Andhra: మౌనిక, రవీంద్ర కలిసింది అక్కడే.. ఆ ఒక్క విషయంతో ఫ్రిడ్జ్‌లో ముక్కలు ముక్కలుగా.. సంచలన నిజాలు..
గాజువాక మౌనిక మర్డర్ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. పక్కా ప్లాన్‌తో.. మౌనికను అంతమొందించిన రవీంద్ర.. క్రైమ్ నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేశాడు. చివరికి పోలీసులకు దొరికిపోయాడు. డేటింగ్ యాప్ ద్వారా ప్రేమ, ఆపై ద్రోహం, చివరకు హత్యతో ముగిసిన ఈ ట్రాజిక్ స్టోరీలో గెలిచిన వారెవరూ లేరు. ఓ కుటుంబం కూతుర్ని కోల్పోతే.. ఇంకో కుటుంబం రోడ్డున పడింది.

విశాఖ జిల్లా గాజువాక మౌనిక హత్య కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మౌనిక హత్యకు సంబంధించి అన్ని కోణాల్లో పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. మౌనికను రవీంద్ర హత్య చేయడానికి కారణమేంటి.. హత్యకు ముందు అసలేం జరిగిందన్న అంశంపై పోలీసులు ఫోకస్ పెట్టారు. కొన్నేళ్ల క్రితమే డేటింగ్ యాప్ ద్వారా నేవీ ఉద్యోగి రవీంద్రకు మౌనిక పరిచయం అయింది. కరోనా తర్వాత.. 2021 నుంచి ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. అయితే 2023లో మౌనికకు బ్రేకప్ చెప్పానంటూ పోలీసులకు రవీంద్ర వెల్లడించాడు. ఆ తర్వాత వేరే యువతితో రవీంద్రకు పెళ్లి జరిగింది. ఏడాది క్రితం గాజువాకలోని ఎల్వీనగర్‌లో ఉన్న అపార్ట్‌మెంట్లో అద్దెకు దిగాడు రవీంద్ర. 4 నెలల క్రితం డెలివరీ కోసం పుట్టింటికి వెళ్లింది రవీంద్ర భార్య. ఇప్పుడు అతడికి ఓ కూతురు కూడా ఉంది. అయితే ఇంకోవైపు మౌనికతో ప్రేమాయణం నడిపిస్తూనే ఉన్నాడు రవీంద్ర.
దీంతో ఆమె తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చింది. అంతేకాదు.. అతడి ఐడీ కార్డును లాక్కుంది. తన సర్వీస్‌లో ఇబ్బంది అవుతుందని ఆందోళన చెందిన రవీంద్ర.. పరిస్థితి చేయి దాటిపోతుందని భావించి.. మౌనికను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. ఆన్‌లైన్లో కత్తి, క్లీనింగ్ సామాగ్రిని ఆర్డర్ చేసుకున్నాడు. నిన్న మధ్యాహ్నం మౌనికను ఇంటికి తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఐడీ కార్డు కావాలని రవీంద్ర.. తనను పెళ్లి చేసుకోవాలని మౌనిక డిమాండ్ చేయడంతో.. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.
మౌనిక గట్టిగా కేకలు వేస్తుండడంతో.. ఆమె గొంతు నులిమి హత్య చేశాడు. ఆ తర్వాత ముక్కలుగా నరికి భాగాలను వేరు చేసి.. వేరువేరు చోట్ల పడేయాలని నిర్ణయించుకున్నాడు నిందితుడు. కొన్ని ముక్కలను ఫ్రిజ్‌లో దాచిపెట్టాడు. ఇంకొన్ని భాగాలను ఓ బాక్సులో ఉంచాడు. తల చేతులు తీసుకెళ్లి ముందు అడవి వరం ప్రాంతంలో కాల్చేశాడు. అనంతరం తన స్నేహితుడికి ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్పేశాడు. అతడు రవీంద్ర కుటుంబ సభ్యులకు, భార్యకు విషయాన్ని చెప్పాడు. వారు పోలీసులకు సమాచారం అందజేయడంతో.. రవీంద్రను అదుపులోకి తీసుకున్నారు.
మౌనిక హత్య కేసులో నిందితుడు రవీంద్రకు రిమాండ్ విధింపు
సోమవారం రాత్రి రవీంద్రను మెజిస్ట్రేట్ ఎదుట పోలీసులు హాజరు పరిచారు. న్యాయమూర్తి ఏప్రిల్ 10వ వరకు కోర్టు రిమాండ్ విధించింది. అనంతరం నిందితుడు రవీంద్రను విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే ఈ కేసులో రవీంద్రను పోలీస్‌కస్టడీకి కోరే అవకాశాలున్నాయి. ప్రాథమిక దర్యాప్తులో ఎన్నో విషయాలపై రవీంద్ర నోరు మెదపలేదు. దీనిపై పోలీసులు మరింత లోతుగా విచారణ చేసేందుకు కస్టడీకి తీసుకునే అవకాశాలున్నాయి. గాజువాకలో సంచలనం రేపిన ఈ క్రూయల్ మర్డర్‌కి సంబంధించి.. మున్ముందు మరిన్ని విషయాలు వెలుగు చూస్తాయని పేర్కొంటున్నారు.
న్యాయం చేయండి..
నిందితుడిని కఠినంగా శిక్షించాలని సీఎం, డిప్యూటీ సీఎంను మౌనిక తండ్రి కోరారు. తమకు న్యాయం చేయాలని.. ఏ తల్లిదండ్రులకు ఇలా జరగకూడదన్నారు. సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం నిందితుడు రవీంద్రను పోలీసులు ఘటనా స్థలానికి తీసుకొచ్చారు. నిందితుడిని తీసుకెళ్లే పోలీస్ వాహనాన్ని మృతురాలి తండ్రి, బంధువులు అడ్డుకున్నారు. రవీంద్రపై మృతురాలి బంధువులు దాడి చేశారు. నిందితుడిని తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు.
