రాష్ట్రంలో ఒక పక్క పొలిటికల్ హీట్, మరోవైపు ఓటర్ జాబితాపై ఆరోపణలు.. కొన్నాళ్లుగా అధికార, ప్రతిపక్షాల మధ్య ఓట్ల పంచాయతీ నడుస్తోంది. డోర్ టూ డోర్ వెరిఫికేషన్ తర్వాత ముసాయిదా ఓటర్ జాబితాను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా విడుదల చేసారు. ముసాయిదా జాబితా ప్రకారం రాష్ట్రంలో 4 కోట్ల 2 లక్షల మందిపైగా ఓటర్లు ఉన్నారు. అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసి డ్రాఫ్ట్ ఓటర్ జాబితాకు సంబందించిన డ్రైవ్‌లను అందించారు. జిల్లాలు, నియోజకవర్గాల వారీగా ఉన్న ఓటర్ జాబితాను పరిశీలించుకునేందుకు డిసెంబర్ 9వ తేదీ వరకూ గడువు ఇచ్చారు. అక్టోబర్ 27న డ్రాఫ్ట్ ఓటర్ జాబితాను ప్రకటించింది ఎన్నికల కమిషన్. డిసెంబర్ 9 వరకూ జాబితాపై అభ్యంతరాలు, కొత్తగా ఓట్ల నమోదు, ఓట్ల తొలగింపు, ఓటు వేరే ప్రాంతానికి మార్చుకునేలా వెసులుబాటు కల్పించింది. వచ్చిన అభ్యంతరాల పరిశీలనకు ఈ నెల 26న గడువుగా పెట్టుకుంది. ఈ గడువు ముగియడంతో ఓటర్ లిస్ట్ వివాదాలకు ముగింపు పడినట్లుగా తెలుస్తుంది.

జనవరి 5న తుది ఓటర్ జాబితా..

అక్టోబర్ 27న ప్రకటించిన ముసాయిదా ఓటర్ జాబితాపై వరుస ఫిర్యాదులు వెల్లువెత్తాయి. తమ పార్టీ సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారంటూ తెలుగుదేశం, వైఎస్సాఆర్సీపీ పార్టీలు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనాకు పోటాపోటీ ఫిర్యాదులు చేసాయి. ఏపీ సీఈవోతో పాటు కేంద్ర ఎన్నికల కమిషన్‌కు కూడా కంప్లైంట్ చేశారు ఆయా పార్టీల నేతలు. ముఖ్యంగా ఫామ్-7 ద్వారా అనధికారికంగా ఓట్లు తొలగిస్తున్నారని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. ఓటర్‌తో సంబంధం లేకుండా ఓటు తొలగించేలా ఆన్లైన్‌లో దరఖాస్తు చేసారని ఆరోపించారు. ఒకే వ్యక్తి వందలాది ఓట్ల తొలగింపునకు దరఖాస్తు చేసినట్లు ఆధారాలతో సహా సీఈవోకు సమర్పించారు. ఇక ఫామ్- 6 ద్వారా అర్హత లేనివారికి, ఒక్కొక్కరికి రెండు మూడు చోట్ల ఓట్ల కోసం అప్లై చేసినట్లు ఫిర్యాదులు చేశారు. ఒకే ఇంటి నెంబర్‌తో పదుల సంఖ్యలో ఓట్ల నమోదుకు దరఖాస్తు చేయడం వెనుక కుట్ర ఉందని రెండు పార్టీల నేతలు ఫిర్యాదు చేశారు. మరోవైపు తెలంగాణలో ఓటు వేసిన సుమారు నాలుగున్నర లక్షల మందికి ఏపీలో ఓటు ఉందని.. వెంటనే తొలగించాలని వైసీపీ నేతలు సీఈవోకు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. ఇలా లక్షలాది ఫిర్యాదులు ఎన్నికల కమిషన్‌కు అందాయి. గడువు ముగిసినా పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. ఆయా ఫిర్యాదులపై ఎన్నికల కమిషన్ ఎప్పటికప్పుడు విచారణకు ఆదేశించింది. ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం బృందం కలెక్టర్లతో సమావేశంలో కూడా ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించింది. ఓటర్ జాబితాలో తప్పుల్లేకుండా చూడాలని సూచించారు. క్షేత్రస్థాయి పరిశీలన తర్వాతే ఓట్ల తొలగింపు లేదా కొత్త ఓటు నమోదు చేయాలని సూచించారు. దీంతో అత్యంత పకడ్బందీగా ఓటర్ జాబితా అభ్యంతరాలపై పరిశీలన చేసి జాబితా సిద్ధం చేశారు. ఈ జాబితాను కేంద్ర ఎన్నికల కమిషన్ కు పంపనున్నారు రాష్ట్ర అధికారులు.

కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం లభిస్తే జనవరి 5న ఫైనల్ SSR విడుదల చేయనున్నారు. వచ్చే ఎన్నికలకు ఈ ఓటర్ లిస్ట్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయి. అయితే రాజకీయ పార్టీల నుంచి వచ్చిన ఫిర్యాదులు ఎంతమేర పరిష్కారం అయ్యాయనేది తుది జాబితా విడుదల తర్వాతనే స్పష్టత రానుంది.