నగ్నంగా డ్యాన్స్ చేయాలంటూ ఓ మహిళా ఈవెంట్ ఆర్గనైజర్‌పై మూకుమ్మడి దాడి చేశారు నలుగురు యువకులు. రాత్రంతా ఓ గదిలో బంధించి వేధించారు. ఈ క్రమంలో రాత్రంతా నరకం అనుభవించిన ఆ బాధితురాలు తెల్లవారుజామున అక్కడి నుంచి తప్పించుకొని భర్తతో కలిసి పోలీసులను ఆశ్రయించారు. హైదరాబాద్ శివారులో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులో వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పుట్టినరోజు వేడుకల కోసం ఓ మహిళా ఈవెంట్ ఆర్గనైజర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు కొందరు. ఆ క్రమంలో ఫిబ్రవరి 22న రాత్రి పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఇక అర్ధరాత్రి సెలబ్రేషన్లు ముగిసిన తరువాత ఫుల్‌గా మద్యం సేవించిన నలుగురు యువకులు.. నగ్నంగా డ్యాన్స్ చేయాలంటూ ఆమెను బలవంతపెట్టారు. అందుకు ఆమె నిరాకరించడంతో కత్తులతో బెదిరించారు. ఆ తరువాత భయపెట్టి గదిలో బంధించారు. రాత్రంతా వారి చెరలోనే ఉన్న బాధితురాలు తెల్లవారుజామున ఎట్టకేలకు తప్పించుకొని ఇంటికి చేరుకుంది. తరువాత తన భర్తతో కలిసి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తును ప్రారంభించారు. మహిళపై దాడి చేసిన యువకుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు ఏసీపీ వెల్లడించారు.