Andhra: ఎంత దారుణం.. తుఫాన్ బీభత్సంతో పొరుగూరులోనే చిన్నారి అంత్యక్రియలు.. ఈ స్టోరీ చదివితే కన్నీళ్లే..

విజయనగరం జిల్లా మెంటాడ మండలంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. నాలుగు నెలల గిరిజన బాలుడు అనారోగ్యంతో మృతి చెందాడు.. ఈ క్రమంలోనే.. తుఫాన్ ప్రభావం కారణంగా నది ఉధృతంగా ప్రవహించడం వల్ల మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లే అవకాశం లేక.. కుటుంబ సభ్యులు పొరుగూరులోనే అంత్యక్రియలు జరపాల్సి వచ్చింది.

Andhra: ఎంత దారుణం.. తుఫాన్ బీభత్సంతో పొరుగూరులోనే చిన్నారి అంత్యక్రియలు.. ఈ స్టోరీ చదివితే కన్నీళ్లే..
Mentada Child Dead

Edited By: Shaik Madar Saheb

Updated on: Nov 02, 2025 | 2:57 PM

విజయనగరం జిల్లా మెంటాడ మండలంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. నాలుగు నెలల గిరిజన బాలుడు అనారోగ్యంతో మృతి చెందాడు.. ఈ క్రమంలోనే.. మొంథా తుఫాన్ ప్రభావం కారణంగా నది ఉధృతంగా ప్రవహించడం వల్ల మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లే అవకాశం లేక.. కుటుంబ సభ్యులు పొరుగూరులోనే అంత్యక్రియలు జరపాల్సి వచ్చింది. ఈ విషాదకర ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం.. లోతుగెడ్డ గ్రామపంచాయతీ పరిధిలోని మధుర పోరపుబాడవ, దిబ్బగుడి గ్రామాలు చంపావతి నది అవతల వైపు ఉన్నాయి. ఈ గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నది పైనే ఆధారపడి ఉన్నాయి. నది ఉధృతంగా ప్రవహిస్తే గ్రామాలు పూర్తిగా బయటి ప్రపంచానికి రాకపోకలు తెగిపోతాయి. ఇలాంటి పరిస్థితుల్లో పోరపుబాడవకు చెందిన గిరిజన బాలుడు జనార్దన్ కడుపునొప్పితో బాధపడగా.. కుటుంబ సభ్యులు తెప్ప పై చంపావతి నది దాటి గజపతినగరం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు.

అనంతరం విజయనగరం ఘోషా ఆసుపత్రికి తరలించారు.. అయినా.. పరిస్థితి తీవ్రంగా మారింది.. చివరగా విశాఖ కేజీహెచ్‌కి తరలించినా చిన్నారి ప్రాణాలు నిలువలేదు. బుధవారం ఉదయం బాలుడు మృతి చెందగా తుఫాన్ కారణంగా చంపావతి నది పొంగిపొర్లడంతో తెప్పలు నడవలేని పరిస్థితి ఏర్పడింది. రిజర్వాయర్ నుంచి నీరు విడుదల కావడంతో రాకపోకలు పూర్తిగా ఆగిపోయాయి. దీనితో మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లడం సాధ్యంకాలేక కుటుంబ సభ్యులు నది ఇవతల ఉన్న జీరికివలస గ్రామంలోనే బాలుడికి అంత్యక్రియలు నిర్వహించారు.

ఈ విషాదకర ఘటనతో కుటుంబసభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. ఈ ఘటన తుఫాన్ ప్రభావం వల్ల గిరిజనులు ఎదుర్కొంటున్న కష్టాలను, రవాణా సౌకర్యం లేని కారణంగా వారు ఎదుర్కొంటున్న సమస్యలకు నిలువుటద్దంగా మారింది. ఇప్పటికైనా అధికారులు ఈ గ్రామాల రాకపోకలకు .. శాశ్వత పరిష్కారం చూపాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..