Visakha Steel – Vijayasai Reddy – Avanthi Srinivas: విశాఖ ఉక్కు జాతి సంపద అని ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. అలాంటి జాతి సంపదను ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం సరికాదని మంత్రి వెల్లడించారు. ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా పనులు ఉండరాదన్న మంత్రి.. మన అభిప్రాయభేదాలను , స్థానికంగా ఉన్న రాజకీయ విభేదాలను పక్కనపెట్టి అందరూ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లాంట్ పరిరక్షణకు ముందుంటుందని చెప్పుకొచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఢిల్లీ జంతర్‌మంతర్ దగ్గర జరిగే ఆందోళనలో తెలుగువారంతా పాల్గొని నిరసన తెలపాలని మంత్రి కోరారు.
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలన్న కేంద్ర నిర్ణయాన్ని తమ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుందని, ప్లాంట్‌ను పరిరక్షించుకునేందుకు ఎంతటి పోరాటానికైనా పార్టీ సిద్ధంగా ఉందని వైయస్‌ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. నష్టాల్లో ఉన్న స్టీల్ ప్లాంట్‌ను లాభాల్లోకి తీసుకువచ్చే ప్రయత్నం చేయాలి కానీ, ప్రైవేటీకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం కరెక్ట్ కాదన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల నేతలతో ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్ ఇవాళ విశాఖలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
ప్లాంట్‌ను లాభాల్లోకి తీసుకురావాలంటే.. ఉక్కు కర్మాగానికి ఉన్నటువంటి రుణాన్ని ఈక్విటీ కింద మార్చి రుణభారం, వడ్డీ భారాన్ని తగ్గించాలాని ఎంపీ కేంద్రానికి సూచించారు. దీనికి ముడిసరుకు కోసం క్యాపిటీవ్ మైన్స్ కేటాయించాలన్నారు. ఈ రెండూ చేస్తే నష్టాల్లో ఉన్న సంస్థ లాభాల్లోకి వస్తుందని విజయసాయి వివరించారు.
Read also: Podu land fight: పోడు చిచ్చుతో పచ్చటి పల్లెల్లో చిందుతోన్న నెత్తురు