పుల్‌టైం ఇన్‌స్టాలో రీల్స్.. పార్ట్‌టైం దొంగతనం.. ఈ కి’లేడి’ టాలెంట్ చూస్తే షాకవ్వాల్సిందే.!

|

Mar 03, 2024 | 6:55 PM

సినీనటి సౌమ్యశెట్టిని అరెస్ట్ చేశారు విశాఖ పోలీసులు. రిటైర్డ్ పోస్టల్ ఉద్యోగి ప్రసాద్ ఇంట్లో కిలోకిపైగా బంగారం కొట్టేసి కూల్‌గా గోవాకి చెక్కేసింది సౌమ్య. అయితే.. ఇంట్లో బంగారం మాయం కావడంతో..

పుల్‌టైం ఇన్‌స్టాలో రీల్స్.. పార్ట్‌టైం దొంగతనం.. ఈ కిలేడి టాలెంట్ చూస్తే షాకవ్వాల్సిందే.!
Soumya Shetty
Follow us on

వైజాగ్, మార్చి 3: నటనలో టాలెంట్ చూపించాల్సిన ఓ నటి.. దొంగతనంలో టాలెంట్ చూపించింది. ఏకంగా కేజీ బంగారం కొట్టేసి.. గోవాలో కులికేందుకు వెళ్లింది. చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలైంది. ఇంతకీ ఎవరా నటి? దొంగతనం చేయాల్సిన అవసరం ఎందుకొచ్చింది? విశాఖకు చెందిన ఈ బొద్దుగుమ్మ.. యువర్స్‌ లవింగ్లీ, ద ట్రిప్ మూవీస్‌లో హీరోయిన్‌గా నటించింది. ఆ తర్వాత అవకాశాలు రాకపోవడంతో.. రీల్స్, వీడియోలు చేసుకుంటూ అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తోంది.

ఈ క్రమంలో విశాఖకు చెందిన రిటైర్డ్ పోస్టల్ ఉద్యోగి ప్రసాద్ కుమార్తెతో పరిచయం పెంచుకుంది. ఓ షార్ట్ ఫిలిమ్ ఆడిషన్‌లో మొదలైన ఈ స్నేహం.. తరచూ ఇంటికి వెళ్లే వరకూ వచ్చింది. ఆ చనువుతో ఇంట్లో పరిసరాలన్నీ స్కాన్ చేసిన సౌమ్యకు.. ఇంట్లో ఉన్న బంగారు నగలపై కన్ను పడింది. వాటిని ఎలాగైనా కొట్టేయాలని నిర్ణయానికి వచ్చిన ఈ నటి.. అవకాశం కోసం ఎదురుచూసింది. అదును చూసి కిలోకు పైగా బంగారం కొట్టేసి.. కూల్‌గా గోవాకి చెక్కేసింది సౌమ్య.

ఓ వివాహ వేడుకకి వెళ్లాలని ప్రసాద్ కుటుంబం భావించింది. కానీ ఇంట్లో చూస్తే నగలు కనిపించడం లేదు. దీంతో షాక్‌కి గురైన ప్రసాద్ కుటుంబం.. పోలీసులకు సమాచారం అందించింది. ఇంటికి వచ్చిన వాళ్లందరి వివరాలను పోలీసులకు వివరించారు. దీంతో రెండు బృందాలుగా విడిపోయిన పోలీసులు అనుమానితులపై ఆరాతీశారు. ముగ్గుర్ని అదుపులోకి తీసుకుని విచారించగా హీరోయిన్ సౌమ్యశెట్టి బండారం బయటపడింది.

సౌమ్యపై తమకు అనుమానం ఉందని రిటైర్డ్ ఉద్యోగి చెప్పడంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. తమదైన స్టైల్‌లో విచారించగా.. అసలు విషయాన్ని బయటపెట్టింది. దీంతో.. ఆమె దగ్గరున్న సొత్తును సీజ్ చేశారు. సౌమ్యను కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 15 రోజుల రిమాండ్ విధించారు. సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు, మత్తెక్కించే రీల్స్.. పోస్ట్ చేస్తూ.. నెటిజన్లకు పిచ్చెక్కించే ఈ ముద్దుగుమ్మలో చోరకళ కూడా ఉందని తెలిసి నెటిజెన్లు ఆశ్చర్యపోతున్నారు. తియ్యగా, కుటుంబ సభ్యురాలిలా మాట్లాడే సౌమ్యలాంటి వాళ్లతో జాగ్రత్తగా ఉండాలని సజెస్ట్ చేస్తున్నారు పోలీసులు.

 

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..